నువ్వు వస్తానంటే…నేను వద్దంటానా?

2014 ఎన్నికలు జగన్ కు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. తనవారెవరు? పరాయి ఎవరు? అన్నది తేలడమే కాకుండా ఎలక్షనీరింగ్ లో తాను చేసిన పొరపాట్లను వైసీపీ అధినేతకు తెలిసి వచ్చింది. టిక్కెట్లు బంధుగణం, సీనియర్ నేతలు చెప్పినట్లు ఇవ్వడం, ఇతర పార్టీల నుంచి వస్తానన్న నేతలను పార్టీలోకి రానివ్వక పోవడం తనను గత ఎన్నికల్లో అధికారానికి రాకుండా అడ్డుపడ్డాయన్న వాస్తవ విషయాన్ని జగన్ గుర్తించారు. అందుకోసమే 2019 ఎన్నికల్లో ఇటువంటి పొరపాట్లు పునరావృత్తం కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

గత ఎన్నికల సమయంలో…..

గత ఎన్నికల సమయంలో అనేక మంది నేతలు వైసీపీ తలుపులు తట్టారు. అందులో గంటా శ్రీనివాసరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు పార్టీలోకి వస్తామన్నా చేర్చుకోలేదు. దీంతో అనేక మంది టీడీపీ వైపు వెళ్లిపోయారు. దీంతో వారి వ్యక్తిగత ప్రాబల్యం కూడా టీడీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందని జగన్ గుర్తించారు. అందుకోసమే ఈసారి సీనియర్ నేతలను ఏ పార్టీ నుంచి వచ్చినా గేట్లు తెరిచే ఉంచాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది నేతలు ఫ్యాన్ పార్టీ వైపు వచ్చేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.

సీనియర్ నేతలతో సంప్రదింపులు…..

ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీనియర్ నేతలు జగన్ పార్టీలోకి వచ్చేందుకు సుముఖత చూపుతున్నారు. కొందరు నేతలు నేరుగా జగన్ తో మాట్లాడగా, మరికొందరు సీనియర్ నేతలను సంప్రదిస్తున్నారు. అయితే పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మాన ప్రసాదరావులాంటి నేతలకు ఈ బాధ్యతను జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఉన్న సీట్లకు ఇబ్బంది కలగకుండా ఉండేలా పార్టీలో చేరికలు ఉండేలా చూడాలని జగన్ వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీలోకి వచ్చిన వారు గెలుపు గుర్రాలయితే ఖచ్చితంగా టిక్కెట్ ఖాయమన్న సందేశాన్ని కూడా జగన్ పంపారు.

మరింత బలపడేందుకే….

ఈ నేపథ్యంలోనే కన్నా లక్ష్మీనారాయణ వంటినేతలు పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చారంటున్నారు. కొందరు నాయకుల రాకతో పార్టీ మరింత బలపడుతుందనుకుంటే ఉన్నవారికి నచ్చచెప్పి మరీ వారిని చేర్చుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరిలో ప్రవేశించకముందే మరిన్ని చేరికలు ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా నినాదంలో ముందుండటం, తన పాదయాత్రతో పాటు సీనియర్లు కలసి వస్తే పార్టీకి మరింత బలం పెరుగుతందని జగన్ భావిస్తున్నారు. త్వరలోనే పార్టీలో కొందరు సీనియర్ల చేరికలు ఉంటాయని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*