ఓట్ల చీలిక లేకుండా…సత్తా చూపిస్తాం…!

ఆచార్య కోదండరాం… ఉద్యమాల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిల్లలకు రాజనీతి శాస్త్రం బోధించిన మాష్టారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. మృదు స్వభావి, ముక్కు సూటి మనస్తత్వం ఉన్న కోదండరాంకు అందరినీ కలుపుకుపోతారన్న పేరుంది. తెలంగాణ ఉద్యమంలో సకల జనులను ఏకం చేశారు. మరోసారి అదే పంథాతో ముందుకు వెళుతున్నారు. అప్పడు ఉద్యమ సారధిగా…ఇప్పుడు రాజకీయ పార్టీ సారధిగా ఆయన ప్రజలతోనే తన ప్రయాణమంటున్నారు. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరినా, తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడలేదనేది ఆయన వాదన. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ కల నెరవేరలేదంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ…సామాజిక న్యాయం…తెలంగాణ ఫలాలు ప్రజలకు చేర్చడమే తెలంగాణ జనసమితి బాట అంటున్న ప్రొ.కోదండరాం ‘తెలుగు పోస్ట్’ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం….!

తెలుగు పోస్ట్ : పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది?
ప్రొ.కోదండరాం : ఏ పోరాటానికైనా, ఆందోళనకైనా ముగింపు రాజకీయ ప్రక్రియ. ఆ ప్రక్రియ సరిగ్గా ఉండాలి. అలా జరగకపోతే ప్రజలకు ఏమాత్రం మేలు జరగదు. సుదీర్ఘ పోరాటం జరిపి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రాజకీయాలే అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఈ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పార్టీలు ఈ ప్రయత్నాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాయి. అందుకే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

తెలుగు పోస్ట్ : పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం చేస్తున్నారు ? 
ప్రొ.కోదండరాం : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికను రూపొందించాం. జూన్ 15వ తేదీ నాటికి అన్ని జిల్లాలలో మండల కమిటీల నిర్మాణం పూర్తవుతుంది. ఈ మండల కమిటీలు అన్ని గ్రామాల్లో తిరిగి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసి సభ్యత్వాలు నమోదు చేస్తారు. అనంతరం అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఈ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో గ్రామంలోని సమస్యలు తెలుసుకుంటారు. ఇలా గ్రామగ్రామాన క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం.

తెలుగు పోస్ట్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందా ?
ప్రొ.కోదండరాం : తెలంగాణ కు నిధులు ఉన్నాయి. కానీ వాటి దుర్వినియోగం విపరీతంగా జరుగుతోంది. ఈ విషయాన్ని కాగ్ నివేదికనే స్పష్టం చేసింది. రాష్ట్రంలో కేటాయించిన నిధులు మంజూరు చేయకపోవడం, మంజూరైన నిధులను ఖర్చు చేయకపోవడాన్ని మనం చూస్తున్నాం. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట విపరీతంగా అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిధుల దుర్వినియోగాన్ని ఆపాలి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ఖర్చును పరిమితి లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా విపరితంగా ప్రాజెక్టులకు వ్యయం పెంచుతోంది. ఇలా ప్రాజెక్టుల వ్యయం పెంచడంతో ఉన్న నిధులు సరిపోక అప్పులు తేవాల్సి వస్తోంది. ఇదే నిధుల దుర్వినియోగానికి కారణమవుతోంది. ఇది ప్రభుత్వం ఆపకపోతే మనం ఆశించిన అభివృద్ధిని సాధించలేము. నియామకాల విషయానికి వస్తే ఖాళీలు ఉన్నా ప్రభుత్వం భర్తీ చేసే ప్రయత్నం చేయడం లేదు. ఖాళీలను కూడా కుదించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనకు కనపడుతున్న వాస్తవం.

