రావెల కు టిక్కెట్ ఇచ్చినా…??

గుంటూరు జిల్లాలో గుంటూరు నగరానికి చుట్టూ విస్తరించి ఉన్న నియోజకవర్గం ప్రత్తిపాడు. రాజకీయ సంచలనాలకు వేదిక అయిన ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు, గుంటూరు రూరల్‌, వట్టిచెరుకూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాలు విస్తరించి ఉన్నాయి. సామాజికవర్గాల పరంగా చూస్తే ప్రత్తిపాడు కమ్మ సామాజికవర్గానికి కంచుకోట. ప్రత్తిపాడులో రాజకీయ సమీకరణలు పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవానికి ముందు ఆవిర్భావం తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంది. గతంలో నీటి పారుద‌ల శాఖా మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య ఈ నియోజకవర్గంలో 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదు సార్లు విజయం సాధించారు. రత్తయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీకి ఇక్కడ తిరుగు లేదు.

రెండుసార్లు సుచరిత గెలిచి….

2004లో టీడీపీ కంచుకోటను బద్దలు చేస్తు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రావి వెంకటరమణ రత్తయ్యపై సంచలన విజయం సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. నియోజకవర్గాల పున‌ర్విభజనలో ప్రత్తిపాడు ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యింది. 2009లో కూడా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి జంప్‌ చెయ్యడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం సుచరిత మరో సారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుచరితపై మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు పొలిటికల్‌ ఎంట్రీతోనే ఆమెపై సంచలన విజయం సాధించడంతో పాటు ఏకంగా మంత్రి పదవి కూడా చేపట్టారు.

అభివృద్ధి పనులు చేస్తున్నా…

మంత్రిగా మూడేళ్ల పాటు ఉన్నా రావెల కిషోర్‌ బాబు కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఓ విధంగా చెప్పాలంటే తొలి మూడేళ్లలోనే రూ. 1200 పై చిలుకు కోట్లతో ఆయన అభివృద్ధి చేశారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే అభివృద్ధి పరంగా రావెల పర్వాలేదని అనిపించుకున్నా ఆయన వ్యక్తిగత తీరే ఆయన రాజకీయ జీవితాన్ని కేవలం మూడేళ్లలోనే సమూలంగా నాశనం చేసేసింది. నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీలో సీనియర్లు, దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న వారిని ఆయన ఏ మాత్రం లెక్క చెయ్యలేదు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఉంటూ ముందుగానే పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన రావెల తాను అధికారిని అన్న అహాన్ని వదులుకోకపోవడంతో తీవ్రమైన విమర్శలకు గుర‌య్యారు. దీనికి తోడు ఇటు శాఖా పరంగా పట్టు లేకపోవడం, నియోజకవర్గంలో అన్ని వర్గాల్లో వ్యతిరేకత మూటకట్టుకోవడం, ఆయ‌న నోటి దురుసుత‌నంతో బాబు చీవాట్లు పెట్టినా మార‌క‌పోవ‌డం, రావెల ఇద్దరి కుమారుల వ్యవహార శైలితో పార్టీకి పెద్ద నష్టం కలగడంతో గత ఏడాది జరిగిన ప్ర‌క్షాళ‌న‌లో చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టక తప్పలేదు.

మంత్రి పదవి పోయాక….

మంత్రి పదవి కోల్పోయాక రావెల ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చూపిన ప్రభావం అంతంత మాత్రమే. పార్టీ పరంగానూ ఇటు ఎమ్మెల్యేగాను ఆయనలో నిర్వేదం అలుముకుంది. వచ్చే ఎన్నికల్లో రావెలకు టిక్కెట్‌ రాదన్న వార్తల నేపథ్యంలో ఆయన దాదాపు సైలెంట్‌ అయ్యిపోతున్నారు. అంతే కాకుండా ఆయన ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగత దీక్షలు, ఇతర‌త్రా నిరసన కార్యక్రమాలు చేస్తుండడంతో టిక్కెట్‌ రాని పక్షంలో ఆయన తన దారి తాను చూసుకుంటారన్న వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. వచ్చే ఎన్నికల వేళ ఆయ‌న‌ పార్టీ మారిపోతారని… బాపట్ల నుంచి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇక విపక్ష వైసీపీ విషయానికి వస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి, 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి గత ఎన్నికల్లో రావెల చేతుల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రస్తుతం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు.

జనసేన దెబ్బతో….

వచ్చే ఎన్నికల్లో మరో సారి ఆమె పోటీ చెయ్యడం ఖ‌రారే అయినా… తాజాగా తెర మీదకు వచ్చిన వార్తల ప్రకారం చూస్తే ఆమె అనూహ్య కారణాల నేపథ్యంలో తప్పుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదని టాక్‌. ఆమె స్వయంగా తప్పుకుంటే వైసీపీ నుంచి మరో వ్యక్తి అక్కడ పోటీ చేసే ఛాన్స్ ఉంది. జనసేన విషయానికి వస్తే నియోజకవర్గంలో గుంటూరు రూరల్‌ మండలంలో కాపు సామాజికవర్గం ఓటర్లు బలంగా ఉన్నారు. ఆ పార్టీ ఇక్కడ బలంగా ఓట్లు చీల్చడం కాయం. అయితే జనసేన గెలిచినా… గెలవకపోయినా ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల తలరాతలను మార్చేలా ఓట్లు చీలిస్తే ప్రధాన పార్టీల్లో ఎవరో ఒకరికి షాక్‌ తప్పదు. మరి జనసేన షాక్‌ ఏ పార్టీకి అనేది ఎన్నికల సమరంలోనే చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*