సిద్ధ‌రామ‌య్య‌.. హిస్టరీని తిర‌గ‌రాస్తారా..!

క‌న్న‌డ‌పోరు చివ‌రి అంకానికి వ‌చ్చింది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యమే ఉంది. గెలుపుపై ఎవ‌రికివారు ధీమాగా ఉన్నారు. గురువారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్ త‌దితర పార్టీలు పోటీ ప‌డుతున్నా.. ప్ర‌ధానంగా కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య‌నే హోరాహోరీ పోరు ఉంటుంద‌ని ప‌లు ప్రీపోల్ స‌ర్వేలు చెబుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా ఇదే విష‌యాన్ని బ‌ల‌ప‌రుస్తున్నారు. అయితే ఇక్క‌డు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే… 1985 త‌ర్వాత క‌ర్ణాట‌క‌లో ఏ ముఖ్య‌మంత్రి కూడా వ‌రుస‌గా రెండోసారి అధికారాన్ని చేప‌ట్ట‌లేదు. అయితే తాను ఆ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌బోతున్నాన‌ని కాంగ్రెస్ నేత‌, సీఎం సిద్ధ‌రామ‌య్య ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. తానే మ‌ళ్లీ సీఎం అవుతాన‌ని గ‌ట్టిగా చెబుతున్నారు.

సిద్ధూ పట్ల సానుకూలతే…

నిజానికి గ‌త ప్ర‌భుత్వాల‌తో పోల్చితే.. సిద్ధ‌రామ‌య్య పాల‌న‌పై ప్ర‌జ‌లు కొంత‌మేర‌కు సంతృప్తిగానే ఉన్న‌ట్లు నెల‌రోజుల ముందు నిర్వ‌హించిన ప‌లు ప్రీపోల్ స‌ర్వేలు చెప్పాయి. మ‌ళ్లీ సిద్ధ‌రామ‌య్యే సీఎం అవుతార‌ని, అధిక‌శాతం మంది క‌న్న‌డిగులు సిద్దుకే జైకొడుతున్నార‌ని ఆ స‌ర్వేలు చెప్పాయి. అయితే ఆత‌ర్వాత ప‌లు సంస్థలు నిర్వ‌హించిన ఒపీనియ‌న్ పోల్ స‌ర్వేలు ఏ పార్టీకి మెజారిటీ రాద‌నీ చెప్పినా.. సిద్ధ‌రామ‌య్య విష‌యంలో మాత్రం ఎక్క‌డ కూడా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ త‌గ్గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సిద్దు ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లాయ‌నీ ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు.

యడ్డీ ఉండటమే కలిసొచ్చే అంశమా?

అంతేగాకుండా… బీజేపీ సీఎం అభ్య‌ర్థి య‌డ్యూర‌ప్ప కావ‌డం సిద్దుకు మ‌రింత క‌లిసొచ్చే అంశ‌మ‌ని వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న‌బీజేపీ ఈసారి ఎక్కువ‌గా అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న నేత‌ల‌కే టికెట్లు కేటాయించ‌డంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సీఎం సిద్ధ‌రామ‌య్య కాంగ్రెస్‌పార్టీ సంప్ర‌దాయానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొద‌టి నుంచి ఎక్క‌డ‌కూడా బీజేపీ, జేడీఎస్‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంకుగా చెప్పుకునే లింగాయ‌త్‌ల‌ను ప్ర‌త్యేక మైనారిటీ హోదా క‌ల్పిస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. దీంతో ఆయ‌న‌కు లింగాయ‌త్‌ల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది.

రాహుల్ ప్రచారం కూడా….

ఇక్క‌డే బీజేపీకి దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చారు సీఎం సిద్దు. అంతేగాకుండా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ఈసారి ఎంతో చురుగ్గా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఇక బీజేపీ మాత్రం చెప్పేదానికి చేసేదానికి పొంత‌న లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా కాంగ్రెస్‌కు బాగా క‌లిసొచ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. చివ‌ర‌గా… బాదామి నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను ఎలాగైనా ఓడించాల‌ని చూస్తున్న బీజేపీపై సిద్దు పేల్చిన లంచం బాంబు క‌ల‌క‌లం రేపుతోంది.

గాలి వీడియోతో….

గ‌నుల త‌వ్వ‌కాల కేసులో త‌మ‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చేలా సుప్రీం కోర్టు మాజీ న్యాయ‌మూర్తి అల్లుడితో క‌ర్ణాట‌క బీజేపీ నాయ‌కుడు, బాదామి నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి బీ శ్రీ‌రాములు మంత‌నాలు జ‌రిపారంటూ కాంగ్రెస్ పార్టీ గురువారం విడుద‌ల చేసిన వీడియోతో క‌మ‌ల‌ద‌ళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీ మొత్తంలో లంచం ఇస్తామ‌ని శ్రీ‌రాములు, మ‌రికొంద‌రు అప్ప‌టి సీజేఐ జ‌స్టిస్ బాల‌కృష్ణ‌న్ అల్లుడితో డీల్ చేసిన‌ట్లు ఆ వీడియోలో ఉండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే.. జ‌స్టిస్ బాల‌కృష్ణ‌న్ ప‌ద‌వీవిర‌మ‌ణ‌కు ఒక్క‌రోజుముందు గాలి జ‌నార్ద‌న్‌రెడ్డికి అనుకూలంగా తీర్పురావ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఇది త‌ప్పుడు వీడియో అంటూ బీజేపీ కొట్టిపారేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*