మార్పు మంచికేనా?

ఏపీలో అడ్ర‌స్ గ‌ల్లంతైన కాంగ్రెస్‌ను ప‌ట్టా లెక్కించేందుకు, తిరిగి శాసనసభలో కొందరినైనా కూర్చో బెట్టేందుకు పార్టీ నేత‌లు.. కృషి చేయాల్సిందే. అయితే, దీనికిగాను ఎంచుకున్న, ఎంచుకోబోయే మార్గాలే స‌రిగాలేవ‌నేది విశ్లేష‌కుల మాట‌. రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టారు మాజీ మంత్రి, మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ర‌ఘువీరా రెడ్డి. అయితే, ఆయ‌న ఆధ్వ‌ర్యంలో పార్టీ పుంజుకుందా? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న అయితే. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో నేత‌లు ఎంత మేర‌కు స‌మ‌న్వ‌యం సాధించి పార్టీని అభివృద్ధి చేసుకుంటున్నార‌నేది మ‌రో ప్ర‌శ్న‌. ఈ రెండు ప్ర‌శ్న‌లు ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అభివృద్ధి చెందాలంటే..దానిని న‌డిపించే నాయ‌కుడు కూడా స‌రిగానే ఉండాల‌ని, అంద‌రినీ క‌లుపుకొని పోయే వ్య‌క్తి అయి ఉండాల‌ని భావిస్తున్నారు.

సగానికి పైగానే……

కానీ, ర‌ఘువీరా బాధ్య‌త‌లు చేప‌ట్టాక కాంగ్రెస్ స‌గానికిపైగా ఖాళీ అయింది. కీల‌క నేత‌లు ఇప్పుడు త‌మ‌కు న‌చ్చిన పార్టీల్లో చేరిపోయారు. మ‌రి రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడుగా వారిని ఆపేందుకు ర‌ఘువీరా చేసిన ప్ర‌య‌త్నాలు ఏవి? అంటే ప్ర‌శ్న‌లే క‌నిపిస్తున్నాయి. నిజానికి నాలుగేళ్లుగా ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ర‌ఘువీరా.. అంగుళమంత కూడా కాంగ్రెస్‌పై విశ్వాసం పెంచ‌లేక‌పోయారు. విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌పై ఏర్ప‌డిన మ‌చ్చ‌ను ఆయ‌న తుడ‌వ‌లేక‌పోయారు. ప్ర‌జ‌ల్లో స‌ర్ది చెప్ప‌లేక‌పోయారు. అదేస‌మ‌యంలో నేత‌లు పార్టీలు మారుతున్నార‌ని తెలిసినా కూడా.. చూస్తూ కూర్చోవ‌డం, తెలిసి కూడా వారు వెళ్ల‌కుండా ఏదైనా చేయాల‌నే స్పృహ లేక‌పోవ‌డం వంటివి కూడా ఇక్క‌డ కాంగ్రెస్‌ను భ్ర‌ష్టు ప‌ట్టించాయి.

ఏ ప్రయత్నం ఫలించక…..

తీరా నేత‌లు పార్టీ మారిపోయాక‌, రాయ‌బారాలు చేయ‌డం, వ‌స్తే.. బాగుంటుంద‌ని,వెళ్లొద్ద‌ని చేతులు కాలిపోయాక‌.. ఆకులు ప‌ట్టుకున్న చందంగా ర‌ఘువీరా చేసిన ప్ర‌య‌త్నాలు ఒక్క‌టి కూడా ఫ‌లించ‌లేదు. రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో టీడీపీ అధినేతగా చంద్ర‌బాబు పాత్ర ఉన్నా.. దానిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలోనూ ర‌ఘువీరా విఫ‌ల‌మ‌య్యారు. ఇదే విష‌యం తాజాగా హైక‌మాండ్ వ‌ద్ద చ‌ర్చ‌కు వ‌చ్చింది. ‘నాలుగేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ ప్రజాక్షేత్రంలో విశ్వాసం పొందలేకపోతున్నాం. ఓటు బ్యాంకు పెరగడం లేదు. ఇందుకు కారణాలను అన్వేషిస్తే.. ప్రజాబలమున్న నేతలు కాంగ్రెస్‌లో కరువయ్యారు.

ప్రజాకర్షక నేతలు ఏరీ?

కాస్తో కూస్తో ప్రజాకర్షణ కలిగిన నేతలను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. కార్యక్రమాల గురించి పార్టీ కార్యాలయం నుంచి సమాచారం రావడమే తప్ప.. ఆ నిర్ణయం తీసుకునే ముందు రఘువీరా మమ్మల్ని సంప్రదించడం లేదు’ అని స్వ‌యంగా సీనియ‌ర్లే పేర్కొంటుండ‌డంతో ర‌ఘువీరానాయ‌క‌త్వంపై అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే ఉంటే.. పార్టీ మ‌రింత‌గా భ్ర‌ష్టుప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ర‌ఘువీరా మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు మోస్ట్ సీనియ‌ర్ ఏపీ కాంగ్రెస్ నేత‌లు. మరి రఘువీరారెడ్డిని మార్చినా కాంగ్రెస్ గాడిలో పడుతుందా? అంటే డౌటే మరి. రాహుల్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.