శశికళ సింగిల్ గానే వస్తారా….?

దిగ్గజాలు నడిపిన పార్టీని వారిరువురూ సక్రమంగా నడపలేకపోతున్నారు. ఎంజీఆర్, జయలలితల తర్వాత చరిష్మా ఉన్న నేత ఆ పార్టీకి కరువయ్యారు. అధికారాన్ని జయలలిత అప్పగించి వెళితే…. వీరు దాన్ని నిలబెట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల మధ్య విభేదాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పార్టీలో అయోమయం నెలకొంది. భవిష్యత్ అధినేత కోసం క్యాడర్ ఎదురుచూస్తోంది. దీనిని చిన్నమ్మ శశికళ క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. రెండాకుల గుర్తు, పార్టీని తిరిగి దక్కించుకోవడానికి జైలు నుంచే శశికళ పావులు కదుపుతున్నారు.

దినకరన్ ను బహిష్కరించినా…..

అక్రమ ఆస్తుల కేసులో పరప్పణ అగ్రహారం జైలుకు వెళతున్న శశికళ పార్టీ, ప్రభుత్వం తన గ్రిప్ లోనే ఉండాలని భావించి పార్టీని మేనల్లుడు దినకరన్ కు, ప్రభుత్వాన్ని పళనిస్వామికి అప్పగించి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం, పళని స్వామి ఇద్దరూ కలసి చిన్నమ్మ కుటుంబాన్ని బయటకు నెట్టారు. శశికళ సభ్యత్వాన్ని రద్దు చేయకుండా, టీటీవీ దినకరన్ ను మాత్రం పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో టీటీవీ దినకరన్ కొత్త పార్టీని స్థాపించారు.

లేఖ కలకలం…..

కానీ కొన్ని రోజులుగా పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య విభేదాలు ఎక్కువ కావడంతో చిన్నమ్మ జైలు నుంచే చక్రం తిప్పుతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక నిర్వహించాలంటూ ఇటీవల ఎన్నికల కమిషన్ కు జైలు నుంచే శశికళ లేఖ రాశారు. అన్నాడీఎంకేలో ఇప్పటికీ తన మద్దతు దారులు ఉన్నారన్నది శశికళ విశ్వాసం. జైలులో ఉన్నప్పటికీ తనను కలుస్తున్న కొందరు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి విషయంలో మద్దతు తెలుపుతారని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. దీంతో ఆమె జైలు నుంచే రంగంలోకి దిగేందుకు యత్నాలు ప్రారంభించారు.

పళని, పన్నీర్ ల మధ్య దాగుడుమూతలు…….

అన్నాడీఎంకేకు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి లేరు. జయలలిత మరణం తర్వాత టీటీవీ దినకరన్ ను డిప్యూటీ సెక్రటరీ గానే నియమించారు. సమన్యయ కర్తగా పన్నీర్ సెల్వం వ్యవహరిరస్తున్నారు. డిప్యూటీ కో ఆర్డినేటర్ గా ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక ఎప్పుడు జరిగినా తాము ఎన్నికవ్వాలన్ని పన్నీర్, పళనిలు ఇద్దరూప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ఇటీవల సభ్యత్వ కార్డులు కొత్తవి జారీ చేశారు. అయితే శశికళ మాత్రం పన్నీర్, పళనిల మధ్య ఉన్న విభేదాలు తనకు కలసి వస్తాయని, తాను జైలులో ఉన్నప్పటికీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికవుతానని ఆశాభావంతో ఉన్నారు. దీనికితోడు ఇటీవల మంత్రి సెల్లూరు రాజు చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. అన్నాడీఎంకే పగ్గాలు ఒక మహిళ చేతికి వెళతాయని మంత్రి సెల్లూరు రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*