అనుకున్నంత ఈజీ కాదు….!!!

రాజస్థాన్ ఎన్నికల్లో గెలుపోటములపై దోబూచలాట జరుగుతోంది. కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉందనుకున్న రాష్ట్రంలో సమీకరణలు మారే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. వసుంధర రాజేపై ఉన్న వ్యతిరేకతతో సులువగా గట్టెక్కవచ్చన్నది కాంగ్రెస్ భావించింది. ఈ మేరకు సర్వేలు కూడా అలాగే స్పష్టం చేశాయి. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ లో కాంగ్రెస్ సులువుగా 160 స్థానాల్లో జెండా ఎగురవేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సమీకరణలు మారుతున్నట్లు హస్తం పార్టీకూడా గమనించింది.

పోరు ఇద్దరిమధ్యనే……

రాజస్థాన్ లో తొలినుంచి కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోరు ఉంటుందని భావించారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు వరకూ పరిస్థితి అలాగే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను కూడగట్టడంలో విఫలం కావడంతో ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి కూడా ఇక్కడ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు సాధించిన బీఎస్పీ ఈసారి ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడుతుందోనన్న ఆందోళన బీజేపీ, కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది.

మూడో కూటమితో…..

ముఖ్యంగా మూడో కూటమిగా ఏర్పడిన లోక్ తాంత్రిక్ మోర్చాతోనే ఇప్పుడు అసలు సమస్య తలెత్తింది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ఒంటరిగా ఇక్కడ పోటీ చేస్తున్నాయి. అయితే సీపీఎం, రాష్ట్రీయ లోక్ దళ్, జనతాదళ్ సెక్యులర్, సమాజ్ వాదీ, సీపీఐ, ఎంసీపీఐ వంటి చిన్నా చితకా పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పడి 200 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగననున్నాయి. వీరికి ప్రధానంగా అండగా ఉంది అన్నదాతలే. రాజస్థాన్ లో వసుంధర రాజేకు వ్యతిరేకంగా గత కొద్దికాలంగా రైతు సమస్యలపై ఈ పార్టీలన్నీ ఉద్యమించడంతో వారంతా ఈ కూటమికి అండగా నిలుస్తున్నారని భావిస్తున్నారు.

ఎవరి ఓటు బ్యాంకుకు…..?

అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన హస్తం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఒక ప్రధాన వర్గం కాంగ్రెస్ కు దూరమయితే అది తీవ్ర స్థాయిలో నష్టం చేకూరుస్తుందన్న అంచనాలో ఉంది. దీంతో బీజేపీ తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందుకే మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా కొత్త ముఖాలకు ఎక్కువగా చోటిచ్చింది. మరి ఈ కూటమి వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న అంచనాల్లో రెండు ప్రధాన పార్టీలు ఉండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*