శశికళను ఇలా సాగనంపారా?

అన్నాడీఎంకే లో చిన్నమ్మ శశికళ ఉన్నట్లా? లేనట్లా? దీనికి సమాధానం ఎవరి వద్దా లేదు. పళని స్వామి, పన్నీర్ సెల్వం ఏకమైన వేళ ఒక్క టీటీవీ దినకరన్ ను మాత్రమే పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పట్లో శశికళ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండటంతో ఆమెపై బహిష్కరణ వేటు వేయలేదు. జైలులో ఉన్న వారిపై బహిష్కరణ వేటు ఎందుకనుకున్నారో ఏమో? ఆమె గురించి వదిలేశారు. ఇప్పటికీ శశికళ అన్నాడీఎంకే సభ్యురాలేనన్నది చిన్నమ్మ వర్గీయుల వాదన. మరోవైపు టీటీవీ దినకరన్ మాత్రం అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పేరిట కొత్త పార్టీ పెట్టుకున్నారు.

కొత్త కార్డుల జారీ నేపథ్యంలో…..

అయితే అధికార పార్టీ అయిన అన్నాడీఎంకేలో కొత్త సభ్యత్వాలను ఇస్తున్నారు. పాత సభ్యత్వాల స్థానంలో కొత్త కార్డులను జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శశికళ విషయం ప్రస్తావనకు రావడం గమనార్హం. శశికళ ఇంకా పార్టీలోనే ఉన్నారని కొందరు, లేరని మరికొందరు అభిప్రాయపడటం విశేషం. శశికళ సభ్యత్వాన్ని రద్దు చేయకపోవడంతో ఆమె ఇంకా పార్టీ సభ్యురాలేనని కొందరు వాదిస్తున్నారు. కానీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునేందుకు శశికళ ప్రయత్నం చేయలేదని, అందుకని ఆమె సభ్యత్వం ఆటోమేటిక్ రద్దయినట్లేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

దినకరన్ ను మాత్రమే బహిష్కరించి…..

శశికళకు ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే ఆమె జైలుకు వెళ్లే సందర్భంగా తన మేనల్లుడు టీటీవీ దినకరన్ ను పార్టీ డిప్యూటీ సెక్రటరీగా, పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేశారు. జైలుకు వెళ్లిన అనంతరం కూడా పార్టీపై ఆమె పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. అయితే కమలనాధుల సహకారంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటి కావడంతో దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. శశికళను మాత్రం బహిష్కరించకుండా పక్కనపెట్టారు. పార్టీ, గుర్తుతో సహా పళనిస్వామి వర్గం దక్కించుకుంది.

ఆ…ముగ్గురిపై వేటు తప్పదా?

ఈ నేపథ్యంలో శశికళ సభ్యత్వం మరోసారి చర్చకు వచ్చింది. పార్టీలో ఆమె ఇక లేనట్లేనని పళనిస్వామి స్పష్టం చేశారు. కొత్తగా సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆమె సభ్యత్వం రద్దయిందని, శశికళకు, అన్నాడీఎంకేకు ఇక సంబంధం లేదని ఆయన తెలిపారు. మరోవైపు దినకరన్ కు సహకరిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేల వివరణను కోరామని, వారినుంచి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం మీద కొత్త సభ్యత్వాల జారీ నేపథ్యంలో శశికళ అప్లయ్ చేసుకోకపోవడాన్ని కారణంగా చూపి ఆమెను పార్టీ నుంచి తొలగించినట్లయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*