రాహుల్ రైట్ చాలెంజ్….!

సబ్జెక్టును పట్టుకోవడము, సమయానికి నిప్పు దట్టించడమూ చేయగలిగితేనే రాజకీయాల్లో రాణింపు. సగటు జీవితో అనునిత్యం ముడిపడిన పెట్రోలు, డీజిల్ ధరలపై కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విసిరిన ఫ్యూయల్ ప్రైస్ చాలెంజ్ గట్టి చణుకే. రాహుల్ ను ఎద్దేవా చేయడమే లక్ష్యంగా ఆయన ప్రతిమాటను నానాయాగీ చేసే కమల దళం నోట మాట రావడం లేదు. యువరాజు అంటూ ఎగతాళి చేసే ప్రధాని మోడీకి పలుకు కరవైంది. సర్కారులే సామాన్యుడిని దోచేస్తుంటే ప్రతిపక్షాలు చోద్యం చూడాల్సిన ఒక కంపల్సన్ ను కేంద్రం కల్పించగలిగింది. గడచిన నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయల పైచిలుకు అదనపు మొత్తాలను పెట్రో బాదుడుతో కేంద్రం కూడగట్టుకోగలిగింది. కానీ ఎవ్వరూ నోరెత్తలేకపోతున్నారు. దీనిపై ఉద్యమానికి సిద్ధమవుతామంటూ కాంగ్రెసు అధినాయకుడు రాహుల్ సవాల్ విసిరారు. ప్రచార సంరంభంతో వాస్తవాలు వినిపించకుండా చేయడంలో దిట్టగా వ్యవహరిస్తున్న కేంద్రం మౌనముద్ర దాలుస్తోంది. తన పథకాలే తనకు శ్రీరామరక్ష అనుకుంటోంది.

సాప్ నహీ..సహీ నహీ…

నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా ఒక నూతన నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రచార పథాన్ని నిర్దేశించుకుంది. సాప్ నియత్, సహీ వికాస్ అన్నదే ఈ నినాదం. ‘సదుద్దేశం, సక్రమ ప్రగతి’ దీనికి నిర్వచనం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినప్పుడు ఆ వెసులుబాటును ప్రజలకు చేరవేయలేదు. రేటు తగ్గినప్పుడు పాత ధరకే వస్తువులను విక్రయించే కొందరు వ్యాపారుల పంథానే సర్కారు అనుసరించింది. దీనికి అనేక రకాల ముద్దు పేర్లు జోడించి సెస్సుల పేరిట ముక్కుపిండి వసూలు చేశారు. పెట్రోలుపై లీటరుకు దాదాపు 20 రూపాయలు, డీజిల్ పై 15 రూపాయల పైచిలుకు కేంద్రానికి కస్టమ్స్ పన్నుగా లభిస్తోంది. ఇక రాష్ట్రప్రభుత్వాలు 25 నుంచి 35 రూపాయల వరకూ అమ్మకం పన్ను, వాట్ రూపంలో లబ్ధి పొందుతున్నాయి. ఎప్పటికప్పుడు రేట్లు పెరిగినప్పుడు అదనపు సెస్సులను తొలగించకుండా మరింత భారం మోపుతూ వచ్చారు. ఇదంతా మధ్యతరగతి జీవిపై పడింది. కూరగాయలు మొదలు పచారీ సరుకుల వరకూ పెరిగిపోయాయి. రవాణా వ్యయం పెరగడమే దీనికి కారణం. అయినా ఇందులో తమ పాత్రేమీ లేదన్నట్లుగా రేట్లు పెరిగితే మేమేం చేయలేమన్నట్లుగా కేంద్రం మాట్టాడుతోంది. పన్నులు తగ్గించుకోమని రాష్ట్రప్రభుత్వాలకు ఉచిత సలహా ఇస్తోంది. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి ఈ భారం వేయాల్సిందేనని ఒకవేళ కేంద్రం భావిస్తే ప్రజలు అందుకు సిద్ధమే. కానీ దీనిలో రాజకీయాలకు తావుండకూడదు.

