రేవంత్ రెడ్డి రైజింగ్ స్టార్ కాదా..?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది..? టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారిన ఆయనకు చెక్ పెట్టాలని ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? స్వంత నియోజకవర్గంలో రేవంత్ ను ఓడించేందుకు వేస్తోన్న స్కెచ్ వర్కవుట్ అవుతుందా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. రానున్న ఎన్నికల్లో ఆయన హస్తం గుర్తు నుంచి పోటీ చేయనున్నారు. రేవంత్ ను ఓడించేందుకు టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలు రేవంత్ కు కీలకంగా మారనున్నాయి.

గెలుపు అంత సులువు కాదా..?

‘తన టార్గెట్ 2024..!’ ఇదీ రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన మాట. అంటే, 2024 కల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి కల. మరి ఆ కల నెరవేరాలంటే ముందు నియోజకవర్గంలో బలం నిరూపించుకోవాలి. 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి సుమారు ఏడు వేల ఓట్లతో, 2014 ఎన్నికల్లో 14 వేల ఓట్లతో ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ మెజారిటీని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి రెండుసార్లూ కొడంగల్ ఏం కంచుకోట కాదు అని చెప్పవచ్చు. రెండు ఎన్నికల్లోనూ రేవంత్ సొంత బలంతో పాటు పార్టీ బలమే ఆయన గెలుపు ముఖ్య కారణం. అయితే, ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు సులువేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రేవంత్ ను ఓడించడమే టార్గెట్ గా…

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంలోనే శాసనసభ్యుడిగా కూడా రాజీనామా చేశారు. దీంతో అప్పుడే ఉప ఎన్నికలు వస్తాయని భావించిన టీఆర్ఎస్ ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు కొడంగల్ బాధ్యతలు అప్పగించింది. దీంతో హరీష్ కొడంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. నియోజకవర్గ అభివృద్ధికి చొరవ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి పోటీగా గట్టి అభ్యర్థిని వెతికే పనిలో పడ్డారు. రేవంత్ రెడ్డిపై రెండుసార్లు పోటీచేసి ఓడిన గురునాథ్ రెడ్డి అంతకుముందు అయిదు సార్లు విజయం సాధించి నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్. కానీ, వయస్సురిత్యా ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని పోటీ చేయించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. బలమైన రాజకీయ కుటుంబం కావడం, అంగ, అర్థ బలాలు ఉండటంతో రేవంత్ కి ఆయనే బలమైన ప్రత్యర్థి అని భావిస్తోంది టీఆర్ఎస్. టీఆర్ఎస్ పై ప్రస్తుతం బలంగా ఎదురుదాడి చేస్తోన్న ప్రతిపక్ష నేతల్లో రేవంత్ రెడ్డి ముందున్నారు. దీంతో ఎలాగైనా రేవంత్ ను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వ కూడదు అని ఆ పార్టీ పెద్దలు పంతం పట్టారు. ఈ ఎన్నికల్లోనే రేవంత్ ను ఓడిస్తే పూర్తిగా చెక్ పెట్టవచ్చని భావిస్తోంది.

కొడంగల్ కంచుకోట అంటూ…

ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గతంలో కంటే నియోజకవర్గంలో బలంగా మారుతున్నారు. తనకు కొడంగల్ కంచుకోట అంటున్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ కి ధీటుగా బలనిరుపణ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకుడిగా ఎదగడంతో నియోజకవర్గ ప్రజల్లోనూ రేవంత్ కి బలం పెరిగింది. పైగా వైఎస్ కుటుంబానికి పులివెందుల ఎలానో, చంద్రబాబుకి కుప్పం ఎలానో తనకు కొడంగల్ కూడా అలానే అని చెబుతూ ప్రజలను  తన వైపే ఉండేలా చూసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ కి సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రచార బాధ్యతలు రేవంత్ పైన పెడితే మాత్రం కొడంగల్ లో ఆయన అంత సమయం కేటాయించే అవకాశం ఉండదు. ఇదే సమయంలో టీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డిని ఓడించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. సంవత్సర కాలంగా కొడంగల్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ టీఆర్ఎస్ వల్లె కొడంగల్ అభివృద్ధి చెందుతుందనే ఇమేజ్ ను ప్రజల్లో తీసుకెళుతోంది. మొత్తానికి కొడంగల్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితితి ఉండటంతో ఇరుపార్టీలకూ గెలుపు నల్లేరు మీద నడక అయ్యే అవకాశం మాత్రం కచ్చితంగా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*