పాశ్వాన్ పసిగట్టి…పగబట్టారా?

నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) నానాటికీ బలహీనపడుతోంది. కూటమి నుంచి క్రమంగా ఒక్కో పార్టీ వైదొలుగుతోంది. కొన్ని పార్టీలు వైదొలగడానికి సిద్ధమవుతున్నాయి. ఏపీక ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా ప్రభుత్వం నుంచి, కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగింది.చిరకాల మిత్రపక్షమైన శివసేన మానసికంగా ఎప్పుడో దూరమైంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. తాజాగా రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి (ఎల్జేపీ) పార్టీకూడా ప్రభుత్వంపై కారాలు, మిరియాలు నూరుతోంది. అవసరమైతే ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకు కూడా వెనకాడబోనని బీహార్ కు చెందిన ఈ ప్రాంతీయ పార్టీ హెచ్చరికలు జారీ చేస్తోంది.

అసలు కారణమిదే….

ప్రభుత్వంపై పాశ్వాన్ ఆగ్రహానికి గల అసలు కారణాలు ఏంటి? వచ్చే ఎన్నికలపై ఇప్పుడే మాట్లాడటానికి గల కారణాలు తెలుసుకోవాలంటే లోతుగా విశ్లేషించాల్సిందే. దళిత సామాజిక వర్గానికి చెందిన పాశ్వాన్న కు, బీజేపీకి సిద్ధాంతపరమైన సారూప్యత ఎంతమాత్రం లేదు. సహజ మిత్రులు కూడా కారు. 2014 ఎన్నికల్లో కేవలం రాజకీయ అవసరాల కోసమే ఇద్దరూ కలసి నడిచారు. క్రమంగా బీజేపీ బలహీన పడుతున్న నేపథ్యంలో తనదారి తాను చూసుకోవాలని పాశ్వాన్ నిర్ణయించుకున్నారు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, ఇటీవలి లోక్ సభ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ కుదేలవడం, మరోపక్క రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ బలపడుతుండటంతోనే పాశ్వాన్ లో ఆలోచనలు మొదలయ్యాయి. కేంద్రంపై వ్యతిరేకత, నరేంద్ర మోదీ నాయకత్వంపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏదో ఒక పేరుతో బీజేపీకి దూరం కాకపోతే తనకు భవిష్యత్ ఉండదన్న భయం ఆయనకు పట్టుకుంది. ఇందుకోసం తెలివిగా పావులు కదిపారు.

గోయల్ కు వ్యతిరేకంగా…..

ఈ వ్యూహంలో భాగంగా జస్టిస్ ఏకే గోయల్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ గోయల్ కు ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఇందులో భాగంగాఆయనన జాతీయ హరిత ట్రైబ్యునల్ ఛైర్మన్ గా నియమించింది. ఆయన నియామకాన్ని పాశ్వాన్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను సడలిస్తూ గత మార్చిలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ గోయెల్, జస్టిస్ యు.యు.లలిత్ ఉన్నారు. కేసు నమోదు కాగానే తక్షణమే అరెస్ట్ చేసే నిబంధనను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలా చేయడం ఒక వ్యక్తి హక్కులను ఏకపక్షంగా హరించడమేనని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ గోయల్ ను జాతీయ హరిత ట్రైబ్యునల్ ఛైర్మన్ గా నియమించడంపై పాశ్వాన్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది దళితులను అవమానించడమేనని నిరసిస్తోంది. ప్రభుత్వం తక్షణమే ఆయన నియామకాన్ని వెనక్కు తీసుకోవాలని, లేనట్లయితే వచ్చే నెలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత సంఘాలు నిర్వహించే ఆందోళనలోపాల్గొంటామని హెచ్చరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని కఠినమైన నిబంధనలను పునరుద్ధరించాలని, ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాన్ని (ఆర్డినెన్స్) జారీ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 9 నాటికి తమ డిమాండ్లను నెరవేర్చకుంటే మరుసటి రోజు జరిగే బంద్ లో పాల్గొంటామని లోక్ సభ సభ్యుడు, పాశ్వాన్ కుమారుడైన చిరాగ్ పాశ్వాన్ అల్టిమేటం జారీ చేశారు. దళిత, గిరిజన సంఘాలు ఆగస్టు 10న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి.

సన్నాయి నొక్కులు నొక్కుతూ…..

ఒక పక్క ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూనే మరొక పక్క సన్నాయినొక్కులు నొక్కుతోంది పాశ్వాన్ పార్టీ. తెలుగుదేశం మాదిరిగా తాము ప్రభుత్వం, ఎన్డీయే నుంచి బయటకు వెళ్లమని, కూటమిలో, ప్రభుత్వంలో ఉంటూనే దళితుల హక్కుల కోసం పోరాడతామని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేయడం గమనార్హం. మరో పక్క పార్టీ అధినేత, కేంద్రమంత్రి అయిన రామ్ విలాస్ పాశ్వాన్ ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాశారు. పాశ్వాన్ తో పాటు అఖిల భారత అంబేద్కర్ మహాసభ, బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఉదిత్ రాజ్ జస్టిస్ గోయల్ నియామకాన్ని వ్యతిరేకించారు. పాశ్వాన్ ప్రస్తుతం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఎల్జీపీ మొత్తం 7 స్థానాలకు పోటీ చేయడా ఆరుచోట్ల విజయం సాధించింది. పార్టీ అధినేత పాశ్వాన్ తన సొంత నియోజకవర్గమైన హాజీపూర్ నుంచి విజయం సాధించారు. ఆయన తనయుడు చిరాగ్ కుమార్ పాశ్వాన్ జముమ్ స్థానం నుంచి గెలుపొందారు. భగారియా నుంచి మహబూబ్ కైసర్, సమస్తిపూర్ నుంచి రామచంద్ర పాశ్వాన్, వైశాలి నుంచి రామ్ కిషోర్ సింగ్, ముంగేర్ నుంచి వీణాదేవి గెలుపొందారు. ఇందులో సమస్తిపూర్ నియోజకవర్గానికి గతంలో దళిత నేత, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ ప్రాతినిధ్యం వహించారు. ఆయన కూతురు మీరాకుమార్ ఇక్కడ నుంచి మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలయ్యారు.కాంగ్రెస్ నాయకురాలైన ఆమె గతంలో లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. గత ఏడాది రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పాశ్వాన్ పార్టీ పనితీరు బాగున్నప్పటికీ 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. మొత్తం 40స్థానాలకు పోటీ చేసి…కేవలం రెండు స్థానాలనే గెలుచుకుంది. 2010 ఎన్నికల కన్నా భాగస్వామ్యం తక్కువ. అసెంబ్లీ ఫలితాలతో పాటు, తాజాగా ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఎన్డీఏ కూటమికి పాశ్వాన్ పార్టీ దూరమవుతున్నట్లు కనపడుతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*