ఈసారి కూడా అదే జడ్జిమెంట్ అయితే?

గత ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒకరకమైన ఫలితాలు వస్తే, రంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రజలు మిశ్రమ తీర్పు ఇచ్చారు. ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ కూటమికి మెజారిటీ స్థానాలు దక్కాయి. మొత్తం 14 స్థానాల్లో కూటమి తరుపున పోటీ చేసిన అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో గెలిచి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటినా టీఆర్ఎస్ ఈ జిల్లాలో మాత్రం కేవలం మూడు స్థానాలే గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. అయితే, నాలుగేళ్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం తరుపున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీకి మంచి పట్టు సంపాధించి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇది నిరూపితమైంది. జీహెచ్ఎంపీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిధిలోని ఇంచుమించు అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. దీంతో రానున్న ఎన్నికల్లోనూ ఆ పార్టీ జిల్లాలో ఆధిక్యత ప్రదర్శిస్తుందని గట్టి నమ్మకంతో ఉంది. అయితే, గత ఎన్నికల్లో జిల్లాలో, ముఖ్యంగా ఎనిమిది నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా సెటిలర్లు గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. అదే, జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు అనుకూలంగా మారారనే విశ్లేషణలు ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం.

మేడ్చల్ లో ఎమ్మెల్యేపై వ్యతిరేకత….

మేడ్చల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. 43,455 ఓట్ల భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోటకూర జంగయ్యపై టీఆర్ఎస్ అభ్యర్థి మలిపెద్ది సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి 58 వేల ఓట్లు సాధించినా మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే, ఎమ్మల్యే సుధీర్ రెడ్డిపై నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత ఏర్పడింది. స్థానికంగా ఉంటారన్న మంచి అభిప్రాయం ఉన్నా, భూకబ్జాల ఆరోపణలు, సమస్యలు పరిష్కరించకపోవడం, దుందుడుకు మాటలతో ఆయన నియోజకవర్గంలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కాంగ్రెస్ ఆ పని చేయడం లేదు. నియోజకవర్గంలో నాన్ లోకల్ గా ఉన్న లక్ష్మారెడ్డి అంతగా యాక్టీవ్ గా ఉండటం లేదు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేసి రెండో స్థానంలో నిలిచి జంగయ్య యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆయన కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. స్వచ్చంధ సంస్థను ఏర్పాటుచేసి విస్తృత సేవా కార్యక్రమాలు చేస్తున్న మరో నాయకుడు స్కైలాబ్ రెడ్డి కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. దీంతో ఎవరికి టిక్కెట్ అనేది స్పష్టత లేకుండా పోయింది. టీఆర్ఎస్ తరుపున వచ్చే ఎన్నికల్లో సుదీర్ రెడ్డి పోటీ చేయరనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో మరో ఇద్దరు నేతలు కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో గెలవడం అంత సులువైన పనిగా కనపడటం లేదు.

మల్కాజిగిరిలో ద్విముఖ పోరు….

మల్కాజిగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్ రావుపై 2,768 ఓట్ల సవల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. అంతకుముందు ఓడిపోయారనే సానుభూతి, పార్టీ బలం, సౌమ్యుడనే పేరుతో గత ఎన్నికల్లో కనకారెడ్డిని విజయం వరించింది. అయితే, ఈ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. కనకారెడ్డికి అభివృద్ధి విషయంలో పెద్దగా మార్కులు పడలేదు. ఎటువంటి ఆరోపణలు లేకపోయినా ప్రజల్లో మాత్రం పట్టు సాధించలేకపోయారు. అయితే, ఆయనతో పాటు ఎంపీ మల్లారెడ్డి లేదా ఆయన అల్లుడు కూడా ఇక్కడి నుంచి బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక, తెలుగుదేశంతో పొత్తు, సామాజికవర్గ బలం, మోదీ హవా, సౌమ్యులు, విద్యావంతుడు అనే పేరుతో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు భారీగానే ఓట్లు సాధించారు. కానీ, ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన పోటీ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ గట్టి దెబ్బ కొట్టారు. ఆయన చివరి నిమిషంలో పార్టీని వీడటంతో నందికంటి శ్రీధర్ నిలబడి ఓటమి చవిచూశారు. అయితే, ఈ ఎన్నికల్లోనూ ఆయనే నిలబడతారని అంటున్నారు. ఈసారి టీఆర్ఎస్ కి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుందనేది మాత్రం స్పష్టమవుతోంది.

కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ ….

సెటిలర్ ఓట్లు కీలకంగా ఉండే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున కేపీ వివేకానంద్ సుమారు 40 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ ఎమ్మెల్యే టీడీపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండో స్థానంలో నిలిచిన హన్మంత్ రెడ్డికి టిక్కెట్ పైన ఆశలు పోయినట్లయింది. సిట్టింగ్ కే టిక్కెట్లు ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పడంతో కారు గుర్తుపై వివేక్ పోటీ ఖాయంగానే కనపడుతోంది. అయితే, 2009లో ఇండిపెండెంట్ గా గెలిచి, 2014లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిన కూన శ్రీశైలంగౌడ్ కి కూడా నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. ఆయన ఇప్పటికే గడప గడపకు కాంగ్రెస్ పేరుతో నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. ఇక ఎమ్మెల్యే వివేక్ కు కూడా వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ ఉంది. దీంతో ఇద్దరి మధ్య రానున్న ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ ఉండనుంది. సెటిలర్లు వన్ సైడ్ గా టీఆర్ఎస్ వైపు మొగ్గితే మాత్రం ఆ పార్టీ విజయం సులువే అవుతుంది.

