రేవంత్ వంతు వచ్చేసినట్లేనా?

తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మాత్రం పప్పులుడకడం లేదు. తాను ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. రేవంత్ ప్రధాన టార్గెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. అందుకే కేసీఆర్ కు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టినా రేవంత్ కాళ్లకు బంధం వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అందుకే ఆయన ఇటీవల మీడియా మిత్రులతో జరిపిన చిట్ చాట్ లో తన ఆవేదనను వెళ్లగక్కారు. తాను ఏం చేయాలనుకున్నా ఇక్కడ కుదరడం లేదన్నది రేవంత్ మాటట్లోనే అర్థమయింది. అయితే ఎప్పటికైనా తానే సీఎం నంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చిచ్చురేపాయనే చెప్పాలి. రేవంత్ అలా వ్యాఖ్యానించి ఉండాల్సింది కాదని, సీఎంను అధిష్టానమే నిర్ణయిస్తుందని అంటున్నారు.

దూకుడు స్వభావంతో….

రేవంత్ రెడ్డి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో ఫాస్ట్ గా వెళితేనే జనంలోగుర్తింపు పొందుతారని ఆయన నమ్ముతారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారంటే ఆయన దూకుడు స్వభావమే కారణమని చెబుతారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇక కాలం చెల్లినట్లేనని భావించిన రేవంత్ రెడ్డి చివరకు కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ లో చేరేటప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక హామీలు లభించినట్లు కూడా చెబుతున్నారు.

పార్టీలో చేరే సమయంలో….

రేవంత్ రెడ్డికిపీసీసీలో కీలక బాధ్యతలను ఇవ్వడమే కాకుండా, ఆయనతో పాటు వచ్చిన వారికి టిక్కెట్ గ్యారంటీ కూడా ఇచ్చారన్నది రేవంత్ వర్గీయుల వాదన. అయితే బస్సు యాత్ర సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు కొందరిని హైలెట్ చేయడం, తన వెంట వచ్చిన వారిని పెద్దగా పట్టించుకోక పోవడం వల్లనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. రేవంత్ లో అసంతృప్తి అందుకే బయటపడిందంటున్నారు. ముఖ్యంగా సీతక్క వంటి వారి విషయంలో పార్టీ ఇప్పటికీ హామీ ఇవ్వకపోవడంతో రేవంత్ కలత చెందే ఆయన పీసీసీ అధ్యక్షుడిపైనే కామెంట్స్ చేశారని గాంధీభవన్ లో చెప్పుకుంటున్నారు.

నేడు ఢిల్లీకి పీసీసీ నేతలు…..

రేవంత్ అసంతృప్తిని గమనించిన పీసీసీ నేతలు ఆయనకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు కూడా. ఈరోజు పీసీసీ నేతలు ఢిల్లీ వెళుతున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచాంర ముగియడంతో ఢిల్లీ వెళ్లి రాహుల్ ను కలిసి రేవంత్ కు పార్టీ లో బాధ్యతలను అప్పగించే విషయంపై చర్చిస్తారని తెలుస్తోంది. రేవంత్ లాంటి నేతలు ఇప్పుడు పార్టీపై ఆరోపణలు చేస్తే అసలే పుట్టి మునిగిపోతుందని భావించిన ఉత్తమ్ రేవంత్ కు ఏదో ఒక పదవి ఇప్పించాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి సీఎం అయిపోతానంటే కదరదుపొమ్మంటున్నారు. రేవంత్ కు అంత సామర్థ్యమే ఉంటే టీడీపీని తెలంగాణాలో బలోపేతం చేయొచ్చు గదా? అని ఎద్దేవా కూడాచేశారు. మొత్తం మీద రేవంత్ వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.