రఘువీరా ఇదేం పని?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సైలెంట్ గా ఉండటానికి కారణాలేంటి? చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉందా? కర్ణాటక ఎన్నికల్లో తాను పిలుపిస్తేనే తెలుగు ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నా కాంగ్రెస్ మౌనంగా ఉండటానికి కారణమదేనా? అన్న డౌటు వ్యక్తమవుతోంది. ఒకపక్క తామే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించామని ప్రచారం చేసుకుంటున్నా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పెదవి విప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

టీడీపీ తమ ప్రతిభేనని చెబుతున్నా…..

రఘువీరారెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీపై విమర్శలు తగ్గించారు. నిన్న మొన్నటి దాకా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను విమర్శించిన చంద్రబాబు కూడా వాటిని పక్కన పెట్టేసి బీజేపీ మీద పడ్డారు. ఇప్పుడు ఇదే విషయం ఏపీ కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పిటికీ ఆ సంతోషం ఏపీ కాంగ్రెస్ నేతల్లో లేకుండా పోయింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, శైలజానాధ్ తదితరులు ప్రచారం చేశారు.

నేతలు సీరియస్….

అయితే ఇప్పుడు వీరంతా రఘువీరారెడ్డి మీద కారాలు మిరియాలు నూరుతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ కు కూడా ఫిర్యాదు చేయాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. గత నాలుగేళ్లుగా పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నా వారిని ఆపే ప్రయత్నం కూడా రఘువీరా చేయడం లేదన్నది వారి ప్రధాన ఆరోపణ. రఘువీరారెడ్డి ఎక్కువ సమయం బెంగుళూరులోనే ఉంటూ ఏపీకి అడపాదడపా వచ్చి పోతూ తూతూ మంత్రంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఉన్న కొద్దిమంది నేతలూ…..

రఘవీరా ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో ఉన్న కొద్దిమంది నేతలూ విసిగిపోతున్నారు. ఆయన కొందరు నేతలను కావాలని దూరం పెడుతున్నారన్న ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. ముఖ్యంగా పనబాక లక్ష్మి, పళ్లంరాజు, శైలజానాధ్ లాంటి నేతలను రఘువీరా కలుపుకుని పోయే ప్రయత్నం చేయడం లేదట. కనీసం పార్టీ సమావేశాలకు కూడా వారిని ఆహ్వానించడం లేదు. చంద్రబాబు కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరవుతున్నారు. ఆయన రాహుల్ సమక్షంలో వేదికను పంచుకోబోతోన్నారు. ఈ నేపథ్యంలోనే రఘవీరా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని, కర్ణాటక లో బీజేపీ ఓటమికి కారణం తామేనని చంద్రబాబు చెబుతున్నా ఖండించక పోవడం కూడా అదే కారణమని అంటున్నారు. మొత్తం మీద ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్న నేతలను మిగిల్చేట్లు లేరన్న టాక్ బలంగా విన్పిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*