
డైలాగ్ కింగ్ సాయికుమార్ మరోసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కన్నడనాట ప్రముఖ హీరోగా వెలుగొందిన సమయంలోనే ఆయన 2008 ఎన్నికల్లో బీజేపీ తరపున బాగేపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు రాజకీయంగా అత్యంత సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆయన రంగంలోకి దిగుతున్నారు. ఒవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని ఓడించాలని టీడీపీ నేతలు అక్కడి తెలుగు ప్రజలకు పిలుపునిస్తుండగా.. మరోవైపు అదే బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్ పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి శాసన సభ నియోజక వర్గంలో ఆయన బరిలో ఉంటున్నారు. అసలు బాగేపల్లిలో సాయికుమార్ సత్తా ఎంత అనేది ఆసక్తికరంగా మారింది.
2008 ఎన్నికల్లో నాలుగో స్థానం…..
బాగేపల్లి కర్ణాటకలో ఉన్నా అది అనంతపురం జిల్లాకు ఆనుకునే ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది తెలుగు వారే ఉంటారు. తెలుగే ఎక్కువ మాట్లాడుతుంటారు. అక్కడ వ్యాపారాలు కూడా ఎక్కువ తెలుగు వారివే. అక్కడ కమ్మ వర్గంతో పాటు రెడ్డి వర్గం ఓటర్లు చాలా ఎక్కువ. అయితే 2008 శాసన సభ ఎన్నికల్లోనే సాయికుమార్ బాగేపల్లి శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. 2008లో బాగేపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎన్. సంపంగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సంపంగికి (కాంగ్రెస్) 32,244 ఓట్లు, శ్రీరామరెడ్డికి (కమ్యూనిస్టు) 31,306 ఓట్లు, నాగరాజ రెడ్డికి (జేడీఎస్) 27,926 ఓట్లు, సాయికుమార్ కు (బీజేపీ) 26,070 ఓట్లు వచ్చాయి. సాయికుమార్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.
గత ఎన్నికల్లో……
2013 ఎన్నికల్లో బాగేపల్లి నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుబ్బారెడ్డి 65,187 ఓట్లతో ఘన విజయం సాధించారు. సీపీఐ (ఎం) నుంచి పోటీ చేసిన శ్రీరామరెడ్డికి 35,263 ఓట్లు, జేడీఎస్ నుంచి పోటీ చేసిన హరిదాస్ రెడ్డికి 16,539 ఓట్లు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సంపంగికి 15,431 ఓట్లు వచ్చాయి. 2008లో బాగేపల్లి నుంచి పోటీ చేసి నాలుగో స్థానానికి పరిమితమైన సాయికుమార్ మళ్లీ బాగేపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారైనా ఆయన విజయం సాధిస్తారో ? లేదో చూడాలి. గతంతో పోలీస్తే ఈసారి కన్నడలో రాజకీయంగా మరింత గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఎటువైపు మొగ్గు చూపుతారో?
తెలుగు ప్రజలు జేడీఎస్‌కు ఓటు వేయాలని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎంఐఎం సైతం జేడీఎస్‌కే సపోర్ట్ చేస్తోంది. అక్కడ కాస్తో కూస్తో ఉన్న ముస్లింలు కూడా జేడీఎస్ వైపే మొగ్గు చూపే ఛాన్సులు ఉన్నాయి. మిగిలిన వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. బాగేపల్లి నియోజక వర్గంలో మెజార్టీ సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో…. బాగేపల్లిలో నటుడు సాయికుమార్ ఎంత వరకు స్థానిక ప్రజలను ఆకట్టుకుంటారో మరి. గత ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన సుబ్బారెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేస్తున్నారు.
Leave a Reply