శశికళకు యాంటీగా సిగ్నల్స్…..?

శశికళ రీ ఎంట్రీ అవుతున్నారన్న వార్తలతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వం ఒక్కటిగా ఉన్నామని సంకేతాలు పంపుతున్నారు. మంత్రి సెల్లూరు రాజు చేసిన ప్రకటన రెండు వర్గాల్లోనూ కలకలం రేపింది. రానున్న రోజుల్లో అన్నాడీఎంకేకు మహిళ పగ్గాలు చేపట్టనున్నారని మంత్రి సెల్లూరు రాజు చేసిన వ్యాఖ్యలను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధ్యక్షుడు, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సమర్థించారు. అమ్మ జయలలిత ఆశయాలను నెరవేర్చేందుకే మహిళకు త్వరలోనే అన్నాడీఎంకే పగ్గాలు అందుతాయని దినకరన్ చేసిన వ్యాఖ్యలను పన్నీర్, పళనిలు సీరియస్ గానే తీసుకున్నారు.

విభేదాలు పక్కన పెట్టి……

ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పన్నీర్ సెల్వం కొద్దికాలం క్రితం టీటీవీ దినకరన్ కూడా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుర్చీకి పన్నీర్ ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించిన పళనిస్వామి సయితం అప్రమత్తమయ్యారు. ఈ విషయాలన్నీ బీజేపీ అగ్రనేతలకు కూడా వివరించినట్లు తెలుస్తోంది. శశికళ కూడా జైలు నుంచే తన ఎంట్రీకి పావులు కదుపుతుండటంతో రెండు వర్గాలకూ కొంత ఇబ్బందిగానే మారింది.

ఆమె వస్తే ఇద్దరికీ…..

శశికళకు, పన్నీర్ సెల్వానికి అస్సలు పొసగదు. అమ్మ బతికి ఉన్నప్పుడు పన్నీర్ సెల్వానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే జయలలిత మరణం తర్వాత శశికళ పార్టీ పగ్గాలను చేపట్టారు. ఆ తర్వాత శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ గళమెత్తారు. వేరుకుంపటి పెట్టేసుకున్నారు. పన్నీర్ సెల్వాన్ని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే తనకు అనుకూలంగా ఉంటారనుకున్న పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసి మరీ జైలు కు వెళ్లిపోయారు. ఈ పరిణామాల క్రమంలో పన్నీర్, పళనిస్వామిలు ఒక్కటయి శశికళ కుటుంబాన్ని పార్టీ కార్యాలయం ఛాయలకు రాకుండా అడ్డుకోగలిగారు.

మళ్లీ రీ యాక్టివ్ కావడంతో…….

శశికళ మళ్లీ రీయాక్టివ్ కావడంతో ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నట్లుంది. శశికళ తిరిగి పార్టీ లోకి వస్తే పళని, పన్నీర్ లకు ఇబ్బందులు తప్పవన్నది అందరికీ తెలిసిందే. అందుకే ముందుజాగ్రత్తగా క్యాడర్ లో అనుమానాలను నివృత్తి చేసేందుకు తామిద్దరం ఒక్కటేనన్న సంకేతాలు ఇచ్చారు. అన్నాడీఎంకే 47వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పన్నీర్, పళనిస్వామిలు ఇద్దరూ పాల్గొని కార్యకర్తల ముందు చిరునవ్వులు చిందించారు. తామిద్దరం ఐక్యంగానే ఉన్నామని, శశికళకు ఛాన్స్ లేదన్న సిగ్నల్స్ బలంగా పంపగలిగారు. మరి ఈ ఐక్యత ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*