ఆ సీనియర్ నేత వైసీపీలోకి గ్యారంటీ….?

మోదుగుల వేణుగోపాల రెడ్డి. గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన నాయ‌కుడు. టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఆయ‌న వ్యవ‌హార శైలి మ‌ళ్లీ వివాదాస్పద‌మైంది. వాస్తవానికి ఎంపీగా పోటీ చేయాల‌ని భావించిన ఆయ న‌కు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. పైగా జ‌గ‌న్‌తోనూ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు త‌న‌ను తొక్కేశార‌నేది మోదుగుల ఆవేద‌న‌. కానీ, అప్పటి రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాయ‌పాటికి కేటాయించే నిమిత్తం న‌ర‌స‌రావు పేట ఎంపీ సీటును మోదుగుల‌కు కేటాయించ‌లేదు. కానీ, ఉద్దేశ పూర్వకంగానే త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చార‌ని మోదుగుల ఆవేద‌న‌.

సీనియారిటీని కూడా చూడకుండా…..

స‌రే! ఇస్తే ఇచ్చారు. క‌నీసం త‌న సీనియార్టీని గ‌మ‌నించి.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ఆయ‌న భావించారు. కానీ, అనూ హ్యంగా చంద్ర‌బాబు మోదుగుల‌ను అస్సలు ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయ‌న అంటీ ముట్టన‌ట్టుగానే వ్యవ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు, అవ‌కాశం వ‌చ్చిన ప్రతిసారీ.. చంద్రబాబు ప్రభుత్వంపై విమ‌ర్శల సైతం గుప్పిస్తున్నారు. గ‌తంలో కూడా అంగ‌న్ వాడీ కేంద్రాలు మూసేయ‌డం మంచిది.. ఈ ప్రభుత్వం వాటిని నిర్వహించ‌లేదు! అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న అసెంబ్లీని వేదిక‌గా చేసుకుని మ‌రోసారి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. .స‌భ‌లో ప్రతిప‌క్షం లేని నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కులే ప్రతిప‌క్షం పాత్ర పోషించాల‌న్న చంద్రబాబు మాట‌ల‌ను ఆయ‌న స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో.. ప్రతిప‌క్షాన్ని మించిపోయి ప్రశ్నలు గుప్పించారు.

ప్రశ్నలతో ప్రభుత్వాన్ని……

ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠ‌శాలలు తిండి తిన‌డానికి త‌ప్ప దేనికీ ప్రయోజ‌నం లేద‌ని మోదుగుల మండిప‌డ్డారు. ఒక్క అక్షరం ముక్క కూడా విద్యార్థుల‌కు రావ‌డం లేద‌ని, పాఠ‌శాల‌ల నిర్వహ‌ణ ఇలా ఉంటే ప్రక‌ట‌న‌లు మాత్రం కోట్లకు కోట్లు ఖ‌ర్చు భారీ స్థాయిలో ఇస్తున్నార‌ని అన్నారు. దీంతో ఈ విష‌యంపై తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. ప్రభుత్వ లోపాల‌ను ఎత్తి చూపాల‌ని తాను కోరాన‌ని, కానీ, ప్రభుత్వం డిఫెన్స్ లో ప‌డిపోయేలా మోదుగుల మాట్లాడ‌డం స‌రికాద‌ని.. స‌భ అనంత‌రం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయ‌న వ్యవ‌హార శైలి ఉద్దేశ పూర్వకంగానే ఉంద‌ని అన్నారు. మొత్తానికి ఈ ప‌రిణామం, మోదుగుల ప్రశ్నించిన తీరు వంటి వాటిపై టీడీపీ సీనియ‌ర్ల మ‌ధ్య సైతం చ‌ర్చ జ‌రిగింది. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని నిర్ణయించిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

వెస్ట్ నుంచి తప్పించి……

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదుగుల‌ను ఆయ‌న ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గుంటూరు వెస్ట్ నుంచి కూడా త‌ప్పించేస్తార‌న్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయ‌న్ను మాచ‌ర్లకు పంపేస్తార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈ వార్తలు నిజ‌మ‌నే టాక్ బ‌లంగా ఉండ‌డంతో కూడా మోదుగుల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న వైసీపీలోకి అయినా వెళ్లిపోతార‌ని వార్తలు వ‌స్తున్నాయి. వీటికి ఊత‌మిచ్చేలాగానే ఆయ‌న ప్రభుత్వంపై త‌ర‌చూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.