రాహుల్ ఆకట్టుకున్నది ఇలా….!

Rahul Gandhi fire on modi

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ద‌యాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాద‌ని, ప్ర‌ధాని హోదాలో పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ అని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల హ‌క్కు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే మొట్ట‌మొద‌ట ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. మంగ‌ళ‌వారం క‌ర్నూలులో జ‌రిగిన కాంగ్రెస్ స‌త్య‌మేవ జ‌య‌తే స‌భ‌కు రాహుల్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…
– కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై ప్ర‌త్యేక ప్రేమానురాగాలు ఉన్నాయి.
– దేశంలోనే మొద‌టి ద‌ళిత ముఖ్య‌మంత్రిగా దామోద‌రం సంజీవ‌య్య‌ను చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదే.
– ఆంధ్ర‌ప్రదేశ్ కు దామోద‌రం సంజీవ‌య్య లాంటి ముఖ్య‌మంత్రి కావాలి. ప్ర‌జ‌ల బాధాలు అర్థం చేసుకుని నిజాయితీగా ప‌నిచేయ‌గ‌లిగే ముఖ్య‌మంత్రి కావాలి.
– క‌ర్నూలు నుంచి గెలిచిన కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా, నీలం సంజీవ‌రెడ్డి రాష్ట్ర‌ప‌తిగా, పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధాన‌మంత్రిగా అయ్యారు. క‌ర్నూలు ప్రాంతం నిజాయితీ క‌లిగిన నేత‌ల‌ను తీసుకువ‌చ్చింది. మ‌ళ్లీ క‌ర్నూలులో అటువంటి నేత‌ల‌ను కాంగ్రెస్ తీసుకువ‌స్తుంది.
– ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈ దేశానికి ద‌శా – దిశా నిర్దేశించే రాష్ట్రం. ఈ దేశానికి స్వ‌యం స‌హాయ సంఘాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయి.
– రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు దేశ‌ప్ర‌ధానిగా ఏపీ కోసం మ‌న్మోహ‌న్ సింగ్ ప‌లు హామీలు ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఒక‌టి. మ‌న్మోహ‌న్ సింగ్ ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామంటే బీజేపీ నేత‌లు వారు అధికారంలోకి వ‌స్తే ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్నారు.
– కానీ, నాలుగేళ్లుగా మోదీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా హామీని నెర‌వేర్చ‌డానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేదు.
– పోల‌వరానికి జాతీయ హోదా, క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారం, కొత్త రైల్వే జోన్‌, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలు, పోర్టుల అభివృద్ధి, మెట్రో రైలు, 12 జాతీయ విద్యా సంస్థ‌లు, నీటి వివాదాలు రాకుండా కృష్ణా, గోదావ‌రి ట్రైబ్యున‌ళ్ల ఏర్పాటు వంటి హామీలు పార్ల‌మెంటు సాక్షిగా కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చింది.
– అప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెర‌వేర్చ‌కుండా న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం మోసం చేసింది.
– ప్ర‌తి బ్యాంకు అకౌంట్ లో రూ.15 ల‌క్ష‌లు వేస్తామ‌ని, పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌లు ఇస్తామ‌ని, సంవ‌త్స‌రానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని న‌రేంద్ర మోదీ అనేక త‌ప్పుడు హామీలు ఇచ్చారు.
– త‌ప్పుడు హామీలు ఇవ్వ‌డం త‌న ఇంటావంటా లేదు. నేను ఇచ్చిన హామీ నెర‌వేరే వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌డ్డ‌పై అడుగు పెట్ట‌ను. 2019లో కేంద్రంలో తాము అధికారంలోకి వ‌స్తే ఇచ్చిన అన్ని హామీలు నెర‌వేర్చుతాం. ప్ర‌త్యేక హోదాపైనే మొద‌టి సంత‌కం పెడ‌తాము.
– ప్ర‌త్యేక హోదా అనేది ఆంధ్ర‌ప్రదేశ్ కు ద‌యాదాక్షిణ్యంతో ఇచ్చేది కాదు.
– తాను ప్ర‌ధానిని కాద‌ని, దేశానికి కాప‌లాదారుని అని మోదీ చెప్పార‌ని, కానీ న‌మ్మి ఇంటి తాళాలు ఇస్తే తాళాలు తీసి బ‌య‌ట‌కు వ‌చ్చేసే ర‌క‌మ‌ని ఎద్దేవా చేశారు.
– 9000 కోట్లు ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోయిన విజ‌య్ మాల్యా పారిపోయే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని క‌లిశాన‌ని చెప్పారు.
– ఒక దొంగ‌తో కానిస్టేబుల్ కుమ్మ‌క్క‌యితే ఎస్పీ చర్య‌లు తీసుకుంటారు. అలాంటిది తొమ్మిది వేల కోట్లు దోచుకున్న విజ‌య్ మాల్యాను ఆర్థిక మంత్రి పారిపోకుండా ఆప‌లేక‌పోయారు. 9000 కోట్ల‌లో లంచాలు వ‌చ్చినందునే విజ‌య్ మాల్యాకు స‌హ‌క‌రించారు.
– కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని 526 కోట్ల‌కు కొనుగోలు చేస్తే మోదీ మాత్రం 1600 కోట్ల‌కు కొనుగోలు చేశారు. 70 ఏళ్ల అనుభ‌వం ఉన్న సంస్థ‌ను త‌ప్పించి త‌న స్నేహితుడు అంబానీకి మోదీ ఈ కాంట్రాక్టు అప్ప‌గించాడు. 45 వేల కోట్లు బ్యాంకుల‌ను ముంచిన అంబానీ వంటి నేర‌గాడికి మోదీ ఈ కాంట్రాక్టు అప్ప‌గించాడు.
– ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోసం చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి మోదీ ఎలా చూడ‌లేక‌పోతున్నాడో రాఫేల్ యుద్ధ విమానాల విష‌యంపై ప్ర‌శ్నించిన‌ప్పుడు నా క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి చూడ‌లేక‌పోతున్నారు.
– కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే రైతుల‌కు రుణ మాఫీ చేస్తాం.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*