పవార్ కు ఆ ఒక్కటీ దక్కదా?

‘‘రాష్ట్రస్థాయికి ఎక్కువ….. జాతీయ స్థాయికి తక్కువ’’ అన్న విశ్లేషణ శరద్ పవార్ కు చక్కగా సరిపోతుంది. సగటు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల లక్ష్యం ప్రధానమంత్రి కావడం. ఆ పదవిలో ఒక్కసారన్నా కూర్చోవడం. కానీ అది చాలా మందికి అందని ద్రాక్ష. అందినట్లు కనపడుతుంది తప్ప అందలేదు. ఇందుకోసం పంతాలు, పట్టింపులు, సిద్ధాంతాలు, విలువలు పక్కన పెట్టినా ఫలితం ఉండదు. గతంలో చరణ్ సింగ్, చంద్రశేఖర్ వంటి నాయకులు తమ బద్ధ శత్రువులైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో చేతులు కలిపి ప్రధాన మంత్రి పదవి దక్కించుకున్నప్పటికీ కొద్ది రోజుల్లోనే వారి కథ ముగిసింది. ఇందిరాగాంధీ అవకాశం చూసి చరణ్ సింగ్ కు మద్దతు ఉపసంహరించగా, రాజీవ్ గాంధీ కూడా ఇదే పేరుతో చంద్రశేఖర్ కు చుక్కలు చూపించడం ఫలితంగా ఇద్దరు నాయకులకు ప్రధాని పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ప్రస్తుతం ప్రధాని పదవికి రాహుల్ దూరంగా ఉంటానన్న వ్యాఖ్యలు చేయడంతో శరద్ పవార్ రాజకీయ జీవితంపై ‘‘తెలుగు పోస్ట్’’ ప్రత్యేక కథనం.

కలసి రాక….

చరణ్ సింగ్, చంద్రశేఖర్ ల మాదిరిగానే ఎంతో మంది నాయకులు ప్రధాని పదవి కోసం ఎదురు చూశారు. నారాయణ్ దత్ తివారి, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్ వీరిలో ముఖ్యులు. ఇక పవార్ విషయానికొస్తే ప్రజా బాహుళ్యంలో పట్టున్న నాయకుడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా, బీసీసీఐ అధ్యక్షుడిగా, లోక్ సభ లో విపక్ష నేతగా వివిధ పదవులను సమర్థవంతగా నిర్వహించారు. సహజంగా ఇలాంటి నాయకుడు ప్రధాని పదవిని ఆశించడంలో తప్పులేదు. కానీ ఆయనకు కాలం కలసి రాలేదు. పరిస్థితులు సహకరించలేదు. ఫలితంగా సీనియర్ నాయకుడిగానే ఆయన మిగిలిపోయారు. రాజకీయంగా చివరి దశలో ఉన్నారు. కుమార్తె సుప్రియా సూలే, మేనల్లుడు అజిత్ పవార్ ను రాజకీయ వారసులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో లేనే లేవు. పవార్ కు కూడా ఈ విషయం తెలుసు.

మైనస్ ఇదేనా?