ఓట్లూ కావాలి.. కోట్లూ కావాలి..

అవ్వా కావాలి. బువ్వా కావాలి అన్నట్లుగా ఉంది కేంద్ర ప్రభుత్వ వైఖరి. పెట్రోలియం ధరల రూపంలో ప్రజల జేబుల్లోని సొమ్ములు కావాలి. తాము గద్దెనెక్కేందుకు వారిచ్చే అధికారమూ కావాలి అని ఆశిస్తోంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దాదాపు 20 రోజుల పాటు ధరలను నియంత్రించింది. ఎన్నికల ఘట్టం ముగియగానే గడచిన 15 రోజుల్లో లీటరుకు మూడునాలుగు రూపాయల పైచిలుకు బాదేసింది. ధరలు పెంచడం ప్రజలకు రుచించని నిర్ణయం. దీనికి ప్రతీకారంగా తమకు ఓట్లు వేయరేమోననే బెరుకుతో రేట్లను తొక్కిపట్టడం పక్కా రాజకీయ నిర్ణయం. అధికారం కోసం ధరలకు ముసుగు వేసి, అవసరం తీరగానే తెర తీసేయడం సాప్ ఇంటెన్షన్ కిందకు వస్తుందా? అన్నది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. అలాగని కాంగ్రెసు పార్టీ సైతం రాజకీయం చేయడం లేదని చెప్పలేం. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం లీటరుకు 25 రూపాయలు తగ్గించ వచ్చంటూ వింత ప్రకటన చేశారు. తన హయాంలో ఎన్నిసార్లు అలా చేయగలిగారో ఆయనే చెప్పాలి. రెండు పార్టీలూ రాజకీయానికే దిగుతున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. కాసులు నొల్లుకుంటున్నాయి. కష్టాలు మిగులుస్తున్నాయి. గతంలో కాంగ్రెసు, ఇప్పుడు బీజేపీ. పార్టీలు మారాయంతే. కేంద్రప్రభుత్వం ముడిచమురు ధరను నియంత్రించకుండా సాధ్యమైనంతవరకూ క్యాష్ చేసుకోవడము రాష్ట్రప్రభుత్వాలకూ లాభిస్తోంది. పెరిగిన ధరపైన అమ్మకం పన్ను రూపంలో మరింత అదనపు ఆదాయం లభిస్తోంది.

పథకాలు వర్సెస్ పెట్రో ధరలు..

ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడానికి పెద్ద ప్రణాళికనే కేంద్రం సిద్దం చేసింది. రైస్ బకెట్ ఛాలెంజ్ వంటివి గతంలో చాలా ప్రచారం పొందాయి. ఫిట్ నెస్ చాలెంజ్ అంటూ కేంద్రం ప్రజలను హుషారు చేయాలని చూసింది. రాహుల్ ఫ్యూయల్ ప్రైస్ చాలెంజ్ వెలికి తీశారు. ప్రభుత్వం నాలుగేళ్ల విజయాల ప్రచారంతో దూసుకుపోవాలనుకుంటోంది. దీనిని తిప్పికొట్టేందుకు పెట్రో ధరలపై కాంగ్రెసు నేతలు కసరత్తు మొదలు పెట్టారు. లైఫ్ టైమ్ పీక్ కు చేరిన పెట్రో ధరల వంటి వాటిని నిలదీసే అస్త్రాలుగా మార్చుకోవాలని కాంగ్రెసు నుంచి ఇప్పటికే శ్రేణులకు సమాచారం అందింది. ప్రభుత్వ అభివ్రుద్ధి పథకాలు వర్సస్ పెట్రోలియం ధరలు అన్నట్లుగా ప్రభుత్వ, ప్రతిపక్షాల ప్రచారం హోరెత్తబోతోంది. సామాన్యుడిని ఏ అంశం ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

 

ఎడిటోరియల్ డెస్క్