సిద్ధూలో ఇంత ఆనందమా? ఎందుకంటే?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫుల్లు ఖుషీగా ఉన్నారా? ఆయన లోలోపల ఎంతో సంతోష పడుతున్నారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. సిద్ధరామయ్య తన సంక్షేమ కార్యక్రమాలతోనే ఈసారి కూడా గట్టెక్కాస్తానని భావించారు. లింగాయత్ లలో కొంతమేరకైనా తనకు మద్దతు లభిస్తే తన విజయం నల్లేరు మీద నడకే అవుతుందని భావించారు. కాని కన్నడ ప్రజలు ఇవేమీ పట్టించుకోలేదు. ఒకరకంగా ఎవరీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. కొద్దోగోప్పో కమలం పార్టీ పక్షానే నిలబడ్డారు కన్నడ ప్రజలు.

ఎన్నికల ప్రచారంలోనూ…..

అయితే ఎన్నికల ప్రచారంలోనూ సిద్ధరామయ్య మోడీపైన, జేడీఎస్ పైన మామూలుగా ఫైరవ్వలేదు. ముఖ్యంగా కుమారస్వామిపై విరుచుకుపడ్డారు. జేడీఎస్, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడించాలని కూడా కామెంట్స్ చేశారు. చాముండేశ్వరిలో తనను ఓడించేందుకు బీజేపీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. కాని ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. కాంగ్రెస్ కు 78 స్థానాలే రావడం, జేడీఎస్ కు 38 సీట్లు దక్కడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జేడీఎస్ అధినేత కుమారస్వామిని సీఎం ను చేయాలనుకుంది. ఈ బంపర్ ఆఫర్ కు కుమారస్వామి వెంటనే ఓకే చెప్పేశారు.

యడ్యూరప్ప సీఎం కావడంతో……

వాస్తవానికి దేవెగౌడ అన్నా, జనతాదళ్ పార్టీతో పొత్తు అన్నా సిద్ధరామయ్యకు అస్సలు ఇష్టం లేదు. పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలి కాబట్టి పైకి అంగీకరించినా…కుమారస్వామి ముఖ్యమంత్రి అవ్వడం సిద్దూకు సుతారమూ ఇష్టం లేదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో హైకమాండ్ పెద్దలతో కలసి వెళ్లి దేవగౌడతో చర్చలు జరిపి వచ్చారు సిద్ధూ. ఆ సమావేశంలోనూ అన్యమనస్కంగా, కొంత ఇబ్బందిగానే కన్పించారు. అయితే ఉన్నట్లుండి గవర్నర్ ఆహ్వానంతో బీజేపీ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంతో సిద్ధూ ఫుల్లు ఖుషీగా ఉన్నారని చెబుతున్నారు. సిద్ధరామయ్య తొలుత జనతాదళ్ నేతే. అయితే దేవగౌడతో తలెత్తిన విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి సీఎం ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు తన శత్రువు సీఎం అవుతాడేమోనని ఆందోళన చెందిన సిద్ధరామయ్య జరుగుతున్న పరిణామాలతో ఫుల్లు హ్యపీలో ఉన్నారని చెబుతున్నారు. బయటకు మాత్రం కాంగ్రెస్ నేతలతో కలసి ఆందోళనలో పాల్గొంటున్నారు కాని, సిద్ధూ మనసులో మాత్రం కుమారస్వామికి అలా జరగాల్సిందేనని కోరుకుంటున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*