మిషన్ యూపీ….!!

rahulgandhi-mission-uttarpradesh

ఉత్తరప్రదేశ్ లో తమను అంటరానివారిగా చూస్తున్న పార్టీలకు సత్తా చూపించేందుకు హస్తం పార్టీ రెడీ అవుతోంది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ తమను పక్కనపెట్టి కూటమిగా ఏర్పడటాన్ని ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని తమ ప్రభావం ఏంటో అన్ని పార్టీలకూ తెలియజెప్పాలన్న నిర్ణయానికి వచ్చింది. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలన్న కాంగ్రెస్ ఆశలకు అఖిలేష్ యాదవ్, మాయావతి గండికొట్టారు. కాంగ్రెస్ కు అమేధీ, రాయబరేలి స్థానాలను వదిలేసి మిగిలిన చోట్ల పోటీ చేయాలని నిర్ణయించారు.

అవమానమే కదా?

దీంతో కాంగ్రెస్ పార్టీ అవమానంగా భావించింది. మిగిలిన రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం కన్పించకుండా చూసుకునేందుకు ముందు జాగ్రత్తగా తామూ పోటీలో ఉంటామని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్ లో ఉన్న 80 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చింది. ప్రతి చోటా తమ అభ్యర్థి ఉంటారని పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించడం విశేషం. కేవలం ఈ ప్రకటనతోనే పరిమితం కాకుండా కార్యాచరణను కూడా రూపొందించుకుంది.

వచ్చే నెలలోనే….

వచ్చే నెల నుంచి యూపీలో కాంగ్రెస్ తన హడావిడిని ప్రారంభించానుకుంటోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో 13 బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందుగానే తమ సభలకు వచ్చే జనాలను చూపించి తామేంటో ప్రత్యర్థులతో పాటు, మిత్రులకు కూడా చూపించాలనుకుంటోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 13 జోన్లుగా విభజించుకుని తొలిదశలో 13 బహిరంగ సభలను రాహుల్ తో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సభలకు భారీగా జనసమీకరణను చేయాలీని ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయి.

ఎందుకు వదలాలి…?

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సయితం అతి పెద్ద రాష్ట్రాన్ని మిత్రులైనా వారికి ఎందుకు వదలిపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. స్థానాలు ఎక్కువగా గెలుచుకోకున్నా తమకు వచ్చే ఓట్ల శాతాన్ని చూసైనా మిత్రులు తమ బలాన్ని గుర్తించాలనుకుంటున్నారు రాహుల్. అందుకే యూపీలో ఒంటరిగా 80 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే బీజీపీకి లాభమా…? బీఎస్పీ, ఎస్పీలకు నష్టం వాటిల్లుతుందా? అన్న లెక్కల్లో అన్ని పార్టీల నేతలు మునిగిపోయారు. మరి ఎన్నికల నాటికి బీఎస్పీ, ఎస్పీ దిగివచ్చే అవకాశముందన్న చిరు ఆశ మాత్రం హస్తం పార్టీలో కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*