తెలుగు పోస్ట్ : ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై మీ అభిప్రాయం ?
ప్రొ.కోదండరాం : తక్కువ ఖర్చుతో నీళ్లందించే అవకాశాలు పక్కన పెట్టి నిర్మాణ వ్యయాలు ఎక్కువ చేసి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లకు లాభం ఉందేమో కానీ దీర్ఘకాలికంగా ఈ సమాజానికి ఇది భారంగా మారుతుంది. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే మేడిగడ్డ నుంచి వచ్చే నీరే కాళేశ్వరం వద్ద ఉంటుంది. మేడిగడ్డ వద్ద ఉన్న నీళ్లను సరిగ్గా వాడుకోగలిగితే తక్కువ ఖర్చుతో నీళ్లు తీసుకువచ్చే అవకాశం ఉండేది. కానీ, ఇవాళ రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు వ్యయం 25 వేల కోట్ల నుంచి 88 వేల కోట్లకు పెంచి ప్రజల మీద ఆర్థికభారం వేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. జూరాల ద్వారా నీటిని చెరువులకు వాడుకునే అవకాశం ఉంది. తూర్పు పాలమూరుకు నీళ్లిచ్చేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంచుకుంటే సరిపోయేది. కానీ జూరాల నుంచి తేవాల్సిన నీళ్లను శ్రీశైలం నుంచి తీసుకురావాలనే ఆలోచన చేయడంతో పెద్ద రిజర్వాయర్లు నిర్మించాల్సి వస్తోంది. దీంతో నీళ్లు అందించే పేరుతో, ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చే పేరుతో కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలకు తక్కువ ఖర్చుతో నీళ్లు అందించాలనే తాపత్రయం మాత్రం అందులో లేదు.

తెలుగు పోస్ట్ : రానున్న ఎన్నికల్లో పొత్తులకు అవకాశం ఉందా ?
ప్రొ.కోదండరాం : ప్రజల సమస్యలను తీసుకుని పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడం ద్వారా రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనేదే జన సమితి ఆలోచన. ఒంటరిగానే పోటీ చేయాలనేది జన సమితి నిర్ణయం. ప్రజలను రాజకీయంగా సమీకరించకుండా, ఐక్యం చేయకుండా ఓటర్లని ఐక్యం చేయడం అనేది సాధ్యం కాదు. జరగాల్సింది ప్రజలను రాజకీయంగా ఐక్యం చేయడం. రాజకీయంగా ఐక్యం అయితేనే ఓటర్లుగా ఐక్యం అవుతారు. ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయడమే మా ప్రయత్నం. మా ప్రయత్నం వల్ల ఓట్ల చీలిక ఉండదు. మా ద్వారా ప్రజలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను అర్థం చేసుకుని మరింత ఐక్యమై, ఒక శక్తిగా మారే అవకాశం ఉంది.

తెలుగు పోస్ట్ : మీరెక్కడి నుంచి పోటీ చేయనున్నారు..?
ప్రొ.కోదండరాం : ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే ఆలోచన పార్టీలో ఇంకా చేయలేదు. ఇప్పటికైతే ఏం నిర్ణయం తీసుకోలేదు. పార్టీ నిర్ణయం మేరకే ఎవరి పోటీ ఎక్కడి నుంచి అనేది ఉంటుంది. ఒక్కరి మీదే ఆధారపడి పార్టీని నడపడం కుదరని పని. మేము కొంత నిర్మాణాత్మకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలను కుంటున్నాము. కాబట్టి అందరినీ కలుపుకునే పార్టీని ముందుకు తీసుకెళ్తాం.

తెలుగు పోస్ట్ : ఇతర పార్టీల నేతలను కూడా చేర్చుకుంటున్నారా ?
ప్రొ.కోదండరాం : ఎవరైతే సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తూ, మచ్చలేని నాయకులుగా ఉంటే వారిని పార్టీలో కలుపుకుని వెళతాం. గ్రామాలను సుసంపన్నం చేయడానికి, అభివృద్ధి చేయడానికి గ్రామ పంచాయతీల ద్వారా పని చేయాలనుకుంటున్న అభ్యర్థులను కలిసిరావాలని కోరుతున్నాం. అందరం కలిసి గ్రామాలను బాగుచేయాలనేదే మా లక్ష్యం. నిధులు లేక, విపరీత రాజకీయ జోక్యంతో పలుకుబడి కలిగిన వారు యంత్రాంగాన్ని తమ చేతుల్లో పెట్టుకుని ఇష్ఠారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. దీంతో  గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. కాబట్టి, నిస్వార్థంగా గ్రామాలను అభివృద్ధి చేయాలనుకునే వారు కలిసి వస్తే వారిని కలుపుకుని వెళ్లి గ్రామాలను బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం పోటీ చేయడానికి దరఖాస్తులు కూడా ఆహ్వానించాం. ఔత్సాహికులైన 1700 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మా ప్రయత్నం ఎప్పుడూ కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ : ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ?
ప్రొ.కోదండరాం : పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి జిల్లాల పర్యటన నిర్వహిస్తున్నాం. పార్టీ నిర్మాణానికి సమాంతరంగా ప్రజా సమస్యలపై ఎక్కడా రాజీ లేని పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రస్తుతం భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన లోపాలపై అధ్యయనం చేస్తున్నాం. ప్రతీ మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని సమస్యలను అధ్యయనం చేస్తున్నాం.

Sandeep
About Sandeep 6239 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*