రావెలకు రూటు దొరికింది….!!

తెలుగుదేశం పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టి అది కూడా కోల్పోయిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు నిన్న మొన్నటి వరకూ బిత్తర చూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇస్తుందో లేదో నమ్మకంలేని పరిస్థితి. అలాగని పార్టీని వదులుకుని వెళ్లలేరు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేద్దామని చేసిన ప్రయత్నాలు కూడా వికటించాయి. అక్కడ ఆల్రెడీ వైసీపీ అభ్యర్ధి, గత ఎన్నికల్లో ఓటమి పాలయిన మేకతోటి సుచరిత ఉండటంతో అక్కడ నో ఎంట్రీ బోర్డు కన్పించింది. దీంతో రెండేళ్లుగా రావెల కిశోర్ బాబు తన ప్రయాణం ఎటువైపో అని నలుదిక్కులూ చూస్తున్నారు.

జనసేనలో చేరికకు….

అయితే ఆయనకు జనసేనలో బంపర్ ఆఫర్ తగిలినట్లు ప్రచారం జరుగుతోంది. రావెల కిశోర్ బాబును చేర్చుకునేందుకు జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓకే చెప్పారని సమాచారం. దీంతో రావెల తట్టాబుట్టా టీడీపీ నుంచి సర్దుకునేందుకు సిద్దమయ్యారు. అన్నీ కలసి వస్తే రేపు ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశముంది. పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోరగా ఆయన డిసెంబరు 1వ తేదీన కలవాల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రావెల రేపు జనసేన పార్టీలో చేరతారా? పవన్ తో మాట్లాడి తన భవిష్యత్ పై హామీ తీసుకున్న తర్వాత చేరతారా? అన్నది తెలియాల్సి ఉంది.

మంత్రి పదవి నుంచి….

రావెల కిశోర్ బాబు ఉన్నతాధికారిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆర్థికంగా బలంగా ఉండటం, కుల సమీకరణాలు కూడా కలసి రావడంతో ఆయనకు గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు టిక్కెట్ ను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే తొలిసారి ఎన్నికల్లోనే ఆయన విజయ బావుటాను ఎగురవేశారు. గత ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరిత పైన 7,405 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కింది. దాదాపు మూడేళ్లు మంత్రి పదవిలో రావెల కొనసాగారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

సొంత పార్టీ నేతలే….

అయితే ఏడాది క్రితం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రావెల మంత్రి పదవిని కోల్పోయారు. రావెల పనితీరు సక్రమంగా లేదనే ఆయనను పదవి నుంచి చంద్రబాబు తప్పించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు రావెల దూరంగా ఉంటూ వస్తున్నారు. గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ విషయంలోనూ రావెల జోక్యాన్ని పార్టీ తప్పుపట్టడం, సొంత నియోజకవర్గంలోనే ఒక సామాజిక వర్గం నేతలు రావెలకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టడంతో టీడీపీ నుంచి ఎప్పుడు బయటపడదామా? అని రావెల ఆలోచన చేస్తున్నారు. ఇన్నాళ్లకు జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆయన చేరిక దాదాపుగా ఖాయమయిపోయింది. ఒక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతుండటం అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*