సంగారెడ్డిలో జగ్గారెడ్డి పరిస్థితేంటి..?

ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాష్ట్రమంతా గత నెల నుంచి ఎన్నికల వాతావరణం ఉన్నా సంగారెడ్డిలో మాత్రం చాలా రోజులుగా ఎన్నికల సందడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ వారంలో ఎన్నికలు అన్నంత రేంజ్ లో వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) అరెస్ట్ తో నియోజకవర్గ రాజకీయాలు ఇంకా వేడెక్కాయి. గత ఎన్నికల్లో జగ్గారెడ్డిని ఓడించిన టీఆర్ఎస్ మళ్లీ విజయపతాకం ఎగరవేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆ పార్టీ టిక్కెట్ ను తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కే ఖాయం చేసింది. ఇప్పటికే ఆయన ప్రచారం ప్రారంభించారు.

సమైక్యవాదిగా ముద్రపడినా…

మాస్ లీడర్ గా పేరున్న జగ్గారెడ్డి 2004లో మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ తరపున సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్ గూటికి చేరి టీఆర్ఎస్ పార్టీకి బద్ధశత్రువుగా మారారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన అప్పటి టీడీపీ అభ్యర్థి చింతా ప్రభాకర్ పై విజయం సాధించారు. కాంగ్రెస్ లో కీలకనేతగా ఎదిగారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో జరుగుతున్న సమయంలో ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా ఉండి సమైక్యవాదిగా ముద్ర వేసుకున్నారు. కానీ, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా మారి నియోజకవర్గాన్ని మాత్రం బాగా అభివృద్ధి చేసుకోగలిగారు. జగ్గారెడ్డిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ ను బరిలో దింపారు. హరీష్ రావు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ టీఆర్ఎస్ ను గెలిపించారు.

ప్రభావం చూపనున్న జగ్గారెడ్డి అరెస్టు

ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హరీష్ రావు సంగారెడ్డి రాజకీయాల్లో కీలకంగానే వ్యవహరించారు. సంగారెడ్డికి తరచూ వెళ్లడం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో సంగారెడ్డిలో టీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. ఈసారి కూడా ఆయన ప్రచార బాధ్యతలను స్వీకరించారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండనున్న జగ్గారెడ్డికి కూడా నియోజకవర్గంలో బాగా పట్టు ఉంది. ఆయన వైఖరి కొన్నిసార్లు వివాదాస్పదమైనా ప్రజల్లో ఉండే నేతగా పేరుంది. దీనికితోడు ఆయన హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందిందనే పేరు కూడా ఉంది. ప్రజాసమస్యలపై ఆయన ఎప్పటికప్పుడు ఏదో ఓ కార్యక్రమం, దీక్షలు చేపట్టి ప్రజల్లో ఉంటూ వచ్చారు. ఇక, ఇటీవల పాత కేసులో జగ్గారెడ్డి అరెస్టు కావడం ఈ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. జగ్గారెడ్డి తప్పు చేశారని టీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినా… పాత కేసును కావాలనే ఎన్నికల ముందు బయటకు తీసుకువచ్చారనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. దీంతో అదికాస్తా సానుభూతిగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

పట్టుదలతో ఉన్న అభ్యర్థులు…

భారతీయ జనతా పార్టీకి కూడా సంగారెడ్డిలో కొంత ఓటు బ్యాంకు కలిగి ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉన్నా… ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చింతా ప్రభాకర్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా… జగ్గారెడ్డి కూడా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని చింతా ప్రభాకర్ అభ్యర్థిస్తుంటే… తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని జగ్గారెడ్డి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్ కు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి కొరకరాని కొయ్య లాంటి జగ్గారెడ్డిని మళ్లీ ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వ వద్దని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అయితే, ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవకపోతే తన రాజకీయ ప్రభ మసకబారుతుందని జగ్గారెడ్డి భావించి గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*