ఆశలున్న చోటే నీరుగార్చారే…..!

లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాని అభ్యర్థి దగ్గర నుంచి సీట్ల పంపకం వరకూ, చివరకు పొత్తుల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీలు దూరం పెట్టేలా ఉన్నాయి. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో తమకే మాత్రం లాభం లేదన్న అభిప్రాయంలో ప్రాంతీయ పార్టీలుండటం గమనార్హం. గతంలో అన్ని రాష్ట్రాల్లో ఓటు బ్యాంకుతో పాటు పటిష్టమైన యంత్రాంగం, పేరున్న నేతలున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉప ప్రాంతీయపార్టీలా మారిందనే చెప్పాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొనాలంటే విపక్షాలతోకలసి కాంగ్రెస్ పోటీ చేయాలి. కాని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.

పొత్తుల విషయంలో…..

ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ ను ప్రకటించాలనుకున్నా….విపక్షాల ఐక్యత దెబ్బతింటుందని భావించి కాంగ్రెస్ ఆ అవకాశాన్ని విపక్షాలకే వదిలేసింది. చివరకు ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాతనే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాని ఒక నిర్ణయానికి మాత్రం రాగలిగారు. అయితే ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పొత్తులు కూడా కాంగ్రెస్ కు కలసి వచ్చేటట్లు లేవు. కాంగ్రెస్ తో కలిస్తే తమకు లాభమేంటన్న ఆలోచనలో ప్రాంతీయ పార్టీలున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు విపక్షాలే కటీఫ్ చెప్పేసేటట్లున్నాయి.

సీట్ల సర్దుబాటులో…..

వచ్చే లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు కలసి మహాకూటమిగా ఏర్పడి వెళ్లాలనుకున్నాయి. ఈ మేరకు కొంత చర్చలు కూడా జరిగాయి. అయితే లోకల్ గా స్ట్రాంగ్ గా ఉన్న సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కాంగ్రెస్ ను కలుపుకునేందుకు ఇష్టపడటం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో పొత్తు వద్దని రెండు పార్టీల అధినేతలు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. బీఎస్పీ నేత మాయావతి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలలో కాంగ్రెస్, బీఎస్పీల మధ్య సీట్ల కేటాయింపులు తేడాలు రావడంతో మాయావతి కాంగ్రెస్ తో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

యూపీలో ఇక ఒంటరిగానే……

ఇక తాజాగా సమాజ్ వాదీ పార్టీకి అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ తో పాత్తు విషయంలో కొంత క్లారిటీ ఇచ్చారు. తాము కాంగ్రెస్ తో జత కట్టలేమని తేల్చి చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అతిపెద్ద సంఖ్యలో లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్డీ లు మాత్రమేకూటమిగా కలసి పోటీ చేస్తాయని అఖిలేష్ ప్రకటించారు. రాష్ట్రంలో ఈ మూడు పార్టీలకు పట్టుందని, కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో దాని విషయాన్ని తాము పెద్దగా పట్టించుకోమని చెప్పారు. అంటే కాంగ్రెస్ కు ఇక్కడ బలం లేదని, అందువల్లే కూటమిలో కలుపుకుని కొన్ని సీట్లను కోల్పోవడం ఎందుకన్నది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. రాహుల్ తనకు ఎప్పటికీ మంచి స్నేహితుడనే చెప్పడం విశేషం. ఇలా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం ఖాయమని స్పష్టమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*