హిందీ భాషపై పట్టులేకపోవడం, అవకాశవాద రాజకీయం, సిద్ధాంత లేమి వంటివి ఆయనకు ప్రధాని పదవి దక్కకపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పక తప్పదు. హిందీపై పట్టు లేక పోవడం రాజకీయంగా తనకు మైనస్ అయిందని పవార్ పలుమార్లు చెప్పారు. మరాఠీ అయిన ఆయనకు హిందీపై అవగాహన అరకొరే. కానీ హిందీ అసలు రాని దేవెగౌడ ప్రధాని అయ్యారన్నది ఇక్కడ గమనార్హం. తాను ప్రధానిని కాకపోవడానికి హిందీపై పట్టులేకపోవడం కూడా ఒక కారణమని మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ఒక సందర్భంలో ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ సిద్ధాంత రహిత, అవకాశవాద రాజకీయం, విశ్వసనీయత కొరవడటం అసలు కారణమన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. మహారాష్ట్రలో పట్టున్న ప్రజానాయకుడైనప్పటికీ పవార్ కు ప్రత్యేకంగా సిద్దాంతం అంటూ ఏమీ లేదు. మతతత్వ పార్టీగా ముద్రపడిన శివసేన, బీజేపీకి ఎంత సన్నిహితుడో,… కాంగ్రెస్ కు కూడా అంతే సన్నిహితుడు. ఎవరిపైనా, ఏ పార్టీపైనా ఎప్పుడూ నేరుగా విమర్శలు చేయరు. అందుకే ఆయన ఎంత దగ్గరో అంత దూరం. ఎవరూ పూర్తిగా విశ్వసించరు. 1991 లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో రాజీవ్ గాంధీ హత్యతో ఎన్.డి.తివారీ, పీవీ నరసింహారావుతో పాటు పవార్ పేరూ తెరపైకి వచ్చింది. కానీ పార్టీ పట్ల పీవీ విశ్వసనీయత, అనుభవం, అవగాహన ముందు పవార్ తేలిపోయారు. ఫలితంగా ఆయన మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా పనిచేయాల్సి వచ్చింది. 2004లో యూపీఏ విజయంతో ప్రధాని పదవికి మళ్లీ పవార్ పేరు పరిశీలనలోకి వచ్చింది. కానీ యూపీఏ ఛైర్మన్ సోనియా గాంధీ సుముఖత చూపలేదు. 1999లో తన విదేశీయతను ఎత్తిచూపి ఎన్సీపీ పేరుతో కొత్త పార్టీని పవార్ ప్రారంభించిన విషయం ఆమె మరచి పోలేదు. అప్పట్లో మేఘాలయ రాష్ట్రానికి చెందిన పీఏ సంగ్మా, బీహార్ కు చెందిన తారిక్ అన్వర్, పవార్ తదితరులు సోనియా విదేశీయతను ఎత్తి చూపి ఆమె ప్రధాని అయ్యే అవకాశాలకు గండి కొట్టారు. దీంతో ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న సోనియా 2004లో పవార్ బదులు మన్మోహన్ ను ప్రధానిగా ఎంపిక చేశారు. చివరికి ఆయన మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రధాని పదవిని కాసేపు పక్కన పెడితే కనీసం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాలన్న ఆయన కోరిక కూడా నెరవేరలేదు. 1997 జూన్ లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పట్లో ఆయనపై వృద్ధ నాయకుడు సీతారాం కేసరి పైచేయి సాధించారు.

అవకాశాలు లేవా?

ప్రధాని పదవిని అందుకోలేనప్పటికీ భారత రాజకీయాల్లో, మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ ను తక్కువగా అంచనా వేయలేం. మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా , రెండు సార్లు కేంద్రమంత్రిగా, లోక్ సభలో ప్రతిపక్ష నేతగా, కీలకమైన బీసీసీఐ, ఐసీసీ ఛైర్మన్లుగా పనిచేసిన పవార్ కు జన బాహుళ్యంలో ఎంత పట్టుందో…లాబీయింగ్ చేయడంలో కూడా అంతే దిట్ట. 1940 డిసెంబరు 12న బారామతిలో జన్మించిన పవార్ 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన ప్రస్థానం విజయవంతంగా సాగుతోంది. ముఖ్యమంత్రి వైబీ చవాన్ శిష్యుడిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1978లో కాంగ్రెస్ నుంచి విడిపోయి జనతా పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని తొలిసారి చేపట్టారు. ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరిట సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. 1980లో అధికారం చేపట్టిన ఇందిరాగాంధీ అదే ఏడాది ఫిబ్రవరిలో పవార్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1983లో కాంగ్రెస్ (ఎస్) స్థాపించి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. 1988లో రాజీవ్ గాంధీ ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చేశారు. 1993లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనను మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లోకి పంపారు. పీవీ, మన్మోహన్ మంత్రివర్గాల్లో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇటీవల కాలంలో పవార్ ప్రభ తగ్గుతోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కేవలం ఆరు సీట్లను మాత్రమే గెల్చింది. రెండు బీహార్ , నాలుగు సొంత రాష్ట్రం నుంచి ఎన్సీపీ గెలిచింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సొంత నియోజవకర్గమైన బారామతి నుంచి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన కూతురు సుప్రియ సూలే బారామతి ఎంపీ. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. తిరిగి పార్టీకి పునరత్తేజం కల్పించే పనిలో పవార్ నిమగ్నమయ్యారు. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప పవార్ రాజకీయంగా ఉన్నత స్థితికిచేరే అవకాశాలు లేవు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*