తొలి అడుగులోనే రికార్డ్ బ్రేక్….!

రజనీకాంత్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రికార్డులు బ్రేక్ చేసేటట్లున్నారు. రజనీకాంత్ సాదాసీదా యాక్టర్ కాదు. దేశంలోనే కాదు ప్రపంచలోనే అనేక దేశాల్లో అభిమానులున్న వ్యక్తి రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీని త్వరలోనే ప్రకటించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన నిదానంగా…నింపాదిగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. హడావిడిగా వచ్చి అభాసుపాలు కావడం కంటే నిదానంగానే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

శూన్యతను సొంతం చేసుకుంటారా?

తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలదే హవా. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు రెండూ అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి. అయితే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించడం, డీఎంకే అధినేత కరుణానిధి కుర్చీకే పరిమితం కావడంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను రజనీకాంత్ సొంతం చేసుకోవాలని గత ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 31వ తేదీన ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి అభిమానుల గుండెల్లో సంబరాలు నింపారు. తమిళనాడులో సినీ స్టార్స్ ను ఆదరించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, కరుణానిధి వీళ్లంతా సినీ రంగం నుంచి వచ్చిన వారే. దీంతో కొన్నేళ్ల పాటు రాజకీయ ప్రవేశంపై మౌనముద్ర దాల్చిన రజనీ ఎట్టకేలకు గత ఏడాది మౌనం వీడారు.

కోటి దాటిన సభ్యత్వాలు….

అయితే అప్పటి నుంచి రజనీకాంత్ ఖాళీగా లేరు. ముఖ్యులతో సమావేశమై పార్టీని తమిళనాడులో ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై చర్చలు జరిపారు. విడతల వారీగా అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు. పార్టీని ప్రకటించే ముందుగానే సభ్యత్వాల నమోదు చేయించాలని రజనీకాంత్ నిర్ణయించారు. ఇందుకోసం మక్కల్ మండ్రంను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రకటన రాకముందే దాదాపు కోటిన్నర మందిని సభ్యులుగా చేర్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే అనతికాలంలోనే రజనీకి సంబంధించిన పార్టీ సభ్యత్వాల సంఖ్య కోటి దాటిపోవడం విశేషం. ఇప్పటికే మక్కల్ మండ్రంలో కోటి పది లక్షల మంది సభ్యులుగా చేరినట్లు చెబుతున్నారు.

త్వరలోనే పార్టీ ప్రకటన….

ఇది నిజంగా ఊహించని విషయమేనంటున్నారు విశ్లేషకులు. అయితే సభ్యత్వాలు ఊహించని దానికేంటే ఎక్కువగా నమోదవ్వడంతో రజనీ కూడా ఖుషీగా ఉన్నారని చెబుతున్నారు. త్వరలోనే మక్కల్ మండ్ర సభ్యులతో రజనీ భేటీ కానున్నారు. ఈ ఏడాదిలోనే ఆయన పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ ప్రకటన ఎలా ఉండాలన్న దానిపై ఆయన ముఖ్యనేతలతో చర్చించనున్నారు. బహిరంగ సభ ద్వారా ప్రకటించాలా? లేక పార్టీ కార్యాలయంలోనే ప్రకటించాలా? అన్నది రజనీకాంత్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రజనీ బహిరంగ సభ పెట్టి పార్టీని ప్రకటించాలని అభిమానులు కోరుతున్నారు. మొత్తం మీద రజనీ పొలిటికల్ గా తొలి అడుగులోనే రికార్డు బ్రేక్ చేశారన్న మాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*