ఆయనే ఆధారమా…???

ఒక్కడిని ఎదుర్కొనడానికి పదిమందా? ఇదీ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే రజనీకాంత్ ఎప్పటికప్పుడు దీనిని ఖండిస్తూనే వస్తున్నారు. తమిళనాట అన్నాడీఎంకేకు, బీజేపీలకు వ్యతిరేకంగా అన్ని పక్షాలూ ఏకమయ్యాయి. డీఎంకే మహాకూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే కూడా తమిళనాట డీఎంకే పుంజుకుందని, ఎక్కువ లోక్ సభ స్థానాలను దక్కించుకుంటుందన్న వార్తలు వెలువడ్డాయి.

మహాకూటమికి వ్యతిరేకంగా….

అయితే తమిళనాట మహాకూటమికి వ్యతిరేకంగా బీజేపీ కూటమి ఏర్పాటుకు పెద్దయెత్తున పావులు కదుపుతోంది. ఇందులో ప్లాన్ 1 ప్రకారం అతిపెద్ద క్యాడర్ ఉన్న అన్నాడీఎంకేతో కలసి వెళ్లడం. ప్లాన్ 2 ప్రకారం సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలుపుకుని వెళ్లడం. రజనీకాంత్ ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. తమ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే రాజకీయ పార్టీ విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు రజనీకాంత్. వచ్చే నెలలో రజనీ పార్టీ ప్రకటన ఉండే అవకాశముంది.

రజనీని తిప్పుకునేందుకు….

ఈ నేపథ్యంలో రజనీని తమవైపునకు తిప్పుకోవాలని బీజేపీ విపరీతంగా ప్రయత్నిస్తుంది. లోక్ సభ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేయదు కాబట్టి తమకు అండగా నిలబడాలని కోరనుంది. రజనీకాంత్ తొలినుంచి కొంత కమలం పార్టీకి ఫేవర్ గానే కన్పిస్తన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విషయాల్లో ఆయన మోదీ నిర్ణయాలను సమర్థించారు. రజనీకాంత్ పార్టీని ప్రకటించినా లోపాయికారీ మద్దతు లోక్ సభ ఎన్నికల్లో తమకు ఇస్తే చాలన్నది కమలనాధుల వ్యూహంగా కన్పిస్తోంది.

బీజేపీకి దగ్గరగా…..

బీజేపీ ఎంత పెద్ద ప్రమాదకారి అనేది ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుందన్న రజనీ అభిప్రాయం కూడా బీజేపీకి దగ్గర అని చెప్పడానికి ఉదాహరణ అని విశ్లేషకుల భావ. తమిళనాట బీజేపీకి అంతగా బలంలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అన్నాడీఎంకే క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నా నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో తమిళనాట గట్టెక్కాలంటే రజనీయే ఆధారమని కమలం పార్టీ గట్టిగా విశ్వసిస్తుంది. త్వరలోనే ఆ పార్టీ అగ్రనేతలు రజనీతో భేటీ అయి రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముందన్నది ప్రస్తుతం తమిళనాడులో టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*