వైసీపీలోకి సీనియర్ నేత వారసురాలు…!!

senior leader daughter in ysrcp

ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభం అవ్వడంతో కప్పల తక్కెడలు జోరందుకుంటున్నాయి. తాజాగా టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రస్తుతం తాము ఉన్న పార్టీలో ప్ర‌యార్టీ లేదని భావిస్తున్న వారు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాలో ఓ రాజకీయ వారసురాలు ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం రెడీ అయినట్టు తెలుస్తోంది. ఆ రాజకీయ వారసురాలు ఎవరో కాదు దివంగ‌త మాజీ మంత్రి, కాకలు తీరిన రాజకీయ యోధుడు కోటగిరి విద్యాధరరావు కుమార్తె పొన్నాల అనిత. కొటగిరి విద్యాధరరావు రాజకీయ వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన పొన్నాల అనిత గత సాధారణ ఎన్నికలకు ముందు నుంచి క్రియాశీలక రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నారు.

కొంతకాలం సైలెంట్ గా ఉండి…..

అనిత కోటగిరి స్వగ్రామం అయిన తూర్పు యడవెల్లి సర్పంచ్‌గా పని చేశారు. ఆమె రాజకీయంగా సర్పంచ్‌గా మాత్రమే పని చేసినా నియోజకవర్గ, జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో తన తండ్రికి ఎంతో మంది సన్నిహితులతో ఉన్న విస్తృత పరిచయాలు పెంచుకుని స్టేట్‌ వైడ్‌గా హైలెట్‌ అయ్యారు. తండ్రి మరణాంతరం గత సాధారణ ఎన్నికలకు ముందు సోదరుడుతోకలిసి బీజేపీలో చేరిన అనిత గత ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతుగా కృషి చేశారు. మొదటిలో ఆమె బీజేపీలో ఉన్నా టీడీపీ ముఖ్య నేతలతో స‌త్సంబంధాలు కొనసాగిస్తూ పార్టీలకు అతీతంగా తన వద్దకు వచ్చే వారికి పనులు చేసిపెట్టారు. పార్టీలకు అతీతంగా అనితను అందరూ అభిమానించేవారు. ఆ తర్వాత సోదరుడు కోటగిరి శ్రీధర్‌ వైసీపీలో చేరడం ఏలూరు పార్లమెంట‌రీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండడంతో అనిత రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ, టీడీపీ బంధం బ్రేకప్‌ కావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో ఉన్నా అనితకు రాజకీయంగా దక్కే ప్రాధన్యం లేదు, ఆమెకు రాజకీయంగా భవిష్యత్తు కనుచూపు మేరలో కూడా లేదు.

సంక్రాంతి తర్వాత…..

ఈ క్రమంలోనే సోదరుడు వైసీపీలో ఉండడంతో తాను కూడా వైసీపీలో చేరితే తమను నమ్ముకున్న కేడర్‌కు వెన్నుదన్నుగా ఉండడం, న్యాయం చెయ్యడం జరుగుతుందని భావించిన ఆమె వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చింతలపూడి నియోజకవర్గ స్థాయిలో గతంలో నామినేటెడ్‌ పదవి నిర్వహించి మెట్టలో వైసీపీలో క్రియాశీలకంగా ఉంటున్న ఓ వ్యక్తితో పాటు, వైసీపీకి చెందిన కీలక నేతల మధ్య‌వర్తిత్వంతో అనిత వైసీపీలో చేరేందుకు సుముఖ‌త వ్యక్తం చేసినట్టు టాక్‌. వచ్చే సంక్రాంతి తర్వాత అనిత పార్టీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్నారట. ఏదేమైన కోటగిరి రాజకీయ వారసురాలుగా ఉన్న అనిత వైసీపీలోకి చేరితే చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మరో విధంగా మారడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*