రాహుల్ ను అడ్డుకుని …?

తెలంగాణ ఇచ్చింది మేమే .. తెచ్చింది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ కి తీరని అవమానం అక్కడ ఎదురౌతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా పర్యటనకు విసి నో చెప్పడాన్ని హస్తం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ అధినేత పర్యటనతో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న సర్కార్ వాదన టి కాంగ్రెస్ నేతలను ఆగ్రహోదగ్రులను చేసింది. రాహుల్ పర్యటన కోసం కోర్ట్ ద్వారా ఆఖరి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా టీఆర్ఎస్ పై ప్రయోగిస్తోంది. గులాబీ పార్టీ కాంగ్రెస్ ను చూసి భయపడే విసి ద్వారా అనుమతి నిరాకరించిందన్న ప్రచారాన్ని టి కాంగ్రెస్ దిగ్గజాలు వరుసగా తెరపైకి తెస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై దాడిని తీవ్రం చేస్తూ వస్తున్నారు.

రాహుల్ టూర్ ప్రతిష్టాత్మకంగా భావించి …

టి సర్కార్ పై తమదైన శైలిలో పోరాటం చేస్తున్న టి కాంగ్రెస్ అగ్రనేతలు ఉత్తమకుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క , జానారెడ్డి, విహెచ్, షబ్బీర్ ఆలీ సుధాకర రెడ్డి అంతా సీన్ లోకి దిగిపోయారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణ ఇస్తే కాపలా కుక్క లా పడివుంటా అని అతిధి కి ఇచ్చే మర్యాద ఇదా అంటూ విహెచ్ ఒంటికాలిపై లేచారు కేసీఆర్ పై. ఇక పొంగులేటి సుధాకర రెడ్డి రాహుల్ వస్తే పీఠాలు కదిలిపోతాయనే అనుమతులు ఇవ్వడం లేదన్నారు.

తెలంగాణ ఇచ్చిన వారికే…..

విభిన్నంగా స్పందించే జానారెడ్డి అయితే ఓయూలో ఎదో దాగివుందని టి సర్కార్ కుట్ర చేస్తుందని ఘాటుగా ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన వారు వస్తే నో అనడం బాధాకరమన్నారు బట్టి విక్రమార్క. ఇలా ఒక్కో నేత ఒక్కోరేంజ్ లో విరుచుకుపడ్డారు. తమపార్టీ అధినేత టూర్ కావడంతో మరికొందరు ఓయు లోని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం చేత కోర్ట్ లో అనుమతి ఇవ్వాలంటూ కేసు దాఖలు చేయించారు. ఈ కేసులో తీర్పు ఏ విధంగా వుండబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా ఎదురౌతుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ రాహుల్ టూర్ పై నానా గోలా చేస్తున్నా గులాబీ పార్టీ పెద్దగా దీనిపై స్పందించకపోవడం విశేషం. రాహుల్ స్పెషల్ గ్రూప్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో పరిధిలో ఉండటం వల్లనే తాము అనుమతి ఇవ్వలేదని ఉస్మానియా వీసీ ఒక ప్రకటన విడుదల చేయడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*