శశికళ…పేరు వింటేనే ఉలిక్కిపడుతున్నారే…..?

అన్నాడీఎంకేలో కోవర్టులెవరు? ప్రభుత్వ, పార్టీ సమాచారాన్ని ప్రత్యర్థులకు అందజేస్తున్నదెవరు? ఈ ప్రశ్నలకు అన్నాడీఎంకే అధినేతలకు సమాధానం దొరకడం లేదు. పార్టీ పరంగానూ, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ముందుగానే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో పాటు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ లకు శరవేగంగా అందుతుండటాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు జీర్ణించుకోలేక పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పార్టీని, ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీరు సిద్ధమయ్యారు.

పార్టీలో ఇంకా చిన్నమ్మ……

అన్నాడీఎంకే తమ ఆధీనంలోకి తెచ్చుకుని దాదాపు ఏడాది పైగానే గడిచిపోయింది. పన్నీర్ సెల్వం పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల సమయంలో పార్టీలోని నేతలే కీలక పాత్ర పోషించనున్నారు. శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలోని కొందరు నేతలు ఆమె వర్గంలోకి చేరిపోయే అవకాశం ఉందని పన్నీర్, పళనిలు గట్టిగా అనుమానిస్తున్నారు. నిఘా వర్గాలు అందించిన నివేదికలు కూడా ఇవే స్పష్టం చేస్తున్నాయి.

రిసార్ట్స్ లోగుట్టును…..

దీంతోపాటు ఇప్పటికే రిసార్ట్ రాజకీయం గుట్టు విప్పుతానంటూ ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన తిరువట్టానై ఎమ్మెల్యే కరుణాన్ చేసిన ప్రకటన పార్టీలో సంచలనం కలిగించింది. జయమరణం తర్వాత గోల్డెన్ బే రిసార్ట్స్ లో కుదిరిన బేరసారాలన్నింటినీ ఈయన బయటపెడతానంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కరుణాన్ ముఖ్యమంత్రి పళనిస్వామి పై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన న్యాయమూర్తి ఎదుటే రిసార్ట్ట్స్ గుట్టు విప్పుతానంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో కరుణాన్ ను బుజ్జగించే కార్యక్రమం ప్రారంభమయింది. ఎవరు ఎప్పుడు ఎదురుతిరుగుతారో తెలియని పరిస్థితుల్లో అధికార పార్టీ ఉంది.

చెక్ పెట్టేందుకు……

దీంతో పార్టీపై భవిష్యత్తులో తమ పట్టు సడలకుండా, శశికళ వర్గానిది పై చేయి కాకుండా ఉండేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు సభ్యత్వాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో వడపోత కార్యక్రమం ఉంటుందని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. శశికళ, దినకరన్ మద్దతు దారులను పూర్తిగా తొలిగించేందుకే ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. సభ్యులందరికీ కొత్త కార్డులు ఇచ్చి తమకు నమ్మకమైన వ్యక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం మీద అధికార అన్నాడీఎంకేలో కోవర్టుల కలకలం రేగుతోంది. శశికళ భయం వారిని వెన్నాడుతూనే ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*