నా క్యారెక్టర్ ఇదీ…..!

పరమేశ్వర…కర్ణాటక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి….ఎన్నికలకు ముందు వరకూ కర్ణాటక పీసీసీ చీఫ్. ఎన్నికల అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యకు అనుంగు అనుచరుడిగా పనిచేశారు.అయితే కాలక్రమంలో ఆయన ముఖ్యమంత్రి కుమారస్వామి జట్టులో చేరిపోయారు. మంత్రి డీకే శివకుమార్, పరమేశ్వరలు కుమారస్వామితో కలసి కీలక నిర్ణయాలు తీసుకుంటుడటం సిద్ధరామయ్యకు మింగుడు పడలేదు. పరమేశ్వరను డమ్మీ చేయాలన్నదే సిద్ధరామయ్య లక్ష్యంగా కన్పిస్తుంది. వరుసగా జరుగుతున్న సంఘటనలు దీనికి అద్దం పడుతున్నాయంటున్నారు. సిద్ధరామయ్య యూరప్ ట్రిప్ వెళ్లిన నాటి నుంచే ఆయనకు తెలిసే ఇదంతా జరుగుతుందన్న అనుమానం పరమేశ్వరలో ఉన్నా ఏమీ చేయలేని స్థితి.

ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ…..

బెళగావి సోదరులు దాదాపు పదిహేను రోజులు హడావిడి చేశారు. దాదాపు 14 మంది ఎమ్మెల్యేలతో జంప్ అవుతున్నట్లు జర్క్ లు ఇచ్చారు. దీంతో కుమారస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా కలవరపడ్డారు. వీరు సిద్ధరామయ్యకు సన్నిహితులు కావడం విశేషం. ఆ తర్వాత యూరప్ ట్రిప్ ముగించుకుని సిద్ధరామయ్య చేరుకున్న తర్వాత పరిస్థితులు ఒక్కొక్కటిగా చక్కదిద్దారు. అసంతృప్తులను తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. అధిష్టానంతో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని వారికి నచ్చచెప్పి కుమారస్వామిని ఊపిరిపీల్చుకునేలా చేశారు. అలాగే మిగిలిన అసమ్మతి నేతలతోనూ విడివిడిగా సమావేశమై వారి డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు కొంత కుదుటపడ్డాయి.

పరమేశ్వర, కుమారస్వామిలకు…..

అయితే తానేంటో కుమారస్వామికి, పరమేశ్వరకు సిద్ధరామయ్య చెప్పకనే చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం కూలి పోతుందని ఆందోళనలో పడ్డ నేతలు ఇప్పడు ప్రశాంతంగా ఉండటానికి కారణం సిద్ధరామయ్య రాజకీయ చాతుర్యమేనన్నది హైకమాండ్ కూడా గుర్తించింది. అదే సిద్ధరామయ్యకు కావాల్సింది. తాను సమన్వయ సంఘానికి ఛైర్మన్ గా ఉన్నప్పటికీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, బదిలీల వంటి వాటిపై ఏకపక్ష నిర్ణయాలు కుమారస్వామి తీసుకుంటుండటం, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, డీకే శివకుమార్ లు మద్దతు పలకడం వంటివి సిద్ధూ చాలా సీరియస్ గానే తీసుకున్నట్లు చెబుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోకుండానే ఆ వాతావరణాన్ని సృష్టించి తన పరపతిని చూపాలనుకున్న సిద్ధూ ఈ విషయంలో సక్సెస్ అయ్యారంటున్నారు.

తాను లేనిదే…..

అందుకే బెంగళూరు నగర మేయర్ ఎంపికలోనూ పరమేశ్వరతో పాటు ప్రస్తుత పీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావులు సిద్ధరామయ్య వెంట నడవక తప్పలేదు. బెంగళూరు నగర మేయర్ గా సిద్ధరామయ్య ఎంపిక చేసిన గంగాబిక మల్లికార్జున అభ్యర్థిత్వానికి అందరూ ఓకే చెప్పాల్సి ఉంటుంది.కొందరు ఎమ్మెల్యల నుంచి గంగాబిక మల్లికార్జున అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా వారిచేతనే సర్ది చెప్పించారు సిద్ధరామయ్య. మొన్న సీఐల బదిలీలను కూడా రద్దుచేయించారు. కత్తెర తన చేతిలో ఉందన్న విషయాన్ని కుమారస్వామికి సిద్ధరామయ్య పరోక్ష హెచ్చరికలు జారీచేశారన్న గుసగుసలు పార్టీలో విన్పిస్తున్నాయి. మొత్తం మీద సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో తన క్యారెక్టర్ ఎంత అవసరమో చెప్పకనే చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*