రాహుల్ ఓకే అంటేనే…??

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ మరోసారి చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ ఓకే అంటే ఈనెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావుచెప్పడంతో ఆశావహుల్లో మరోసారి ఆశలు రేకెత్తాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలన్నది ఇటు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు, అటు హైకమాండ్ ఆలోచనగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూల వాతావరణం కన్పిస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే అసమ్మతి నేతల నోళ్లు మూతబడపడతాయన్నది ఆ పార్టీ నేతల ఆలోచనగా ఉంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు…..

వచ్చే నెల 7వ తేదీ నాటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. వచ్చే నెల 11వతేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలు తమ ఖాతాలో పడతాయని కాంగ్రెస్ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో ప్రజల తీర్పు తమకు అనుకూలంగా ఉంటే ఆ ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. అందువల్లనే కర్ణాటక మంత్రివర్గ విస్తరణను కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతనే చేపట్టాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉంది.

నాలుగు నెలలుగా ఊరిస్తూ….

ఇప్పటికే కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ అంటూ నాలుగు నెలలుగా ఊరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో నాలుగింటిలో సంకీర్ణ సర్కార్ లో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ గెలుచుకోవడంతో అసమ్మతి నేతలకు కొంతవరకూ కళ్లెం వేయగలిగామని అగ్రనేతలు సంతృప్తి చెందుతున్నారు. ఈ ఉప ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ ఊరించి ఎన్నికల్లో పనికానిచ్చేసుకున్నారు. కానీ గెలుపు తమవైపే ఉండటంతో మరోసారి వాయిదా వేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇప్పటికే సిద్ధరామయ్య అసంతృప్తులను బుజ్జగించి అలసి పోయారు.

మరోసారి వాయిదా తప్పదా?

దీంతో పాటు డిసెంబరు నెలలో శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఇవి బెళగావిలో జరుగుతాయి. శాసనసభ సమావేశాల కంటే ముందుగానే మంత్రివర్గ విస్తరణ చేయాలని అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో రాహుల్ గాంధీ బిజీగా ఉండటంతో కర్ణాటక నేతలకు సమయం ఇవ్వడం లేదు. దీన్ని సాకుగా చూపించి వాయిదా వేయాలన్నది కాంగ్రెస్ పార్టీ నేతల వ్యూహంగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయి, ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాతే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్నా, పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావు ఈ నెలలోనే విస్తరణ ఉంటుందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*