ఎలా చెప్పను…? ఏమని చెప్పను….?

కర్ణాటక కాంగ్రెస్ నేతలకు దిక్కుతోచడం లేదు. ఒకవైపు అసమ్మతి వాదులు క్యాంప్ లకు వెళుతూ టెన్షన్ పుట్టిస్తుంటే….హైకమాండ్ మాత్రం మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేదని చెప్పడంతో కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేతలు అయోమయంలో పడ్డారు. విధాన పరిషత్ ఉపఎన్నికలు వచ్చే నెల 3వ తేదీన ఉన్నాయి. ఈ ఎన్నికల ముగిసిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని హైకమాండ్ చెప్పేసింది. అయితే అప్పటి వరకూ అసమ్మతి నేతలను ఎలా కట్టడి చేయాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. నిత్యం వారితో మాట్లాడుతూ టచ్ లో ఉంచుకుంటున్నారు.

నిత్యం గండమేనా?

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి నిత్యం గండం పొంచి ఉన్నట్లే కన్పిస్తోంది. అసమ్మతి వాదులు ఎప్పుడు ఏ స్టెప్ వేస్తారో తెలియక కాంగ్రెస్ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. అసమ్మతి నేతలు కొందరు ఇంకా ముంబయిలోనే మకాం వేసి ఉండటం వారిని కలవరానికి గురిచేస్తోంది. అయితే పైకి మాత్రం కాంగ్రెస్ శాసనసభ్యులంతా కలసి కట్టుగా ఉన్నారని, వారు ఎక్కడకూ వెళ్లలేదని చెబుతుండటం గమనార్హం. ముంబయిలో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంత ప్రయత్నించినా ఫలితం కన్పించలేదు.

సిద్ధూ చర్చలతో…….

ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలతో సిద్ధరామయ్య మాట్లాడి వారికి నచ్చ జెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అసమ్మతి నేతలందరూ సిద్ధరామయ్య మాటలు వింటారని అధిష్టానం ఆయననే రంగంలోకి దించింది. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఆ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్ పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటు బుజ్జగింపులు, అటు హెచ్చరికలతో కాంగ్రెస్ అగ్రనేతలు అసమ్మతి నేతలు దూకుడుగా వెళ్లకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారికి స్పష్టమైన హామీని సిద్ధరామయ్య ఇవ్వలేకపోతున్నారు.

స్పష్టమైన హామీలు ఇస్తూ……

ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య అసమ్మతి ఎమ్మెల్యే సుధాకర్ కు నచ్చజెప్పగలిగారు. ఆయనను తన నివాసానికి పిలిపించుకున్న సిద్ధరామయ్య దాదాపు గంటకు పైగానే చర్చించారు. అయితే ఎమ్మెల్యే సుధాకర్ మాత్రం తాను మంత్రి పదవి కోసం అసమ్మతి గళం విప్పలేదని, తన నియోజకవర్గంలో రాజకీయ జోక్యం పెరిగినందుకే తాను స్వరం పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ఎమ్మెల్యే సుధాకర్ కు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే హోస్కోటె ఎమ్మెల్యే ఎంటిబి నాగరాజు మాత్రం తనకు మంత్రి పదవి కావాల్సిందేనని పట్టుబట్టారు. ఆయనకు మంత్రి పదవిపై హామీ అధిష్టానం నుంచి రావడంతో ఆయన మెత్తబడినట్లు చెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో తుఫాను ముందు ప్రశాంతంలాగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*