రావెల శత్రువులు వీళ్లేనా?

గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు టికెట్ విష‌యంలో టీడీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డి రాజ‌కీయాల‌పై నేత‌లు చాలానే ఆశ‌లు పెంచుకున్నారు. అయితే, దీనిని ఎవ‌రికి ఇస్తారు? ఎవ‌రు ఈ టికెట్‌ను సొంతం చేసుకుంటారు? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఈ టికెట్ కోసం ఇద్ద‌రిని మించి అభ్య‌ర్థులు పోటీ ప‌డుతుండ‌డ‌మే! విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ వ‌ర్గాల‌కు కేటాయించారు. 2004 వ‌ర‌కు ఇది జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగానే ఉండేది. అయితే, దీనిని ఆ త‌ర్వాత ఎస్సీ వ‌ర్గాల‌కు రిజర్వ్ చేశారు. దీనికి ముందు ఇక్క‌డ టీడీపీ వ‌రుస‌గా విజ‌యం సాధించింది. మాకినేని పెద‌ర‌త్త‌య్య టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ ఐదు సార్లు జెండా ఎగ‌రేసి.. పార్టీని ఇక్క‌డ బ‌లోపేతం చేశారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ సైకిల్ హ‌వా న‌డించింది.

టీడీపీ హవానే…..

ఆ త‌ర్వాత ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రావి వెంక‌ట ర‌మ‌ణ 2004లో గెలుపొందారు. ఆ త‌ర్వాత ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎస్సీల‌కు కేటాయించారు. 2009లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున మేక‌తోటి సుచ‌రిత పోటీ చేసి అప్ప‌టి వైఎస్ హ‌వా నేప‌థ్యంలో ఆమె గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌గా సాగిపోయింది. 2012 ఉప ఎన్నిక‌ల్లోనూ ఆమె గెలిచారు. ఇక‌, 2014 విష‌యానికి వ‌చ్చే స‌రికి.. ఇక్క‌డి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా అనూహ్య రీతిలో టికెట్ సంపాయించుకున్నారు..ఎస్సీ వ‌ర్గానికి చెందిన రావెల కిశోర్‌బాబు. వాస్త‌వానికి ఈ టికెట్‌ను ఆశించిన ఓ పాత్రికేయుడు.. రాత్రికి రాత్రి త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి వ‌చ్చి టీడీపీ కండువా క‌ప్పుకొన్నాడు. అయితే, ఆర్థిక బ‌లం, కేడ‌ర్ నేప‌థ్యంలో రావెల ఈ టికెట్‌ను ద‌క్కించుకున్నార‌ని ప్ర‌చారంలో ఉంది. ఏదేమైనా.. ఇక్క‌డి నుంచి 7 వేల ఓట్ల మెజారిటీతో రావెల గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ఇక్క‌డ నుంచే వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే సుచ‌రిత‌.. రావెల‌కు తుది వ‌ర‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. అయితే గుంటూరు జిల్లాలో బ‌లంగా వీచిన టీడీపీ గాలులు సుచ‌రిత ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాయి.

భారీ సంఖ్యలో ఆశావహులు….

ఇక‌, ప్ర‌స్తుత ప‌రిస్థితికి వ‌స్తే.. ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రావెల‌.. అన‌తి కాలంలో చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న‌ను చంద్ర‌బాబు గౌర‌వించిన రీతిలో ఆయ‌న పార్టీలో నిల‌దొక్కుకోలేక పోయారు. కుటుంబ రాజ‌కీయాల‌కు తెరదీశారు. బాబు వ్య‌తిరేక వ‌ర్గంతో చేతులు క‌లిపారు. బాబు ఎంతో న‌మ్మ‌కంతో మంత్రి ప‌ద‌వి ఇచ్చినా ఆ ప‌ద‌వి కూడా ప్ర‌క్షాళ‌న‌లో ఊస్ట్ అయ్యింది. మొత్తంగా ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ని ప‌రిస్థితిని తెచ్చుకున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీ నాయ‌కులు భారీ సంఖ్య‌లో ఈ టికెట్‌పై ఆశ‌లు పెంచుకున్నారు. ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు కందుకూరి వీర‌య్య‌. ఆది నుంచి కూడా ఈయ‌న టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. స్థానికుల‌కు చిర‌ప‌రిచ‌య‌స్తుడు. అయితే, గ‌తంలో రెండు సార్లు టికెట్ పొందినా.. ఓట‌మి పాలు కావ‌డం ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారింది.

ప్రత్తిపాడు టిక్కెట్ కోసం….

అయితే.. ప్ర‌జ‌ల్లో ఉన్న సింప‌తీని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఈయ‌న‌కు ఇప్పుడు అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. అదేస‌మ‌యంలో మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ .. డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ కూడా ఇక్క‌డ టికెట్ ఆశిస్తున్నారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు చెవిలో కూడా వేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఎక్కువ అవ‌కాశం డొక్కాకే ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌రిద్ద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు కేంద్ర స‌ర్వీసుల్లో ఉన్న ఇద్ద‌రు అధికారులు కూడా ఈ టిక్కెట్ రేసులో ఉన్నారు. అదేస‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి, ఉద్యోగానికి రాజీనామా చేసిన పాత్రికేయుడు కూడా ఈ టికెట్ కోసం పోటీకి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో బాబు నిర్ణ‌యం ఆస‌క్తిగా మార‌నుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*