ఆ సీనియర్ ఎమ్మెల్యే కుమిలి…కుమిలి…!

గుంటూరు జిల్లాలో కీల‌క నాయ‌కుడు, టీడీపీకి అంకిత భావంతో సేవ‌లు చేస్తున్న నేత‌. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర. ఆయ‌న త‌న తండ్రి ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి కాలం నుంచి రాజ‌కీయాలను అందిపుచ్చుకున్నారు. తొలినాళ్లలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. రానురాను ప్రజ‌లు ఆయ‌న‌ను విశ్వసించేలా చేసుకున్నారు. అందుకే ఆయ‌నకు పొన్నూరులో తిరుగు లేకుండా పోయింది. పొన్నూరుఅంటే న‌రేంద్ర, న‌రేంద్ర అంటే పొన్నూరు.. అనే రేంజ్‌లో ఇక్కడ రాజ‌కీయాలు మారిపోయాయి. టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌లా సాగిపోతోంది.

వరుసగా ఐదుసార్లు…..

1994 నుంచి 1999, 2004, 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఐదుసార్లు గెలుస్తూ వ‌స్తున్నారు. అయితే, ఇప్పుడు ఆయ‌నకు ప‌ట్టుకున్న వ్యథ త‌న‌కు గుర్తింపు లేకుండా పోవ‌డ‌మే! ఇటీవ‌ల ఆయ‌న‌కు చంద్రబాబు నుంచి ఓ వ‌ర్తమానం అందిన‌ట్టు ప్రచారం సాగింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంటామ‌ని, మీకు ప్రాధాన్యం ఉంటుంద‌ని ఆ వ‌ర్తమానం సారాంశం. అయితే, ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్యలూ ముందుకు సాగ‌లేదు. నిజానికి ఈ వ‌ర్తమానం.. ధూళిపాళ్లలో ఆశ‌లు చిగురించేలా చేసింది. తాను ఎన్నాళ్లుగానో క‌ల‌లు గంటున్న మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆయ‌న ఆశించారు.

మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా?

ఎన్నిక‌ల‌కు ఇంకా 9-10 నెల‌ల స‌మ‌యం మాత్రమే ఉన్న నేప‌థ్యంలో చంద్రబాబు మ‌రోసారి మంత్రివ‌ర్గాన్ని విస్తరిస్తార‌ని, త‌న‌కు ఛాన్స్ ఇస్తార‌ని ఆయ‌న భావించారు. అయితే, ఇప్పటి వ‌ర‌కు ఇలాంటి చ‌ర్యలు అమ‌రావ‌తిలో ఎక్కడా క‌నిపించ‌డంలేదు. పైగా.. వ‌చ్చే ఏడాది జ‌రుగుతాయ‌ని భావిస్తున్న ఎన్నిక‌లు ముందుగానే జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. నేరుగా చంద్రబాబే ఈ విష‌యాన్ని తాజాగా వెల్లడించ‌డం రాజ‌కీయంగా చ‌ర్చకు దారితీసింది. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది డిసెంబ‌రులోనే ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో ఇప్పుడు ధూళిపాళ్ల మళ్లీ ఆలోచ‌న‌లో ప‌డిపోయారు. ఇంత‌కీ త‌న‌కు అవ‌కాశం వ‌స్తుందా? రాదా? అన్నది ఆయ‌న తాజా దిగులు!

అనుచరులతో సమావేశం…..

చంద్రబాబు త‌లుచుకుంటే ఇప్పటికిప్పుడు త‌న‌ను గుర్తించే అవ‌కాశం ఉంటుంద‌ని, అయితే, ఆయ‌న త‌లుచుకోవ‌డం లేద‌ని, తానేం త‌ప్పులు చేశాన‌ని చెప్పుకొస్తున్నారు. రెండు రోజుల కింద‌ట పొన్నూరులో ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా మ‌ళ్లీ త‌న జీవిత కాలాన్ని పున‌శ్చర‌ణ చేసుకున్నారు. తాను ఏదైనా త‌ప్పులు చేసి ఉంటే హెచ్చరించి స‌రిచేసే అవ‌కాశం చంద్రబాబుకు ఉంద‌ని, కానీ, ఆయ‌న అలా చేయ‌కుండా త‌న రాజ‌కీయ భ‌విష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నార‌ని న‌రేంద్ర వాపోయారు. గ‌తంలో ఆయ‌న మంత్రి ప‌ద‌వి ద‌క్కనందుకు అమ‌రావ‌తిలోనే క‌న్నీటి ప‌ర్యంతం అయిన విష‌యం తెలిసిందే. మ‌రి ఇప్పటికైనా బాబు ఆయ‌న‌కు గుర్తింపు ఇస్తారో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*