గెలిస్తే ఆయనే సిఎం అట….!

రాజస్థాన్ లో ఎన్ని మాయలు, మంత్రాలు వేసినా తమదే గెలుపన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ సభలకు రాజస్థాన్ లో మంచి స్పందన కన్పిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొట్టొచ్చినట్లు కనపడుతోంది. దీంతో రాజస్థాన్ పీఠం ఖచ్చితంగా హస్తం పార్టీ ఖాతాలో పడుతుందన్న నమ్మకం వారిలో పెరిగిపోయింది. ఇక రాజస్థాన్ లో సీనియర్ నేతల విషయంలోనూ రాహుల్ కఠిన నిర్ణయమే తీసుకోనున్నారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సచిన్ పైలట్ నే ముఖ్యమంత్రిగా చేయాలన్నది రాహుల్ నిర్ణయంగా తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ తన రాజస్థాన్ పర్యటనలో సంకేతాలు కూడా ఇచ్చారు.

గెహ్లాట్ ను కేంద్ర రాజకీయాల్లోకి…..

రాజస్థాన్ గతంలో జరిగిన ఉప ఎన్నికల విజయంలోనూ సచిన్ పైలట్ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా అనేక సర్వేల్లోనూ సచిన్ పైలట్ ముఖ్యమంత్రిగా ప్రధమ స్థానంలో నిలవడం కూడా రాహుల్ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కు ఇక్కడ మంచి పేరుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉంటూ వస్తున్నారు. గెహ్లాట్ కూడా రాజస్థాన్ లో పవర్ లోకి వస్తే తానే ముఖ్యమంత్రి నవుతానని నిన్న మొన్నటి వరకూ ధీమాగా ఉన్నారు. కానీ రాహుల్ సంకేతాలను బట్టి చూస్తుంటే గెహ్లాట్ కు సీఎం పదవి ఇవ్వరని దాదాపుగా తేలిపోయింది.

రాహుల్ కోటరీలో…..

సచిన్ పైలట్ యువకుడే కాకుండా రాహుల్ కోటరీలో సభ్యుడు కూడా. రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి యువకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సీనియర్లను సలహాల వరకూ మాత్రమే పరిమితం చేస్తున్నారు. యువనేతలను ప్రోత్సహించడం వల్ల తనకు, పార్టీకి భవిష్యత్తు ఉంటుందని రాహుల్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే రాజస్థాన్ లో సీనియర్ నేత అశోక్ గెహ్లెట్ కు ఇప్పటికే కేంద్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అంతేకాదు ఆయన సేవలను కేంద్రస్థాయిలో వినియోగించుకోవాలని రాహుల్ నిర్ణయించేశారు.

సీనియర్లను పార్టీకే పరిమితం…..

దీంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి అనేది ఖాయమని దాదాపుగా తేలిపోయింది. అలాగే మధ్యప్రదేశ్ లోనూ రాహుల్ జ్యోతిరాదిత్య సింధియాకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ సీనియర్ నేతలు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ లను దాదాపుగా పక్కన పెట్టేశారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా యువనేతలతోనే ముందుక వెళ్లాలన్నది రాహుల్ ఆలోచనగా తెలుస్తోంది. సీనియర్ నేతల సేవలను పార్టీకి పరిమితం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ లో మాత్రం అధికారంలోకి వస్తే సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రిగా చేస్తామని త్వరలోనే రాహుల్ సభల్లో ప్రకటించే అవకాశముందని కూడా చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*