ఇక్కడ ఎవరు గెలిచినా ఆయన గెలిచినట్లే…..!!!

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాజానంద్ గావ్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో సహజంగానే ఇది కీలక నియోజకవర్గంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మహిళా నాయకురాలు కరుణా శుక్లా బరిలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. కరుణ శుక్లా ఆషామాషీ నాయకురాలు కాదు. ఆమెది ఘనమైన నేపథ్యం. బీజేపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి ఆమె మేనకోడలు. సుదీర్ఘకాలం బీజేపీలో పనిచేసిన ఆమె అక్కడి విధానాలు నచ్చక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు హేమాహేమీలు తలపడుతుండటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి రాజానంద్ గావ్ పై కేంద్రీకృతమైంది.

రెండుసార్లు గెలిచి……

రాజానంద్ గావ్ జిల్లా కేంద్రం. గత రెండు ఎన్నికల్లో రమణ్ సింగ్ ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 2,67,791 మంది. 39.09 శాతం జనాభా పల్లెల్లో ఉన్నారు. 60.91 శాతం పట్టణాల్లో ఉన్నారు. మొత్తం జనాభాలో షెడ్యూల్ తెగలవారు 6.33 శాతం. 2017 ఓటర్ల జాబితా ప్రకారం 1,90,797 మంది ఓటర్లున్నారు. నియోజకవర్గంలో 237 పోలింగ్ కేంద్రాలున్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 82.36 శఆతం ప్రజలు ఓటింగ్ లో పాల్గొనడం విశేషం. నాటి ఎన్నికల్లో బీజేపీకి 58.45 శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో 77.29 శాతం ఓటింగ్ జరిగింది. 61.68 శాతం బీజేపీ, 30.59 శాతం ఓట్లు కాంగ్రెస్ కు పోలయ్యాయి. రాష్ట్రం ఆవిర్భవించాక 2003లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఇక్కడ విజయకేతనం ఎగురవేసింది. 2008, 2013లో రమణ్ సింగ్ ఇక్కడి నుంచి గెలిచారు. మొదటి సారి 36 వేలు, రెండోసారి 34 వేల ఆధిక్యతతో తనకు తిరుగులేదని చాటారు. గత మూడు దఫాలుగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ్ ముద్లియార్ పోటీ చేశారు. ఈసారి హస్తం పార్టీ తన వ్యూహాన్ని మార్చి కరుణ శుక్లాను బరిలోకి దించింది. గత లోక్ సభ ఎన్నికల్లో ఈ లోక్ సభ స్థానం నుంచి రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్ విజయం సాధించారు. ఇప్పుడు తండ్రి తరుపున మొత్తం ప్రచార బాధ్యతలను ఆయన తన భుజానపైన వేసుకున్నారు. కరుణ్ శుక్లా తరుపున కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.

ఇద్దరూ పెద్దాయన వారసులమంటూ….

ఇక తాజా సమరానికి వస్తే ఇద్దరు అభ్యర్దులు దివంగత వాజ్ పేయి చిత్రపటాన్ని పెట్టుకుని ప్రచారం సాగిస్తున్నారు. ఎవరికి వారు అటల్ తమ నాయకుడని చెప్పుకుంటున్నారు. కరుణ్ శుక్లా వాజ్ పేయి మేనకోడలనని చెప్పుకుంటుండగా, అంతకు మించి ఆయన తన ఆత్మబంధువని రమణ్ సింగ్ చెబుతున్నారు. కరుణ శుక్లాకు విస్తృత రాజకీయ నేపథ్యముంది. బీజేపీ కుటుంబ సభ్యురాలిగా ఆమె 14వ లోక్ సభకు ఆ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2009లో కోర్బా లోక్ సభ స్థానం నుంచి ఎన్నికై పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థి చరణ్ దాస్ మహంతాను ఓడించారు. పార్టీ విధానాలు నచ్చలేదంటూ 2013 అక్టోబరు 25న పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం 2014 లోక్ సభ ఎన్నికల్లో బిలాస్ పూర్ నుంచి లోక్ సభకు పోటీచేసి బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ సాహూ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయంగా వనవాసం చేస్తున్నారు. సీఎంపై పోటీ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చారు. సీఎం రమణ్ సింగ్ ను ఓడిస్తానని ఆమె చెబుతున్నప్పటికీ అది అంత తేలిక కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

లోకల్..నాన్ లోకల్…..

రమణ్ సింగ్, శుక్లా మధ్య పోటీని స్థానికులు, స్థానికేతరుల మధ్య పోటీగా చిత్రీకరిస్తున్నారు. రమణ్ సింగ్ స్థానికుడని, శుక్లా ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా రెండోసారి పోటీ చేయలేదని కమలం పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో ఆమె నియోజకవర్గాన్ని మారుస్తున్నారని ఎత్తి చూపుతున్నాయి. రమణ్ సింగ్ దక్షత, సమర్థత ముందు శుక్లా ఏమాత్రం సరిపోరని బీజేపీ విమర్శిస్తోంది. ఛత్తీస్ ఘడ్ అంటే రమణ్ సింగ్ అని, రమణ్ సింగ్ అంటేనే ఛత్తీస్ ఘడ్ అని అంతగా రమణ్ సింగ్ ప్రజల్లో నిలిచిపోయారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.మూడు ధఫాలుగా ఇటీవల కాలంలో ఏకధాటిగా ఎవరూ ముఖ్యమంత్రులుగా పనిచేయలేదని, ఈరికార్డును రమణ్ సింగ్ సాధించారని కార్యకర్తలు చెబుతున్నారు. రమణ్ సింగ్ కు పట్టణ ప్రాంత ఓటర్లపై మంచి పట్టుంది. మూడోసారి ఇక్కడి నుంచి ఎన్నికైతే నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ఆయనను గెలపిించడం తధ్యమన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

జోగీ పోటీ చేసి ఉంటే…..

తాను స్థానికేతరులనన్న వాదనను శుక్లా గట్టిగా తిప్పి కొడుతున్నారు. రాష్ట్రం మొత్తం తనదేనని , ఎక్కడి నుంచైనా పోటీ చేసే అధికారం తనకు ఉందని చెబుతున్నారు. వాజ్ పేయి నాటి బీజేపీ ఇప్పుడు లేదని పార్టీ కొందరి జేబు సంస్థగా మారిందని ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లపై ఆమె దృష్టి పెట్టారు. రెండు దఫాలుగా రమణ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని విమర్శిస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. రాజానంద్ గావ్ నుంచి బరిలోకి దిగుతానని తొలుత ప్రకటించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్ ఘడ్ (జేసీసీ) అధినేత అజిత్ జోగి చివరకు పోటీకి దూరంగా ఉండిపోయారు. స్థానిక కార్పొరేటర్ ను బరిలోకి దించారు. జోగీ పోటీ చేస్తే మహర్లు, సత్నామీ ల ఓట్లు ఆయనకు గంపగుత్తగా పడేవి. గట్టిపోటీ ఇచ్చేవారు. కాంగ్రెస్ అభ్యర్థి కరుణ శుక్లా కష్టపడుతున్నప్పటికీ రమణ్ సింగ్ ను నిలువరించడం కష్టమేనన్న అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*