సేఫ్ జోన్లో అమాత్యులు‌…!

ఏపీలో కూడా ఎన్నికల హీట్‌ స్టార్ట్‌ అవ్వడంతో సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరిని పోటీలోకి దింపాలి అన్నదానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశారు. ఇప్పటికే 40 – 50 నియోజకవర్గాల్లో సిట్టింగులను పక్కన పెట్టేస్తారన్న మాటలు అయితే బయటకు వచ్చాయి. అయితే క్షేత్రస్థాయిలో ప్రస్తుతం కొంత మంది మంత్రులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత చూస్తుంటే చంద్రబాబు కచ్చితంగా కాస్త అటూ ఇటూగా 50 మందిని పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం. కొంత మంది మాజీ మంత్రులకు సైతం నియోజకవర్గాల మార్పు లేదా అసలు సీటే ఉండదన్నది కూడా వాస్తవం. ఇక వచ్చే ఎన్నికల్లో కొంత మంది మంత్రులకు మాత్రం ఇప్పటికే సీటుపై లైన్‌ క్లియర్‌ అయ్యినట్టు తెలిసింది.

నారాయణకు నెల్లూరే……

ఈ లిస్ట్‌లో కొత్తగా పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ పేరు దాదాపు ఖ‌రారు అయ్యింది. బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న నారాయణ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచిపోటీ చెయ్యడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చారని సమాచారం. నారాయణకు ఇప్పటి వరకు నియోజకవర్గం లేదు. నెల్లూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు సొమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, నారాయణ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ఉండడంతో పార్టీ అక్కడ పుంజుకోలేదన్న భావనలో అధిష్టానం ఉంది. ఈ క్రమంలోనే నారాయణను నెల్లూరు సిటీ నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇక అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సొమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేయిస్తారా లేదా ? ఆయన నెల్లూరు రూరల్‌కు మారతారా లేదా సర్వేపల్లిలో ఆయన తన వారసుడిని దింపి ఆయన ఎమ్మెల్సీగానే ఉంటారా అన్నదానిపై క్లారిటీ లేదు.

వీరిస్థానాల్లో మార్పులేదు…..

ఇక పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మరో సారి తన సొంత నియోజకవర్గం రాయదుర్గం నుంచి పోటీ చెయ్యడం కూడా ఖ‌రారు అయ్యింది. అనంతపురం జిల్లాలోని మరో మంత్రి పరిటాల సునీత కూడా రాప్తాడు నుంచే మూడో సారి పోటీ చేయ‌నున్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు మరో సారి టెక్కలి నుంచే పోటీ చేస్తారు. ఎచ్చెర్లలో కళా వెంకటరావు, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. విశాఖ జిల్లా మంత్రుల విషయంలో ఇంకా స్పష్టత రానట్టు తెలుస్తోంది. మంత్రి గంటాను చంద్రబాబు పార్లమెంటుకు పంపాలని చూస్తున్నా ఆయన మాత్రం అసెంబ్లీకే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. మంత్రి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి స్థానంపై అటు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ సైతం కన్నెయ్యడంతో గంటా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా ? లేదా పార్లమెంటుకు వెళ్తారా ? లేదా అసెంబ్లీ నియజకవర్గం మారతారా ? అన్నది తేలాల్సి ఉంది.

కొందరు పార్లమెంటుకు…..

మైలవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో సారి అక్కడే బరిలోకి దిగనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన నక్క ఆనంద్‌ బాబు వేమూరు బ‌రిలోనే ఉంటారు. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎంపీగా వెళ్తారా లేదా చిలకలూరిపేట అసెంబ్లీ బరిలో ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. ఆయ‌న అసెంబ్లీకే మొగ్గు చూపుతున్నారు. ప్రకాశం జిల్లా మంత్రి శిద్ధా రాఘవరావు సైతం పార్లమెంటుకు పోటీ చేస్తారా మళ్ళీ దర్శి నుంచి బరిలో ఉంటారా అన్నది చూడాల్సి ఉంది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆయన కోసం కృష్ణా జిల్లాలో పెనమలూరు, గుంటూరు జిల్లాల్లో మంగళగిరి, చిత్తూరు జిల్లా కుప్పం పేర్లు పరిశీలన ఉన్నాయి. ఏదేమైనా ఇక చాలా మంది మంత్రుల విషయంలో క్లారిటీ వచ్చినా కొంత మంది మంత్రుల పోటీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*