పొత్తులు లేకపోతే చతుర్ముఖమే….

కూకట్ పల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు 43,186 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గొట్టిముక్కు పద్మారావు రెండోస్థానంలో నిలిచారు. అయితే, ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఎవరికనేది ఇంకా స్పష్టత లేదు. సెటిలర్ల ఓట్లు కీలకం కానున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి లేరు. సెటిలర్లను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ సెటిలర్ కే టిక్కెట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ కి పొత్తు ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై ఆరోపణలు ఏమీ లేకున్నా అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో మాత్రం ముద్ర వేసుకోలేకపోయారు. ఇక బీజేపీకి కూడా ఇక్కడ కొంత పట్టు ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా సెటిలర్ల మద్దతు ఉంటే గట్టి పోటీనే ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పొత్తులు లేకపోతే ఇక్కడ చతుర్ముఖ పోటీ ఖాయంగా కనపడుతోంది.

ఉప్పల్ టీఆర్ఎస్ లో కుమ్ములాటలు…

గత ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ తరుపున పోటీ చేసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డిపై 14,169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు బండారి లక్ష్మారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్యే ప్రభాకర్ నియోజకవర్గంలో తన ముద్రను వేసుకున్నా పార్టీ పరంగా చూస్తే బీజేపీ అంత బలంగా లేదు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మైనస్ గా మారాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన సుభాష్ రెడ్డికి ఈసారి టిక్కెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇక్కడి నుంచే కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహిస్తూ మేయర్ గా ఉన్న బొంతు రామ్మోహన్ కూడా ఉప్పల్ టిక్కెట్ పై కన్నేశారు. రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ కూడా టిక్కెట్ పై గంపెడాశాలు పెట్టుకున్నారు. వీరిద్దరూ సొంతంగా వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఎవరికి టిక్కెట్ వస్తుందో కూడా స్పష్టత లేదు. ఇక కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు బండారి లక్ష్మారెడ్డి ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఆయన ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారు. అయితే, ఓడిపోయిన తర్వాత నాలుగేళ్ల పాటు నియోజకవర్గాన్ని ఎక్కువగా పట్టించుకోకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఆయన టీఆర్ఎస్ గూటికి చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక కాంగ్రెస్ టిక్కెట్ పై మరో నేత రాగిడి లక్ష్మారెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆయన ఈసారి టిక్కెట్ పై నమ్మకంగా ఉన్నారు. ట్రస్ట్ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉప్పల్ లో మంచి పట్టు ఉంది. ఆ పార్టీ తరుపున సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఆయన బరిలో నలిస్తే గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. మొత్తానికి ఉప్పల్ నియోజకవర్గంలోనూ చతుర్ముఖ పోటీ ఖాయంగా కనపడుతోంది.

ఇక్కడ రెండు పార్టీల్లోనూ వర్గపోరే….

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండుపర్యాయాలుగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీ తరుపున గెలిచిన ఆయన టీఆర్ఎస్ లో చేరారు. వరుసగా రెండుసార్లు గెలవడం, నియోజకవర్గం అభివృద్ధిలోనూ వెనకబడటం, పలు ఆరోపణలు ఆయనకు మైనస్ గా మారాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎవరికి టిక్కెట్ అనేది ఇంకా స్పష్టత లేదు. కాంగ్రెస్ లో సైతం గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన మల్ రెడ్డి రంగారెడ్డిని మహేశ్వరం పంపించి ఇక్కడ డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ కి టిక్కెట్ ఇచ్చారు. దీంతో రంగారెడ్డి సోదరుడు రాంరెడ్డి స్వతంత్రంగా పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ క్యామ మల్లేష్ తో పాటు మల్ రెడ్డి రంగారెడ్డి టిక్కెట్ రేసులో ఉన్నారు. రంగారెడ్డికి ఇక్కడ మంచి పట్టు ఉంది. దీంతో ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మద్య ప్రధాన పోటీ నెలకొననుంది.

కృష్ణన్న ఇక పోటీ చేయరా..?

ఎల్బీనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీసీల నేత ఆర్.కృష్ణయ్య టీడీపీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగారు. టీడీపీ, బీజేపీ పొత్తు, సెటిలర్ ఓట్లు, బీసీల అండ కలిసివచ్చి ఆయన సులువుగా విజయం సాధించారు. నైతికతకు కట్టుబడి ఉండి టీడీపీ ఎమ్మెల్యేలంతా పార్టీ మారినా ఆయన మాత్రం కొనసాగుతున్నారు. ఆయనపై ఎటువంటి ఆరోపణలు కూడా లేవు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరని బలంగా వినపడుతోంది. టీడీపీ బలంగా ఉన్న ఈ స్థానాన్ని రంగారెడ్డి అనే మరో నేత ఆశిస్తున్నారు. ఆయనకు కూడా వ్యక్తిగతంగా కొంత పట్టు ఉంది. ఇక టీఆర్ఎస్ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పోటీలో ఉంటారని తెలుస్తోంది. ఆయనకు నియోజకవర్గంలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్నా, ఆరోపణలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ బలం ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే. ఆయన హయాంలో నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందనే పేరు ఉంది. వ్యక్తిగత ఛరిష్మా, పార్టీ బలం ఆయనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రస్, టీఆర్ఎస్, టీడీపీల మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం కనపడుతోంది.

Sandeep
About Sandeep 6176 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*