రావెల ఎంట్రీ అందుకే ఆగిందా?

మాజీ మంత్రి రావెల తనకు మంత్రి పదవి రాదని డిసైడ్ అయిపోయినట్లుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాన్న యోచన కూడా రావెల చేస్తున్నారు. వైసీపీలోకి వెళ్లాలనుకున్న రావెల కు ఇంకా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ అందలేదు. అంతేకాదు వైసీపీలోకి వెళ్లినా ప్రత్తిపాడు టిక్కెట్ వస్తుందన్న నమ్మకమూ లేదు. అయితే తాను ఎంపీగానైనా వెళతానని రావెల కిశోర్ బాబు వైసీపీ అధినేత జగన్ కు సమాచారం పంపినట్లు తెలిసింది. పార్లమెంటు సభ్యుడిగా తాను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని అవకాశం కల్పించాలని కోరినట్లు చెబుతున్నారు దీనిపై జగన్ నుంచి ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో రావెల వెయిట్ చేస్తున్నారు.

వెయిట్ చేస్తూనే…..

రావెల్ వెయిట్ చేస్తూనే తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నారు. మంత్రి పుల్లారావుపై రెండురోజుల క్రితం మరోసారి విరుచుకుపడ్డారు. మంత్రి పుల్లారావు అనుచరుల జోక్యం తన నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుందని, దీనిని సహించేది లేదని కూడా రావెల చెప్పారు. అంతేకాదు దళితులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అగ్రకులాలకు చెందిన ప్రజాప్రతినిధుల జోక్యమేంటని కూడా రావెల ప్రశ్నించడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో అన్ని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఇదే జరగుతుందని రావెల బహిరంగంగా చెప్పడంతో కౌంటర్ ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు.

వర్ల రామయ్య ఎపిసోడ్ పై….

పనిలో పనిగా ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్యపై కూడా రావెల విరుచుకుపడ్డారు. వర్ల రామయ్య తన దురహంకారాన్ని తగ్గించుకుంటే మేలని హితవు పలికారు. వర్ల రామయ్యపై రాష్ట్రంలోని మాదిగ జాతి మొత్తం ఆవేశంతో రగిలిపోతుందని, క్షమాపణలు చెబితే సరిపోదని, మాదిగలంతా ఉద్యమాలకు సిద్ధమయ్యారని అంటూ రావెల వర్ల ఎపిసోడ్ లో కొంత నెయ్యిని కుమ్మరించారు. దీంతో వర్ల రామయ్య ఎపిసోడ్ నేటికీ ఆగలేదు. ఇలా రావెల కిశోర్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి బయటపడక ముందే దానిని ఇబ్బందుల్లోకి నెట్టాలని నిర్ణయించుకున్నట్లుంది.

ఈ నెల 20న ఏం చేస్తారోనని…..

అయితే ఈ నెల 15వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలో మినీ మహానాడులు జరగుతున్నాయి. మహానాడుకు ముందు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఆ నియోజకవర్గంలో తీర్మానాలు చేస్తారు. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గం మినీ మహానాడు ఈ నెల 20వ తేదీన జరగబోతోంది. దీనికి ఇన్ ఛార్జి మంత్రితో పాటు జిల్లా మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు కూడా హాజరుకానున్నారు. వీరి సమక్షంలోనే రావెల ఎటువంటి ఆరోపణలు చేస్తారోనన్న టెన్షన్ పార్టీనేతలను పట్టుకుంది. రావెలను ఉపేక్షిస్తే ఇలా విమర్శలు చేస్తూ వెళతారని, చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రులు అధిష్టానాన్ని కోరినట్లు కూడా తెలుస్తోంది. మరి 20న రావెల ఎటువంటి సంచలన ఆరోపణలు చేస్తారో చూడాలి. అలాగే అవతల పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకూ రావెల ఇలాగే చెలరేగిపోతారంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*