చిన్నమ్మ…స్కెచ్ తో సెటిల్ అయిపోవడమేనా?

పన్నీర్ సెల్వం పని అయిపోయింది. పళనిస్వామి పనికి రాడంటున్నారు. జయలలిత లేని అన్నాడీఎంకేను ప్రజలు ఆదరించే ప్రసక్తి లేదంటున్నారు అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం నేత టీటీవీ దినకరన్. వచ్చే ఎన్నికల్లో టీటీవీ దినకరన్ పార్టీ పొత్తు పెట్టుకునైనా అన్నాడీఎంకే ను ఓడించాలన్న కసితో ఉంది. ఈ మేరకు చర్చలు కూడా ప్రారంభమయినట్లు చెబుతున్నారు. అన్నాడీఎంకే నుంచి శశికళ, టీటీవీ దినకరన్ ను బహిష్కరించడంతో కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పెట్టిన ప్రెషర్ కుక్కర్ గుర్తునే టీటీవీ వచ్చే ఎన్నికల్లో వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాయనున్నారు.

చిన్నమ్మతో మంతనాల తర్వాత…..

మన్నార్ గుడి మాఫీయాగా పేరొందిన శశికళ కుటుంబం కొత్త పార్టీతో ప్రజల ముందుకు వెళ్లనుంది. జయ మరణం తర్వాత తమను అకారణంగా పార్టీ నుంచి గెంటేసిన పన్నీర్ సెల్వం, పళనిస్వామిలపై ప్రతీకారం తీర్చుకునేందుకు రగలిపోతోంది. ఈమేరకు ఇటీవల బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళను దినకరన్ కలసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించినట్లు తెలిసింది. ఈ నెల 27వ తేదీ తర్వాత 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీర్పు వచ్చే అవకాశముందని, పళని ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, లోక్ సభ ఎన్నికలతో పాటే శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశముందని దినకరన్ చిన్నమ్మకు వివరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. చిన్నమ్మ స్కెచ్ ప్రకారమే దినకరన్ ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు.

కూటమి ఏర్పాటుకు…..

శశికళ సూచన మేరకే టీటీవీ దినకరన్ కూటమి ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అవసరమైతే డీఎంకే, కాంగ్రెస్ లతో కలసి పోటీ చేయాలని కూడా దినకరన్ భావిస్తున్నారు. తన టార్గెట్ అంతా పళని, పన్నీర్ లే కావడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయం నాటికి కమల్ హాసన్, రజనీకాంత్ పార్టీలు కూడా రంగంలో ఉంటుండటంతో వాటి ముందు తమ పార్టీ తట్టుకోలేదని భావించిన టీటీవీ డీఎంకేతో పొత్తుకైనా సిద్ధమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన అంశంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే….డీఎంకేకు మద్దతివ్వాలని ఆలోచిస్తున్నట్లు కూడా టీటీవీ తన సన్నిహితులకు చెబుతుండటం విశేషం.

డీఎంకేతో కలిసేందుకు…….

అయితే డీఎంకే అధినేత కరుణానిధి, జయలలిత బద్ధవిరోధులు. వారితో చేతులు కలిపే ఆలోచనపై దినకరన్ పార్టీలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారు.కాని బీజేపీ, అన్నాడీఎంకే, రజనీకాంత్ పార్టీలు ఒక్కటయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినకరన్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేతలకు నచ్చ చెబుతున్నారట. డీఎంకే కూడా అంగ, అర్థ బలం ఉన్న మన్నార్ గుడి మాఫియా అండ అవసరమని భావిస్తుంది. బీజేపీని ఓడించేందుకు అవసరమైతే దినకరన్ పార్టీతో చేతులు కలుపుతామని కూడా డీఎంకే వర్కింగ్ స్టాలిన్ సన్నిహితులతో వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం మీద తమిళనాట వచ్చే ఎన్నికల నాటికి ఆశ్చర్యకరమైన…ఊహించని విధంగా కూటములు ఏర్పడనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*