బతికి బట్ట కడుతుందా?

ఏపీలో చ‌చ్చిపోయిన కాంగ్రెస్‌ను బ‌తికించాలి. కాంగ్రెస్‌కు జ‌వ‌సత్వాలివ్వాలి-ఇప్పుడు ఇవీ కేంద్రం నుంచి రాష్ట్రం వ‌ర‌కు కాంగ్రెస్ నాయ‌కుల ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నాయ‌కులు భారీ ఎత్తున హామీలు గుప్పిస్తున్నారు. అత్యంత కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా విష‌యం త‌మ‌తోనే సాధ్య‌మ ని ప్ర‌క‌టిస్తున్నారు. హోదాతో పాటు ఏపీకి ఇచ్చిన విభ‌జ‌న హామీల‌ను సైతం తామే నెర‌వేరుస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టిస్తోంది. అయితే, ఈ హామీలు ఎంత‌మేర‌కు ప‌నిచేస్తాయి? ఏమేర‌కు ఓట్లు రాలుస్తాయి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది. తాజాగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఏపీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాస్త ఆవేశంగానే ప్ర‌సంగించారు. ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాదిరిగా తాను అబద్దాలు చెప్పడానికి రాలేదన్నారు.

కొత్త సెంటిమెంట్ ను రాజేసి……

ఏపీకి ప్ర‌త్యేక హోదా విషయంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే ఏపీలో అడుగుపెట్టనని రాహుల్ భీష‌ణ ప్ర‌తిజ్ఞే చేశారు. 2019లో కేంద్రంలో తాను అధికారంలోకి రాగానే ఏపీకి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రత్యేక హోదా అమలుపైనే తన తొలి సంతకం ఉంటుందన్నారు. అయినా ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఏపీకి ఇచ్చే కానుకేం కాదన్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని కూడా కొంత సెంటిమెంటును రాజేశారు. ఏపీకి ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేస్తామ‌న్నారు. దీంతో కాంగ్రెస్ నేత‌ల్లో హుషారు వ‌చ్చినా.. నిజంగానే ఈ హామీ అమ‌లు కాంగ్రెస్‌కు ఏపీలో ఊపిరులు ఊదుతుందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. నాలుగు నెల‌ల కింద‌ట ఏపీ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా నియ‌మితులైన కేర‌ళ మాజీ సీఎం.. ఊమెన్ చాందీ పార్టీని బ‌తికించుకోవ‌డం కోసం ప‌లు ప్ర‌యోగాలు చేశారు.

పాతకాపులు ఏరీ?

పార్టీ నుంచి వెళ్లిపోయిన పాత‌కాపుల‌కు పెద్ద పీట ప‌రుస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వెళ్లిన వారు వెన‌క్కి వ‌స్తే.. వారిని స‌ముచితంగా గౌర‌విస్తామ‌ని, టికెట్లు కూడా ఇస్తామ‌ని, గెలుపున‌కు స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. కానీ, ఆయ‌న ప్ర‌క‌ట‌న నేటికీ ప్ర‌క‌ట‌న‌గానే ఉండిపోయింది త‌ప్పితే ఏ ఒక్క‌రూ తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌చ్చింది లేదు. పైగా బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఒక‌రిద్ద‌రు కాచుకుని కూర్చున్న‌ట్టుగానే తెలుస్తోంది. ఇక‌, రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా.. దానిని విజ‌యవంతం చేసేందుకు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయినా కూడా ఏ కార్య‌క్ర‌మ‌మూ స‌క్సెస్ కావ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు రాహుల్ వ‌చ్చి గంభీర వ‌చ‌నాలు, హామీలు గుప్పించారు. ఇది మాత్రం స‌క్సెస్ అవుతుందా? అనేది ప్ర‌శ్న‌గానే మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*