ఊహలు…కరెక్ట్ కాదేమో…..!!

rahulgandhi narendramodi loksabha elections

మినీ సార్వత్రికం గా పరిగణించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంరంభం ముగిసింది. ఒక్కచోట తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ ఓడిపోయింది. విపక్ష పార్టీ గద్దెనెక్కింది. దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణాలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని సాధించింది. మిజోరోమ్ లో అధికార కాంగ్రెస్ ఓడిపోగా, విపక్షమైన మిజోనేషనల్ ఫ్రంట్ నేత జోరాషతుంగా అధికార పీఠాన్ని అధిష్టించారు. అత్యంత కీలకమైన హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో రాజ్యమేలుతున్న బీజేపీిని ప్రజలు తిరస్కరించి విపక్ష హస్తాన్ని ఆదరించారు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా కమల్ నాధ్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ ప్రమాణ స్వీకారం చేసేశారు. ఇప్పుడిప్పుడే వారు పాలనలో కుదురుకుంటున్నారు. ప్రభుత్వ పనుల్లో తలమునకలవుతున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఆసక్తికర విశేషాలు వెలుగులోకి వస్తాయి. అదే సమయంలో అనేక కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని విశ్లేషిస్తే వాస్తవాలు బోధపడతాయి.

మూడు రాష్ట్రాల ఎన్నికల్లో….

తెలంగాణ, మిజోరాంలను పక్కన పెడితే హిందీ బెల్ట్ ప్రాంతాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో అధికార బీజేపీ మట్టి కరించిందా? విపక్ష కాంగ్రెస్ కు ప్రజలు ఘన విజయం కట్టబెట్టారా? ఈ ఫలితాల ఆధారంగా బీజేపీ పని అయిపోయిందనుకోవాలా? నైరాశ్యంలో మునిగిపోవాల? కాంగ్రెస్ శ్రేణులు భవిష‌్యత్ గురించి కలలు కనాలా? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం కష్టమే. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం. అధికార బీజేపీని ప్రజలు మరీ అంత ఘోరంగా అవమానించారా? అంత గట్టిగా తిరస్కరించారా? అన్న విష‍యం స్పష్టమవుతుంది. అదే సమయంలో హస్తం పార్టీని నెత్తిన పెట్టుకున్నారా? అన్న సంగతీ స్పష్టమవుతుంది. ఎన్నికల ఫలితాల, ఓట్ల శాతాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి.

మధ్యప్రదేశ్ లో చిన్నవిషయం కాదు…..

230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ లో బీజేపీ బలం గతం కంటే తగ్గినప్పటికీ అధికారానికి చేరువలో ఆగిపోయింది. ఆ పార్టీకి 109 స్థానాలు వచ్చాయంటే దీనిపై ప్రజలకు ఇంకా విశ్వాసం ఉన్నట్లే అని చెప్పడం అతి శయోక్తి కాదు. వరసగా మూడు దఫాలుగా పాలన సాగిస్తున్న ఏ పార్టీకి అయినా ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత తప్పనిసరి. ఇటీవల కాలంలో నోట్ల రద్దు జీఎస్టీ, మసకబారుతున్న మోదీ ప్రభ కారణంగా కొంత నష్టం అనివార్యం. వీటిని అధిగమించి మెజారిటీకి చేరువలోకి రావడం తేలికమైన విషయం కాదు. 41.1 శాతం ఓట్లు సాధించడం చిన్న విషయం కాదు. హస్తం పార్టీ బలం 114 వద్దే ఆగిపోయింది. మెజారిటీకి ఇంకా రెండు సీట్లు అవసరం. ఇక ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం 41 శాతం కావడం గమనార్హం. రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం లక్ష లోపే అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఘోరంగా మాత్రం కాదు…..

