సిద్ధూ ఎఫెక్ట్ తెలంగాణపై పడిందే…!

తెలంగాణలో ఈసారి పీసీసీకే సర్వాధికారాలు అప్పగించే యోచనలో అధిష్టానం లేనట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న టెన్ జన్ పథ్ పీసీసీ సూచనలేమీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ పీసీసీ రూపొందించిన జాబితాను వెనక్కు తిప్పి పంపడమే. కర్ణాటకలో సర్వ హక్కులూ సిద్ధరామయ్యకు ఇచ్చి చేతులు కాల్చుకున్న హస్తం పార్టీ మరోసారి ఏ రాష్ట్రంలోనూ ఆ తప్పు చేయదలచుకోలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ పై కూడా పడినట్లు కన్పిస్తోంది.

పీసీసీ నుంచి ఏఐసీసీకి జాబితా…..

ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓ జాబితాను రూపొందించింది. ఏ నేతకు ఏ పదవులు ఇవ్వాలో అందులో పేర్కొన్నారు. ఈ జాబితాను అధిష్టానానికి పంపింది. కాని హైకమాండ్ మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొన్ని షరతులు, నియమనిబంధనలను కూడా పెట్టి, తిరిగి జాబితాను రూపొందించి పంపాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో పీసీసీ నేతలు కంగుతిన్నారు. తాము రూపొందించిన జాబితా పకడ్బందీగా ఉన్నప్పటికీ అధిష్టానం ఎందుకు తిరస్కరించిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

అసంతృప్త నేతలను బుజ్జగించాలని…..

తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్త గళాలు ఎక్కువే. అందరూ సీనియర్లే. ఒకరి నాయకత్వంలో మరొకరు పనిచేయడానికి ఎవరూ ఇష్టపడరు. అలాగని మౌనంగా కూడా ఉండరు. తమ అసంతృప్తిని మీడియా ఎదుటే బహిరంగంగా మాట్లాడటం కాంగ్రెస్ నేతల నైజం. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పీసీసీ ఒక జాబితాను రూపొందించింది. ముఖ్యంగా అసంతృప్త నేతలను చల్లార్చేందుకు ఈ జాబితాను రూపొందించినట్లు కనపడుతోంది. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, ప్రచార కమిటీ, మేనిఫేస్టో కమిటీ, స్ట్రాటజీ కమిటీ, ఏఐసీసీ కార్యదర్శులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల పేర్లతో జాబితాను పకడ్బందీగానే రూపొందించారు.

పీసీసీ జాబితా వెనక్కు…?

వర్కింగ్ ప్రెసిడెంట్ గా భట్టి విక్రమార్కను తొలగించి ఆయన స్థానంలో సంపత్ కుమార్ ను నియమించాలని సిఫార్సు చేసింది. అలాగే బలరాంనాయక్, దానం నాగేందర్ లను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా నియమించాలని పీసీసీ సూచించింది. ప్రచార కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు, వైస్ ఛైర్మన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లను సిఫార్సు చేసింది. మేనిఫేస్టో కమిటీ ఛైర్మన్ గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కో ఛైర్మన్ గా డీకే అరుణ పేర్లను పేర్కొంది. ఇక వ్యూహకమిటీ ఛైర్మన్ గా సర్వే సత్యనారాయణ, వైస్ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి పేర్లను సిఫార్సు చేసింది. అయితే ఈ పేర్లను పరిశీలించిన అధిష్టానం పక్కన పెట్టినట్లు సమాచారం. మరోలిస్టును పంపాలని పీసీసీని ఆదేశించినట్లు చెబుతున్నారు. పదేళ్లు మంత్రులుగా, ముప్ఫయి ఏళ్లు ఎమ్మెల్యేగా, ఓటమి ఎరుగని వారి పేర్లను సూచించాలన్న షరతు కూడా విధించినట్లు తెలుస్తోంది. మరి పీసీసీ ఏం చేస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*