అత్తకు ప్రేమతో…?

అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అక్కడి నుంచే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు మూడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శశికళ జైలుకు వెళ్లి ఏడాదిపైగానే అయింది. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించారు. తనను బయటకు నెట్టి పార్టీని, ప్రభుత్వాన్ని వశం చేసుకున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంపై కసి తీర్చుకోవాలనుకుంటున్నారు. తాను నమ్మిన పళనిస్వామి మోసం చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆమె మేనల్లుడు దినకరనర్ దీనికి సమర్ధుడని భావించి, తన పంతాన్ని నెగ్గించేది టీటీవీ అని భావించి కొత్త పార్టీ పెట్టేందుకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పదిహేను రోజులకొకసారి…..

దినకరన్ ప్రతి పదిహేను రోజులకొకసారి శశికళను జైలులో కలసి పార్టీ పరిస్థితిని వివరిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలున్నా అక్కడకు రప్పించుకుని మరీ వాటిని పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా దినకరన్ పార్టీకి ఆర్థికంగా సాయం చేయాలని కొందరు కుటుంబ సభ్యులకు సూచనలు కూడా చేస్తున్నారు. తాను జైలు నుంచి వచ్చే వరకూ దినకరన్ మాత్రమే పార్టీని నడుపుతారని ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అప్పటి వరకూ దినకరన్ ను ఎవరూ డిస్ట్రబ్ చేయవద్దని కోరారు. మరో రెండేళ్ల తర్వాత అంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి చిన్నమ్మ జైలు నుంచి విడదలయ్యే అవకాశముంది.

పార్టీని పటిష్టం చేసేందుకు……

ఈ నేపథ్యంలో దినకరన్ తమిళనాడులో క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు అహర్నిశలూ పనిచేస్తున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే ని స్వాధీనం చేసుకున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు క్యాడర్ ను నిలబెట్టుకోలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ సభ్యత్వం కూడా అన్నాడీఎంకేలో తగ్గిపోతోంది. అలాగే డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికైన స్టాలిన్ ఒక్కరే తనకు ప్రధాన ప్రత్యర్థి అని దినకరన్ వర్గం భావిస్తోంది. త్వరలో జరిగే రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలిపి విజయం సాధించి పళని వర్గానికి తామేమిటో చెబుతామని దినకరన్ వర్గం అంటోంది.

చిన్నమ్మకు కానుక……

దినకరన్ ఎప్పటికప్పుడు జైలులో ఉన్న శశికళ సలహాలు తీసుకుంటూ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళుతున్నారు. దినకరన్ పెట్టిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని ప్రజల్లోకి ఇప్పటికే తీసుకెళ్లారు. దాదాపు కోటి సభ్యులను పార్టీలో చేరినట్లు ఆపార్టీ నేతలు అధికారికంగా ప్రకటించడం విశేషం. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో విజయదుందిభి మోగించిన దినకరన్ తర్వాత ఈ ఉప ఎన్నికలపై దృష్టి సారించారు. వీటిలో ఒక్కటైనా గెలిచిన మేనత్త శశికళకు కానుక ఇవ్వాలని దినకరన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించిన దినకరన్ త్వరలోనే ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరి శశికళ జైలు నుంచి బయటకు వచ్చేసరికి పార్టీని పకడ్బందీగా, పటిష్టంగా తయారు చేసే పనిలో ఉన్నారు దినకరన్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*