“రాహు”ల్ కాలం తొలగిపోలేదా?

ఎంతో ఆశలు పెట్టుకున్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కు కొంత సానుకూల వాతావరణం ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం మూడు దఫాలుగా అధికారంలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల్లో అసహనం తమకు కలసి వస్తాయని భావించింది కాంగ్రెస్. అయితే బీజేపీ బలమైన శత్రువు కావడంతో దానిని ఎదుర్కొనేందుకు సమిష్టిగా పోరాడాలన్నది కాంగ్రెస్ ఆలోచన. కలసి వచ్చే పార్టీలన్నింటితో కూటమి ఏర్పాటు చేసుకుని ఎన్నికల ముంగిటకు వెళ్లాలని హస్తం పార్టీ భావించింది.

చర్చలు జరుగుతుండగానే…..

మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలున్నాయి. ఇక్కడ కొన్ని చోట్ల బహుజన్ సమాజ్ పార్టీ గెలుపోటములను ప్రభావితం చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతుంది. బీఎస్పీ, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే ఈసారి ఖచ్చితంగా విజయం తమదేనన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. ఈ మేరకు బీఎస్పీ, కాంగ్రెస్ ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ తరుపున చర్చల్లో పార్టీ సీనియర్ నేత కమలనాధ్ పాల్గొంటున్నారు. చర్చలు సానుకూల ధోరణిలోనే జరుగుతున్నాయని, పొత్తుతోనే వెళతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

22 స్థానాలకు అభ్యర్థులను……

మొత్తం 230 స్థానాల్లో మాయావతి పార్టీ మొత్తం 50 స్థానాలను కోరుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం 30 స్థానాల వరకూ ఇస్తామని చెబుతోంది. ఇంకా చర్చలు ప్రాధమిక దశలోనే ఉన్నాయి. ఏ నియోజకవర్గాల్లో బీఎస్పీకి పట్టుంది? బలమైన నేతలెవరున్నారు? తదితర అంశాలను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఫ్లాష్ సర్వేలు చేయించి మరీ బీఎస్పీ తో చర్చల్లో పాల్గొంటుంది. చర్చల సందర్భంగా గణాంకాలతో సహా బీఎస్పీ నేతలకు కమలనాధ్ వివరిస్తుండటంతో వారు నేరుగా మాయావతికి ఈ విషయాన్ని చేరవేసినట్లు సమాచారం.

బీజేపీతో కుమ్మక్కయ్యారని……

తమకు యాభై సీట్లు డిమాండ్ చేస్తున్న మాయావతి ఏకపక్షంగా మధ్యప్రదేశ్ లో 22 స్థానాలకు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించడం సంచలనమయింది. అభ్యర్థులను ప్రకటించిన స్థానాలు 22 అయినప్పటికీ, మాయావతి తమతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం కాంగ్రెస్ నేతలకు అర్థమయింది. ఛత్తీస్ ఘడ్ లో కూడా అజిత్ జోగి పార్టీతో పొత్తుకు మాయావతి వెళ్లడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో బీఎస్పీకి కేవలం 4 అసెంబ్లీ స్థానాలే వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ లో బీజేపీతో కుమ్మక్కై మాయావతి అజిత్ జోగి పార్టీతో పొత్తు పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు కూడా హస్తం పార్టీ నేతలు చేశారు. ఇప్పటికైనా మాయావతి కలసి వస్తేనే బీజేపీని కట్టడి చేయడానికి వీలవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా…మాయా మాట వినేటట్లు లేదు. దీంతో మధ్యప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందన్నది విశ్లేషకుల అంచనా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*