రాహుల్ సరే…. మీ సంగతేంటి?

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తానే ప్రధానినవుతానని రాహుల్ ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. రాహుల్ కు రాజకీయ పరిణితి లేదన్నారు. సమస్యలపై అవగాహన లేదన్నారు. ఆయన సీనియర్లను గౌరవించడం కూడా తెలియదని మోడీ వ్యాఖ్యానించారు. రాహుల్ తానే ప్రధానినవుతానని ప్రకటించుకోవడం అహంకారానికి నిదర్శనమని ప్రధాని రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే తానే ప్రధానినవుతానేమోనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మోడీ వ్యాఖ్యలను….

అయితే రాహుల్ పై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు బీజేపీలోని కొందరు కూడా తప్పుపడుతున్నారు. రాహుల్ కు సీనియర్లంటే గౌరవం లేదు సరే…తమకుందా? అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీకి ఒకరూపు నిచ్చిన అద్వానీ మాటేంటని కొందరు నిలదీస్తున్నారు. అద్వానీని పక్కన పెట్టేసి మోడీ, అమిత్ షాలు చక్రం తిప్పడం లేదా? అని నిలదీస్తున్నారు. అద్వానీ లాంటి నేత సభలో అభివందనం చేస్తే ప్రతిగా నమస్కారం కూడా చేయని మోడీ నీతులు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు.

అద్వానీ విషయాన్ని మరిచారా?

మోడీ ప్రధాని అయిన తర్వాత సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. అద్వానీకి నమస్కారం పెట్టకపోవడం, మురళీమనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వంటి నేతలను పట్టించుకోకపోవడం వంటి వాటిపై కూడా నరేంద్రమోడీపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. రాజకీయ పరిణితి, అవగాహన, సీనియర్ల పట్ల సంస్కారం ఉంటే అద్వానీకి ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఇంత చిన్నచూపు దక్కేది కాదని కూడా మోడీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

సోషల్ మీడియా వార్…..

ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు తాను చేసిందేంటో ఒకసారి గుర్తు చేసుకోవాలని కూడా హితోక్తులు వల్లె వేస్తున్నారు. రాహుల్ కు ప్రధాని అయ్యే అర్హత లేదన్న మాట పక్కన పెడితే, మోడీకి ఆ అర్హత ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక ఎన్నికలు వచ్చే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ కావడంతో కన్నడనాటనే రెండు పార్టీల నేతలూ మాటల తూటాల పేలుస్తున్నారు. రాహుల్ పై మోడీ చేసిన విమర్శలను కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఇప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతోంది. గతంలో మోడీ సీనియర్లను అవమానించిన తీరును ఎండగడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*