రాహుల్ కు మిస్ అయినట్లే…..!

భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్మధనం బయలుదేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. నాయకత్వ సమస్య ప్రధాన కారణంగా దీనిని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరం కావడం, ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ అనుభవ లేమి ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ విధివిధానాలు రచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి, రెండు మినహా అన్ని రాష్ట్రాల్లో దాదాపు కుదేలైపోయిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఇప్పుడు ఒక్కటే. నరేంద్ర మోదీని ఓడించడం. అందుకు అవసరమైతే ప్రధాని పదవిని సయితం త్యాగం చేయాలని నిర్ణయించుకుంది.

రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే…..

వచ్చే ఎన్నికలు బీజేపీకి ఎంత ప్రతిష్టాత్మకమో. రాహుల్ కు, కాంగ్రెస్ పార్టీకి అంత ముఖ్యమయినదనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి మోదీని ఎదుర్కొనే సత్తా లేదు. దాదాపు అన్నిరాష్ట్రాల్లో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కోల్పోయింది. అధికారానికి కాదు గదా….కొన్నిరాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఉంది. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ది. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుపెడితే….ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోవాల్సిందే. ఇందుకు వేరే దారి లేదు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో కొంత బలంగా కన్పించినా విజయం సాధించేంత లేకపోవడంతో అక్కడ కూడా మిత్రులతో కలసి పోటీకి దిగాల్సిందే.

మోదీని దించాలనే…..

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో తమతో కలసి బీజేపీని ధ్వేషిస్తున్నప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోవాలంటే ప్రధాని పదవి ని త్యాగం చేయక తప్పదు. అందుకోసం ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే నిర్ణయిస్తారని ఆ పార్టీ ప్రకటించడం విశేషం. అంటే వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించరని స్పష్టమయిపోయింది. ఇదే విషయాన్ని ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సయితం ప్రకటించారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ను ప్రకటిస్తే రాష్ట్రాల్లో పొత్తులకు విఘాతం ఏర్పడుతుందన్నది కాంగ్రెస్ భయం. అందుకే ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందంటున్నారు.

చారిత్రాత్మిక తప్పిదమేనా?

ఇక వచ్చే ఎన్నికలలో మోడీని ఎదుర్కొని విపక్షాలన్నీకలసి మ్యాజిక్ ఫిగర్ ను దాటినా రాహుల్ కు ప్రధాని పదవి లభించే అవకాశాలు కష్టమేనని చెప్పాలి. ఎందుకంటే ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు ఇప్పుడు అనుకున్నట్లు ఉండవు. అప్పటి పరిస్థితులను బట్టి, తమ రాష్ట్రాల ప్రాధాన్యత అంశాలను బట్టి ఆ యా పార్టీలు మద్దతుపై నిర్ణయం తీసుకుంటాయన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇందువల్లనే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి దక్కే అవకాశం కష్టమేనన్నది నిపుణుల అభిప్రాయం. మోదీపై విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో చారిత్రాత్మిక తప్పిదం చేసిందన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*