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే అక్కడ హస్తం పార్టీ వంద సీట్ల వద్ద ఆగిపోయింది. మెజారిటీకి ఇంకా ఒక్క సీటు వద్ద నిలిచిపోయింది. అదే సమయంలో బీజేపీ అంత ఘోరంగా ఓడిపోలేదు. గౌరవ ప్రదమైన స్థానాలు (73) సాధించడం చూస్తే పార్టీకి ఇంకా ప్రజాదరణ ఉన్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 39.3 శాతం కాగా, బీజేపీ 38.8 శాతం ఓట్లు సాధించడం గమనార్హం. వ్యత్యాసం ఒక్క శాతం లోపే. ఇక్కడ కూడా వసుంధరరాజే వ్యక్తిగత వ్యవహార శైలి కారణంగానే ఓటమి పాలయింది. హస్తం పార్టీకి సంపూర్ణ విజయం దక్కింది ఛత్తీస్ ఘడ్ లోనే. 68 సీట్లు, 43.2 శాతం ఓట్లతో ఇక్కడ విస్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ సాధించింది. ఇక్కడ కూడా జనతా కాంగ్రెస్ ఛత్తీస్ ఘడ్ అధినేత అజిత్ జోగీ కారణంగానే కమలం వాడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 41.04 శాతం ఓట్లు రాగా, ఈ దఫా 33 శాతానికి పరిమితమైంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 43కు పెరగడం విశేషం. ఓట్ల శాతం వ్యత్యాసం మాత్రం తక్కువే కావడం గమనార్హం.

అలా అని అంచానాలు వేస్తే…….

ఇక లోక్ సభ స్థానాల పరంగా చూస్తే మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 62 స్థానాలున్నాయి. గతంలో రాజస్థాన్ లో 25 కు 25, మధ్యప్రదేశ్ లో 29 స్థానాలకు గాను 27, ఛత్తీస్ ఘడ్ లో 11 స్థానాలకు పది స్థానాలను బీజేపీ సాధించింది. తాజా ఫలితాలతో పోల్చి చూస్తే బీజేపీ ఈ రాష్ట్రాల్లో 18 కి మించి సీట్లు రావన్న సంగతి స్పష్టమవుతోంది. 44 స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. అయితే లోక్ సభ ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం. అందువల్ల ప్రస్తుత ఫలితాల ఆధారంగా బీజేపీ పని అయిపోయిందని చెప్పడం, కాంగ్రెస్ కు ఇక తిరుగులేదన్న అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది. హస్తం పార్టీ బలం పెరిగిందనుకున్నా…బీజేపీ బలం తగ్గిందనుకోవడం పొరపాటే అవుతుంది. వాస్తవం తెలుసుకోవడం ఇద్దరికీ ఉత్తమం. ఓట్ల శాతాన్ని పక్కనపెడితే పార్టీలు దృష్టి సారించిన ప్రధాన అంశాలుప్రజా సమస్యలు. ముఖ్యంగా ఇటీవల ఈ రాష్ట్రాల రైతులు నవంబరు 30న ఢిల్లీలో తమ సమస్యలపై కదం తొక్కారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చారు. ఇది గమనించిన ఛత్తీస్ ఘడ్ లో ప్రచారం సందర్భంగా ధాన్యానికి కనీస మద్దతు ధర 2,500 రూపాయలు ఇస్తామని స్వయంగా రాహుల్ ప్రకటించడం గమనార్హం. రెండు లక్షల వరకూ రుణ మాఫీ చేస్తానని మధ్యప్రదేశ్ ప్రచారంలో ఆయన ప్రకటించారు. రాజస్థాన్ రైతులకూ దన్నుగా ఉంటానని చెప్పారు. ప్రజాసమస్యలను పరిష్కరించే తీరు తెన్నులపైన వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం ఆధారపడి ఉంది. గుడ్డిగా ఓట్లు వేసే రోజులకు కాలం చెల్లింది. నాయకుల పనితీరును నిశితంగా బేరీజు వేస్తున్నారు. ఈ వాస్తవాన్ని విస్మరిస్తే ఏ పార్టీకైనా కష్టకాలం తప్పదు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*