రూపాయి పాపాయి అయిపోయిందే…?

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది భారత ఆర్ధిక పరిస్థితి. గత 15 నెలల కాలంలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ ఐదు శాతానికి తగ్గడంతో షేర్ మార్కెట్ లో అలజడి రేగింది. పెట్టుబడిదారులు ఆందోళనలో పడ్డారు. మార్కెట్ లో రూపాయి పతనం వేగవంతంగా సాగుతుండటంతో రిజర్వ్ బ్యాంక్ సైతం రంగంలోకి దిగిపోయింది. అయినా రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోలేక పోయింది. వాస్తవానికి డాలర్ తో పోటీ పడుతూ గత కొంతకాలంగా రూపాయి విలువ నిలబడిందనే చెప్పాలి. కానీ ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పడిపోవడంతో ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్ – అమెరికా సంబంధాల దెబ్బతో …

ఇరాన్, అమెరికా నడుమ అణు ఒప్పందం రద్దుతో ప్రపంచ వ్యాప్తంగా షేర్ మార్కెట్ లో కుదుపు ఏర్పడింది. ముఖ్యంగా భారత్ వంటి దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్న దేశాలు ఇప్పుడు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తింది. క్రూడాయిల్, ఇతర ఇంధనాలను ఇరాన్ నుంచి మన దేశం దిగుమతులు చేసుకోవడమే దీనికి కారణం అంటున్నారు. అమెరికా ఇరాన్ ల నడుమ ఏర్పడిన అగాధం భారత్ కి ఇప్పుడు శాపంగా మారింది. అసలే నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలతో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న భారత్ లో రూపాయి విలువ పతనం ఆర్ధిక అభివృద్ధి రేటు పై గణనీయ ప్రభావం చూపించే అవకాశాలు వున్నాయి. మరి దేశ ఆర్ధిక ప్రగతి దెబ్బతినకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.