రేవంత్ అలా ఉపయోగపడతారా?

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ముందుగానే ప్లాన్ చేసి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి పంపారా ..? అవుననే ఎక్కువమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణాలో ప్రధాన పోటీ టిఆర్ఎస్, కాంగ్రెస్ ల నడుమే నడుస్తుందని ఏడాది కిందటే అంతా ఊహించారు. ఈ నేపథ్యంలోనే టి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి బాబు ముందే పంపించారని కొందరి ఆరోపణలు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిజమౌతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి రేవంత్ సహకారంతో కాంగ్రెస్ తో పొత్తుకు తెరతీయాలన్నది మాస్టర్ మైండ్ చంద్రబాబు ఆలోచన అయ్యి ఉంటుందని తేలుతుంది.

కాంగ్రెస్ కమిటీలో రేవంత్ …

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ లతో కూడిన కమిటీ టిడిపి పొత్తు వ్యవహారాలు చూసేందుకు ఏర్పాటైంది. ఈ కమిటీలో రేవంత్ కి చోటు దక్కడం వెనుక టిడిపి కాంగ్రెస్ ల నడుమ ముందే అవగాహన ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. టిడిపి కి ఎన్నిసీట్లు కేటాయించాలి? ఎక్కడ కేటాయించాలి వంటి కీలక అంశాలు రేవంత్ కమిటీ లెక్కలు వేస్తుంది. ఫలితంగా చంద్రబాబు కోరుకున్న స్థానాలు సులువుగానే ఆ పార్టీకి లభించనున్నాయి.

అధికారంలోకి వచ్చినా……

అందుకే ముందే హస్తం పార్టీ లోకి రేవంత్ జంప్ అయ్యారన్న వాదనకు మరింత బలం చేకూరించింది. దీంతోపాటు రేవంత్ రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చినా స్పీకర్ కు పంపకపోవడానికి కూడా కారణమని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. రేవంత్ శాసనసభ రద్దయ్యే రోజే తిరిగి స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను పంపడం కూడా చర్చనీయాంశమైంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రేవంత్ సహకారంతో తెలంగాణలో తమ పనులు పూర్తి చేయించుకోవచ్చన్నది బాబు ప్లాన్ గా ఉంది. అందుకే రేవంత్ కూడా పార్టీ వీడే సమయంలో టీడీపీపై ఎలాంటి విమర్శలు చేయని విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేసుకుంటున్నారు.