బరిలోకి…గిరి గీసి…..!

తెలుగు రాజకీయాల్లో లేడీ ఫైర్ బ్రాండ్‌ అనే పదానికో పాపులారిటీ తెచ్చిన ఘ‌న‌త మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికే దక్కుతుంది. తెలుగుదేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలుగా అంచలంచెలుగా జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన రేణుక జాతీయస్థాయి రాజకీయాల్లోనే ఫైర్ బ్రాండ్‌ అనిపించుకున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆమె తెలంగాణాలో కాంగ్రెస్ ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో రాజకీయంగా కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. ఆమెకు జాతీయ కాంగ్రెస్‌లో చక్రం తిప్పే అనుభవం ఉన్నా స్థానికంగా ఖ‌మ్మం జిల్లాలో మాత్రం భ‌ట్టి విక్రమార్కలాంటి నేతలతో విభేదాలు ఉన్నాయి.

అసెంబ్లీ బరిలోకి……

ప్ర‌స్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి స్టార్ట్‌ అయ్యింది. మరో రెండు నెలల్లో ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేణుక ఎలాంటి నిర్ణయం తీసుకుంటార‌న్నదానిపై తెలంగాణ, కాంగ్రెస్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చలు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా జాతీయస్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవరించిన రేణుక వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలంగాణ అసెంబ్లీ బరిలో తన అదృష్టాన్ని పరిక్షించుకోనునట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆమె పట్టు పట్టి మరి తన అనుంగు శిష్యుడైన పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఖ‌మ్మం అసెంబ్లీ సీటు ఇప్పించుకున్నారు. ప్రస్తుత మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావునే ఓడించిన అజయ్‌ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసేశారు.

ఎంపీ సీటు టీడీపీకి……

ఇక తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వెయ్యాలని భావిస్తున్న రేణుక ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తాను టికెట్‌ ఇప్పించిన తన శిష్యుడు పువ్వాడ మీదే ఈ సారి రేణుక పోటీకి దిగుతూ సవాల్‌ విసిరేందుకు రెడీ అవుతుంది. వాస్తవంగా ఖ‌మ్మం ఎంపీగానే పోటీ చేయాలని రేణుక భావించారు. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఖ‌మ్మం ఎంపీ సీటును మాజీ ఎంపీ నామా నాగేశ్వరావుకు ఇస్తారన్న అంచనాలు ఉన్నాయి.

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు……

ఈ క్రమంలోనే రేణుక అసెంబ్లీ మీద దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది జాతీయ స్థాయిలో చక్రం తిప్పే ఆమెకు ఖ‌మ్మం అసెంబ్లీ సీటు దక్కడం పెద్ద కష్టమేమి కాదు. ఖ‌మ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గ ఓట‌ర్ల‌తో పాటు ఆమె గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యురాలుగా చేసిన పలు అభివృద్ధి పనులు కూడా ఆమెకు ప్లస్‌ అవుతాయి. ఏదేమైన ఖ‌మ్మం అసెంబ్లీ సీటు దక్కించుకుని తన శిష్యుడు పువ్వాడ భ‌రతం పట్టేందుకు రేణుక రెడీ అవుతోంది. రేణుక ఎంట్రీతో ఖ‌మ్మం అసెంబ్లీ బరిలో వచ్చే ఎన్నికల్లో హోరాహోరి పోరు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేణుక కూడా సీఎం రేసులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*