ఠాక్రే కరెక్ట్ గానే ట్రిగ్గర్ నొక్కారే….!

ఠాక్రే కరెక్ట్ గానే ట్రిగ్గర్ నొక్కారు. ఎక్కడ తగలాలో అక్కడే బుల్లెట్ తగిలింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రెండు నెలల ముందు ప్రకటించిన నిర్ణయం ఆ పార్టీకి సానుకూల అంశంగా చెబుతున్నారు. 2019లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అదే ఏడాది లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఠాక్రే సంకేతాలు ఇచ్చారు. శివసైనికుల చేత పదే పదే చెప్పించారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను కూడా తమ అనుచరగణం చేత తూర్పార పట్టించారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో బీజేపీ పాలనను ఎప్పటికప్పుడు దుయ్యబట్టారు. రాహుల్ ను పొగిడారు. మోడీని తిట్టారు. బీజేపీతో కటీఫ్ ఇక ఎంతో దూరం లేదని సిగ్నల్స్ ఇచ్చేశారు. అందరూ నిజమేననుకున్నారు.

చిరకాల వాంఛను…..

కాని శివసేన అధినేత ఠాక్రే ఆలోచన 2019 అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందట. ఆయన చిరకాల వాంఛ శివసైనికుడు మహారాష్ట్రను పాలించడం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ఉండాలన్నదే ఉద్ధవ్ లక్ష్యం. అందుకే ముందస్తుగా బీజేపీని కట్టడి చేయడానికి ఈ ప్లాన్ ను ఉద్ధవ్ అమలు చేశారంటున్నారు విశ్లేషకులు. ఉద్ధవ్ ఠాక్రే ప్లాన్ తో దెబ్బకు బీజేపీ దిగి వచ్చింది. ఆయన ఇంటికి వెళ్లి మరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో విడిపోయి పోటీ చేస్తే ఇద్దరికీ నష్టమన్నది ఠాక్రే కు తెలియంది కాదు. అలాగని బీజేపీకి తలొగ్గి పనిచేయడం, వారి ఆజ్ఞలను పాటించడం వంటివి ఠాక్రేకు అస్సలు గిట్టవు. అందుకే అమిత్ షాతో జరిగిన సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ను దూరంగా ఉంచి సీఎం కంటే తానే గొప్ప అని చెప్పకనే చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా…..

అసలు ఉద్ధవ్ లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే. అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీపై పైచేయి సాధించాలన్నది ఠాక్రే లక్ష్యం. అందుకే బీజేపీకి లోక్ సభ లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకుండా ఉంటే కమలదళాన్ని కట్టేయవచ్చన్నది ఆయన వ్యూహం. అందుకోసం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవాలంటే తాము అడిగిన సీట్లు ఇవ్వాలన్నది ఆయన ప్రధాన డిమాండ్ గా ఉండబోతోంది. లోక్ సభ ఎన్నికలే కాదు…రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సయితం శివసేనకు ఎక్కువ స్థానాలు ఇస్తేనే చేయి కలుపుతామన్నది ఠాక్రే షరతుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ముందు లోక్ సభ ఎన్నికల నుంచి బయటపడటం ముఖ్యం. అందుకోసం ఠాక్రే డిమాండ్లకు తలొగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

అత్యధిక స్థానాలను…..

మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలున్నాయి. ఇందులో తమకు అత్యధికంగా 152 స్థానాలను కావాలని కోరే అవకాశముంది. అలాగే బీజేపీని 136 స్థానాల్లోనే పోటీ చేసేందుకు పరిమితం చేయాలని శివసేన భావిస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా ఈసారి దక్కించుకోవాలనుకుంటున్న ఠాక్రే ముందస్తు వ్యూహం వర్క్ అవుట్ అవుతున్నట్లే కన్పిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు మహారాష్ట్రలో సాధించాలంటే శివసేనతో స్నేహం తప్పనిసరి శివసేన చెబుతోంది. అలాగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే ప్రణబ్ దాదాకు ప్రధాని మంత్రి అభ్యర్ధిగా మద్దతివ్వాలన్నది కూడా శివసేన ఆలోచన. మొత్తం మీద ఠాక్రే ఆలోచనలు కార్యరూపం దాలిస్తే శివసేనదే మహారాష్ట్రలో పైచేయి కాకతప్పదంటున్నారు విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*